Pregnant Died In A Road Accident In Medak: తెలంగాణలో బుధవారం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ గర్భిణీని లారీ ఢీకొని మృతి చెందగా.. గర్భస్థ శిశువు దాదాపు 10 మీటర్ల దూరంలో ఎగిరిపడిన ఘటన మెదక్ జిల్లాలో (Medak District) జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన పనేటీ రేణ (29) ఏడు నెలల గర్భిణీ. ఆమె బుధవారం ఓ వ్యక్తితో కలిసి బైక్‌పై తూప్రాన్ నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో మనోహరాబాద్ వద్ద జాతీయ రహదారిపై బైక్ యూటర్న్ తీసుకుంటుండగా.. ఓ లారీ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ఆమె పైనుంచి వెళ్లడంతో గర్భస్థ శిశువు తల్లి పేగు తెంచుకుని బయటకు వచ్చి 10 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారిపై మృతి చెందిన గర్భస్థ శిశువును చూసిన స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతురాలు మల్లుపల్లికి చెందిన మహిళగా గుర్తించారు. గ్రామానికి చెందిన పోచయ్య, రేణ దంపతులకు 9, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


బీర్ల లారీ బోల్తా


అటు, యాదాద్రి జిల్లాలో బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీ ఘోర ప్రమాదానికి గురై బీర్లన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్‌లోనే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లక్కారం స్టేజీ సమీపంలో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొని ప్రమాదం జరిగింది. ఇందులో ఒకటి ఉల్లిపాయల లోడు లారీ కాగా.. మరొకటి బీరు బాటిళ్ల లోడు లారీ. రెండు లారీల్లో సరుకు రోడ్డుపై పడిపోగా.. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని వాటిని తీసుకునేందుకు ఎగబడ్డారు. మందుబాబులు బీరు సీసాలు తెచ్చుకునేందుకు ఒకేసారి రహదారిపైకి రాగా.. ట్రాఫిక్ నిలిచిపోయింది.


సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేలా చర్యలు చేపట్టారు. రోడ్డుపై పడ్డ బీరు సీసాలను, ఉల్లిగడ్డలు చెల్లాచెదురుగా పడగా.. వాటిని స్వయంగా శుభ్రం చేసి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్పందించిన తీరు పట్ల వాహనదారులు ప్రశంసిస్తున్నారు.


Also Read: Hyderabad News: సినిమా ఛాన్స్‌లు ఇప్పిస్తామని అత్యాచారం- అసిస్టెంట్ డైరెక్టర్‌గా చెప్పుకునే సిద్దార్థ్ వర్మ అరెస్టు