Dead Body Found In Sand in Bapatla District: ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం ఇసుక ఆర్డర్ ఇచ్చాడు. వచ్చిన ఇసుకను వినియోగిస్తుండగా ఓ తల లేని మృతదేహాన్ని గుర్తించిన కూలీలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విషయాన్ని యజమానికి తెలియజేయగా ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ షాకింగ్ ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల (Bapatla) జిల్లా చీరాల (Cheerala) మండలం ఈపురుపాలెం గ్రామంలోని పద్మనాభునిపేటకు కాగితాల రాంబాబు అనే వ్యక్తి కొత్త ఇంటి నిర్మాణానికి పూనుకున్నాడు. ఇందులో భాగంగా ఓ 10 ట్రాక్టర్ల ఇసుక ఆర్డర్ ఇచ్చాడు. శుక్రవారం సాయంత్రం ఇసుకను ఇంటి ముందు పోశారు. కూలీలు ఇసుకను ఇంటి పునాదుల్లో క్రేన్ తో ఇసుక నింపుతుండగా.. ఓ తల లేని మృతదేహాన్ని గుర్తించారు. దీంతో ఒక్కసారిగా ఆందోళన చెంది యజమానికి విషయాన్ని తెలియజేశారు. ఆయన షాక్ తో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది. రోజు రోజుకూ ఇసుక మాఫియా రెచ్చిపోతుందని పలువురు ఆరోపిస్తున్నారు. అటు, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇసుకలో లభ్యమైన మృతదేహం 2 రోజుల క్రితం పూడ్చి పెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. జేసీబీతో ఇసుక తవ్వే క్రమంలో తల ఊడిపోయి ఉంటుందని.. అందుకే మొండెం మాత్రమే మిగిలిందని అనుమానిస్తున్నారు. మృతదేహం ఎవరిది..?. ఇసుకలోకి ఎలా వచ్చింది.? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 


Also Read: YS Sharmila: ఓవైపు వైఎస్ బిడ్డ, మరోవైపు హంతకుడు, మీరే తేల్చండి - ఆడబిడ్డలం కొంగుచాస్తున్నాం: షర్మిల