Pushkar Singh Dhami | చమోలి: ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలోని మానా గ్రామంలో మంచు చరియలు విరిగి పడిన ఘటనలో నలుగురు మృతిచెందారు. మంచు కురుస్తుండటంతో దాన్ని తొలగించే క్రమంలో సిబ్బంది మీద మంచు చరియలు విరిగిపడ్డాయి. శుక్రవారం సిబ్బంది కొందర్ని కాపాడగా, శనివారం ఉదయం మరో 14 మందిని రెస్క్యూ టీమ్ కాపాడింది. వారిని మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రులకు తరలించారు. మంచులో 55 మంది చిక్కుకోగా, వారిలో 49 మందిని కాపాడింది సిబ్బంది. మరో ఆరు మంది మంచు కింద చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.

అయితే జోషిమత్‌‌లో హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతున్న వారిలో నలుగురు కార్మికులు మృతిచెందారు. మంచులో చిక్కుకున్న ఆరుగురిని రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మొదట పరిస్థితి విషమించి ఒకరు చనిపోయారని అధికారులు తెలిపారు. మరో ముగ్గురు సైతం చనిపోవడంతో.. మృతుల సంఖ్య  నాలుగుకు చేరింది. 

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శనివారం జోషిమత్‌లోని ఆర్మీ ఆసుపత్రిని సందర్శించారు. మానాలో మంచు చరియలు విరిగిపడి వాటి కింద చిక్కుకుని గాయపడిన వారిని పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

భారత సైన్యం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి శుక్రవారం 35 మందిని మంచు నుంచి రక్షించింది. శనివారం ఉదయం మరో 14 మంది పౌరులను రక్షించినట్లు భారత సైన్యం బ్రిగేడియర్ ఎంఎస్ ధిల్లాన్ తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు.చమోలిలోని మనాలో మంచు చరియలు విరిగి పడిన ప్రాంతాలను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శనివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు విరిగిన ఘటనపై పరిస్థితి గురించి ప్రధాని నరేంద్ర మోదీకి వివరించామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి అన్నారు. వీలైనంత త్వరగా మంచు కింద చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాం. కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. మిగిలిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు.

బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలోని చమోలి జిల్లాలో శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది. భారత్‌- టిబెట్‌ సరిహద్దులో ఉండి మన దేశంలో చివరి గ్రామాలలో ఒకటి అది. సముద్ర మట్టానికి 3,200 మీటర్ల ఎత్తులో జాతీయ రహదారిపై భారీగా పేరుకుపోయిన మంచును బీఆర్‌ఓ సిబ్బంది తొలగిస్తున్న క్రమంలో మంచు చరియలు విరిగిపడ్డాయి. మరోవైపు వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. ఐదు నుంచి 7 అడుగుల మంచులో కూరుకుపోయిన వారిని ఆర్మీ రక్షించింది. మరో ఆరుగురు మంచు కింద చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.