Zomato Job Openings:


ఆర్థిక మాంద్యం  బూచితో విదేశీ టెక్‌ కంపెనీలు వేలాది మందిని (Tech layoffs) ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో జొమాటో ఫౌండర్‌, సీఈవో దీపిందర్‌ గోయెల్‌ చల్లని కబురు చెప్పారు. తమ కంపెనీలో 800 ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటించారు. ప్రతిభ, అర్హత కలిగిన ఉద్యోగార్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ మేరకు లింక్‌డ్‌ ఇన్‌లో ఓ పోస్టు పెట్టారు.


గ్రోత్‌ మేనేజర్లు, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజీనిర్లు, జొమాటో, హైపర్‌ ప్యూర్‌, బ్లింకిట్‌ సీఈవోలకు చీఫ్ ఆఫ్‌ స్టాఫ్‌ల పొజిషన్లు ఖాళీగా ఉన్నాయని దీపిందర్‌ గోయెల్‌ తెలిపారు. 'జొమాటొలో ఐదు విభాగాల్లో 800 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎవరైనా సమర్థులున్నారని భావిస్తే ఈ థ్రెడ్‌లో వారిని ట్యాగ్‌ చేయండి' అని లింక్‌డ్‌ ఇన్‌లో వెల్లడించారు. వివిధ ఉద్యోగాలకు సంబంధించిన ప్రొఫైళ్లను ఆయన పోస్టు చేయడం గమనార్హం.


'జొమాటో, హైపర్‌ ప్యూర్‌, బ్లింకిట్‌ సీఈవోలకు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌ అంటే చాలా ఉన్నతమైన ఉద్యోగం. ఫోర్స్‌ మల్టిప్లయర్‌గా పనిచేయాల్సి ఉంటుంది. సంస్థకు మినీ సీఈవోలుగా పనిచేస్తారు. జనరలిస్టు పోస్టులో ఉండేవాళ్లు జొమాటో నాయకత్వ బృందంతో సన్నిహితంగా పనిచేయాల్సి ఉంటుంది' అని దీపిందర్‌ గోయెల్‌ అన్నారు. ఇక గ్రోత్‌ మేనేజర్లు జొమాటో రెస్టారెండ్‌ భాగస్వాములతో కలిసి పనిచేయాలి. సుదీర్ఘ కాలం ఆరోగ్యకరమైన  ఆహార సరఫరా వ్యవస్థను సృష్టించాలి. ప్రొడక్ట్‌ మేనేజర్లు  వినియోగదారుల అభిప్రాయాలు, స్పందనలను సరళమైన, తేలికైన వ్యవస్థలు, ఉత్పత్తులుగా మార్చాల్సి ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు జొమాటోలో తర్వాతి తరం ఉత్పత్తులను డెవలప్‌ చేయాల్సి ఉంటుంది.


ఇక జొమాటో తన యాప్‌లోని "10 నిమిషాల్లోనే డెలివరీ" సేవను నిలిపివేసింది. దీనిని జొమాటో ఇన్‌స్టంట్ ‍‌(Zomato Instant) అని పిలుస్తారు. ఈ 10 మినిట్స్‌ సర్వీసును విస్తరించడంలో, ప్రజాదరణ పొందడంలో కంపెనీ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అసలే కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు, అనవసర భారం ఎందుకున్న భావనతో ఆ సర్వీసును ఆపేస్తూ జొమాటో నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్‌ భాగస్వాములకు కూడా ఈ విషయం గురించి ఈ కంపెనీ ఇటీవల సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.


ఆర్డర్‌ చేసిన '10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ' చేస్తామంటూ.. గత సంవత్సరం ‍‌(2022) మార్చి నెలలో గురుగ్రామ్‌లో ఈ సర్వీసును పైలెట్‌ ప్రాజెక్ట్‌గా జొమాటో ప్రారంభించింది. ఆ తర్వాత బెంగళూరుకు విస్తరించింది.


కనీస ఆర్డర్లు కూడా రావడం లేదు


వాస్తవానికి, '10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ' సేవలో కొన్ని ప్రాంతాల్లో బాగానే కంపెనీ విజయం సాధించింది. ఓవరాల్‌గా చూస్తే మాత్రం వృద్ధి ఆశించిన విధంగా లేదు. మెనూని విస్తరించడంలో అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎక్కువ ప్రాంతాల్లో '10 నిమిషాల డెలివరీ'కి తగినన్ని ఆర్డర్‌లను పొందలేకపోయింది. 


మార్కెట్‌లో పెరిగిన పోటీని తట్టుకుని, లాభాల్లోకి మారేందుకు ఇన్‌స్టంట్ సేవను జొమాటో ప్రారంభించింది. కనీస ఆర్డర్లు కూడా రాకపోవడంతో... లాభాల సంగతి అటు ఉంచి, స్థిర వ్యయాలకు సరిపోయే మొత్తాన్ని కూడా ఆర్జించలేకపోయింది. స్థిర వ్యయాలను భర్తీ చేయగల మినిమమ్‌ ఆర్డర్లు రాకపోవడమే దీనికి కారణం.