Doctor Left Operation In Middle Of Delivery In Khammam: ఓ గర్భిణీ ప్రసవ వేదనతో ఆస్పత్రికి రాగా ఓ వైద్యుడు కాన్పు చేస్తూ మధ్యలోనే చేతులెత్తేసి నిర్లక్ష్యం ప్రదర్శించాడు. దీంతో మృత శిశువు జన్మించగా.. గర్భిణీ భర్త, ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఖమ్మం (Khammam) జిల్లా తల్లాడలో జరిగింది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడ మండలం మల్లారానికి చెందిన దడిపల్లి లావణ్యకు నెలలు నిండడంతో శుక్రవారం ఆమెను కాన్పు కోసం తల్లాడ పీహెచ్‌సీలో చేర్చారు. హీహెచ్సీ వైద్యుడు రత్నమనోహర్ సెలవులో ఉండగా ఇంఛార్జీ బాధ్యతలు నిర్వహిస్తోన్న అన్నారుగూడెం పల్లె ఆస్పత్రి వైద్యుడు వై.గోపి.. శుక్రవారం రాత్రి సిబ్బందితో కలిసి ప్రసవం చేసేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే, గర్భం నుంచి శిశువు కొంతమేర బయటకు రాగా.. మిగిలిన భాగం బయటకు రాలేదు. ఈ క్రమంలో గర్భిణీ పల్స్ రేట్ సైతం పడిపోయింది. దీంతో వైద్యుడు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించాలని సూచించారు. అయితే, ఈ సమయంలో ఎలా తీసుకెళ్తామని లావణ్య భర్త, ఆమె బంధువులు వైద్యుడు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. శిశువును వైద్యులు పూర్తిగా బయటకు తీయగా.. అప్పటికే ఉమ్మనీరు తాగి శిశువు మృతి చెందింది.


భర్త, బంధువుల ఆందోళన


అపస్మారక స్థితిలో ఉన్న బాలింతను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు, స్టాఫ్ నర్స్ నిర్లక్ష్యం వల్లే తమ శిశువు మృతి చెందిందని బాలింత భర్త, బంధువులు శనివారం హీహెచ్సీలో ఆందోళన చేపట్టారు. మొదటి కాన్పు ప్రైవేట్ ఆస్పత్రిలో చేయించామని.. ఆరోగ్య, ఆశ కార్యకర్తల ఒత్తిడితో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చామని చెప్పారు. ఇప్పుడు బిడ్డనే కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం లావణ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు తల్లాడ పీహెచ్సీ వైద్యాధికారి తెలిపారు.


Also Read: Hyderabad News: ఉప్పల్ మహిళ హత్య: శవాన్ని బాత్‌రూంలో పెట్టి తాళం - గంటల్లోనే కేసును చేధించిన పోలీసులు