ఏఆర్ కానిస్టేబుల్ భానుప్రకాశ్‌ గొడవ రోజురోజుకు ముదురుతోంది. దళితుడిననే ఉద్దేశంతో... చిన్న చూపుతో కుట్రపూరితంగానే తనను అనంతపురం ఏఆర్ కానిస్టేబుల్ విధుల నుంచి తప్పించారని ఆరోపించారు భానుప్రకాశ్‌. టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అనంతపురం ఎస్పీ ఫకీరప్పపై ఫిర్యాదు చేశారు. ఎస్పీతోపాటు సీసీఎస్ డీఎస్పీ మహబూబ్ బాషా, ధర్మవరం డీఎస్పీ రమకాంత్, ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతు నలుగురి మీద మీద ఫిర్యాదు చేసినట్లు ప్రకాశ్‌ మీడియాకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట ప్రభుత్వం న్యాయం చేయని పక్షంలో కేంద్ర ప్రభుత్వం అయినా తనకు న్యాయం చేయాలని కోరారు. 


ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తనకు మద్దతు తెలపాలని కోరారు ప్రకాశ్‌. అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప కర్ణాటక మద్యం ఇక్కడకు తెప్పించి సొమ్ము చేసుకుంటున్నారని.. బళ్లారిలో 3 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఇళ్లు కట్టిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. అందులో భాగంగా రాయదుర్గం నుంచి ఒక సీఐని వీఆర్‌కు బదిలీ చేశారని ఆరోపించారు. ఎక్కువ మోతాదులో మద్యం తరలిస్తుండగా సీఐ పట్టుకున్నారని అందుకోసం అతన్ని బదిలీ చేసినట్టుగా తెలిసిందని ఆయన మీడియాకు తెలిపారు. అయితే భాను ప్రకాష్ ఫిర్యాదు ఆధారంగా అనంతపురం టు టౌన్ పోలీసులు ఎస్పీ ఫకీరప్పతో పాటు ఏఎస్పీ, డీఎస్పీలపై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్న సమయంలో ఎస్పీ ఫకీరప్ప టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం సీఐ శివరాముడు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు. 


డీఎస్పీ ఫకీరప్పతో పాటు మరో ఇద్దరిపై ఆరోపణలు..


ఎస్పీ, డీఎఎస్పీపై నమోదైన కేసుకు సంబంధించి డీఐజీ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతుందని సీఐ వెల్లడించారు. సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసులను కాపాడాలని.. భాను ప్రకాశ్‌ ప్లకార్డు ప్రదర్శించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పాత కేసులను తిరగదోడి తనను ఉద్యోగం నుంచి తొలగించినట్లు భాను ప్రకాశ్‌ ఆరోపించారు. మూడ్రోజుల క్రితం భాను ప్రకాశ్‌.. జిల్లా ఎస్పీ ఫకీరప్పతోపాటు ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతప్ప, సీసీఎస్ డీఎస్పీ మహబూబాషాసహా మరికొందరిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. 


భాను ప్రకాష్ పై పలు రకాలు కేసులున్నాయి..


ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్లకార్డులతో నిరసన తెలిపినందుకే ప్రకాశ్‌ను సర్వీస్ నుంచి తొలగించారని కొన్ని పార్టీలు ఆరోపించడం సరికాదని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప అన్నారు. తనతో అనుచితంగా ప్రవర్తించినట్లు 2018లో లక్ష్మీ అనే మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగానే కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ను డిస్మిస్ చేశామని అన్నారు. మరే ఇతర కారణాల వల్ల అతడిపై ఈ చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. అయితే ప్రకాశ్‌పై ఇప్పటికే 5 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఓ మహిళతో అనుచిత ప్రవర్తన, మహళా హోంగార్డును వేధించిన కేసులూ ఉన్నాయి. ఇంక్రిమెంట్లు వాయిదా, ఛార్జి మెమోలతో పాటు 8 పనిష్మెంట్లు ఉన్నాయన్నారు. 


30 రోజుల్లోగా కోర్టుకు వెళ్లొచ్చు..


2018లో ఘటన జరిగితే బాధితురాలు 2019 జులైలో స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేశారని.. దాని ఆధారంగానే డీఎస్పీతో మూడేళ్ల పాటు విచారణ జరిపించామని వివరించారు. 45 రోజుల వ్యవధిలో మూడు నోటీసులు పంపించామని తెలిపారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో చర్యలు తీసుకున్నామని ఎస్పీ వివరించారు. తన వాంగ్మూలాన్ని మార్చారాని బాధితురాలు ఇప్పుడు చెప్పడం సరికాదని అన్నారు. ఆమె మీడియాకు చూపించిన ఫిర్యాదు ప్రతులకు, ఈ చర్యలకు సంబంధం లేదని అన్నారు. తనకు అన్యాయం జరిగిందని ప్రకాశ్‌ భావిస్తే... 30 రోజల్లోగా అప్పీల్‌కు వెళ్లవచ్చని సూచించారు. పోలీసులు శాఖపై నిందలు వేయడం మానుకోవాలని అన్నారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.