Haryana Gangster Yogesh Kadian: 



హరియాణా గ్యాంగ్‌స్టర్..


హరియాణాకి చెందిన గ్యాంగ్‌స్టర్‌పై ఇంటర్‌పోల్‌ (Interpol Red Corner Notice) రెడ్ కార్నర్ నోటీసులిచ్చింది. ఆ గ్యాంగ్‌స్టర్‌ పేరు యోగేశ్ కడియన్ (Yogesh Kadian). వయసు 19 ఏళ్లు. కానీ...ఈ యువకుడిపై హత్యాయత్నం కేసు నమోదైంది. అంతే కాదు. క్రిమినల్ హిస్టరీ ఉంది. ఆయుధ చట్టం కిందా కేసు నమోదైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతానికి యోగేశ్ ఇండియా నుంచి పారిపోయాడు. అమెరికాలో తల దాచుకుంటున్నాడు. NIA సంస్థ గ్యాంగ్‌స్టర్-టెర్రర్‌ నెట్‌వర్క్‌ ఆపరేషన్‌లో చాలా మంది గ్యాంగ్‌స్టర్‌లు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయినట్టు తేలింది. మరికొంత మంది ఫేక్ పాస్‌పోర్ట్‌లతో భారత్ నుంచి పారిపోయినట్టు గుర్తించారు. వాళ్లలో యోగేశ్ కడ్యన్ కూడా ఒకడు. NIA విచారణలో మరి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని చంపేందుకు యోగేశ్‌ సుపారీ కూడా తీసుకున్నట్టు సమాచారం. అమెరికాలో బబిన్హా గ్యాంగ్‌లో కీలక సభ్యుడిగా ఉన్నట్టు తెలుస్తోంది. 17 ఏళ్ల వయసులోనే ఫేక్‌ పాస్‌పోర్ట్‌తో అమెరికాకి పారిపోయాడు యోగేశ్. అప్పటి నుంచి లోకల్‌గా బబిన్హా గ్యాంగ్‌లో చేరిపోయాడు. అంతే కాదు. ఖలిస్థాన్ ఉగ్రవాదులతోనూ లింక్స్ ఉన్నట్టు అనుమానాలున్నాయి. దీనిపై NIA అధికారులు విచారణ చేపడుతున్నారు. భారత్‌లోని అతని స్థావరాల్లో సోదాలు నిర్వహించారు. యోగేశ్ గురించి సమాచారం అందించిన వారికి రూ.1.5 లక్షల రివార్డ్ ఇస్తామని ప్రకటించింది NIA. 


కొనసాగుతున్న అన్వేషణ..


రెడ్ కార్నర్ నోటీస్ అంటే...ఓ నిందితుడిని పట్టుకునేలా సహకరించాలని ఇంటర్‌పోల్‌లోని సభ్య దేశాలకు చెందిన లీగల్ అథారిటీస్‌కి రిక్వెస్ట్ చేసుకోవడం. గతంలో ఇంటర్‌పోల్‌ హిమాన్షు అలియాస్ భవూకి కూడా రెడ్‌ కార్నర్ నోటీసులిచ్చింది. ప్రస్తుతానికి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అహ్మదాబాద్‌ జైల్‌లో ఉన్నాడు. డ్రగ్ స్మగ్లింగ్‌ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. పంజాబ్‌కి చెందిన సింగర్ సిదూ మూసేవాలా (Sidhu Moosewala) హత్య కేసులోనూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు బిష్ణోయ్. 


మోదీకి బెదిరింపులు..


ఇటీవల ప్రధాని మోదీకి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.  National Investigation Agency (NIA)కి కొందరు ఆగంతకులు ప్రధాని మోదీని చంపేస్తామంటూ మెయిల్ పంపారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ( Narendra Modi stadium)ని పేల్చేస్తామనీ బెదిరించారు. రూ.500 కోట్లు ఇవ్వడంతో పాటు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్‌ని (Lawrence Bishnoi) విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మెయిల్ వచ్చిన వెంటనే NIA ముంబయి పోలీసులను అప్రమత్తం చేసింది. ప్రధానికి సెక్యూరిటీ ఇచ్చే ఏజెన్సీలన్నింటికీ ఈ మెయిల్‌ని ఫార్వర్డ్ చేసింది. గుజరాత్‌ పోలీసులూ అలెర్ట్ అయ్యారు. వాంఖడే స్టేడియంలో ఐదు వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో భద్రత ఏర్పాటు చేశారు. ఈ మెయిల్ తరవాత సెక్యూరిటీ పెంచారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుగొనే పనిలో పడ్డారు అధికారులు. అక్టోబర్ 5న ఉదయం ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. 


"మీ ప్రభుత్వం మాకు రూ.500 కోట్లు ఇవ్వాలి. లారెన్స్ బిష్ణోయ్‌ని వెంటనే విడుదల చేయాలి. ఇలా చేయకపోతే నరేంద్ర మోదీని చంపేస్తాం. నరేంద్ర మోదీ స్టేడియంనీ పేల్చేస్తాం. మీరెంత సెక్యూరిటీ పెంచినా సరే. మా నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మీరు మాట్లాడాలనుకుంటే ఈ మెయిల్‌లో రిప్లై ఇవ్వండి"


- NIAకి వచ్చిన మెయిల్‌లోని మ్యాటర్


Also Read: హమాస్ దాడులు కార్గిల్ యుద్ధాన్ని గుర్తు చేస్తున్నాయి - ABP న్యూస్‌తో ఆర్మీ మాజీ చీఫ్ జనరల్