How to Gift A Credit Card: ఇష్టమైన వాళ్లకు ఇచ్చేందుకు బోలెడు బహుమతులు ఉన్నాయి. అందునా, పండుగ సమయంలో ఇచ్చే బహుమతులు మరింత పసందుగా ఉంటాయి. ప్రస్తుతం, ఫెస్టివ్‌ గిఫ్ట్స్‌లో (Festive gifting) లెక్కలేనన్ని ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల కోసం సరైన బహుమతిని కనిపెట్టడంలో చాలా మంది కష్టపడుతుంటారు. మీరు విభిన్నంగా ఆలోచించి, క్రెడిట్ కార్డ్ రూపంలో ప్రత్యేకమైన బహుమతిని ఇవ్వండి. ఇది, మీ క్రెడిట్ స్కోర్‌ను కూడా పెంచుతుంది. 


మీరు మీ పేరిట ఉన్న క్రెడిట్‌ కార్డ్‌ను ఇంకొకరికి ఇవ్వకూడదు. లేదా, మీ క్రెడిట్ కార్డ్‌ను వేరొకరికి బదిలీ చేయలేరు. కానీ, మీ క్రెడిట్‌ కార్డ్‌లో ఉన్న అన్ని సౌలభ్యాలను వినియోగించుకునేలా యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. 


యాడ్-ఆన్ కార్డ్ అంటే?
చాలా బ్యాంకులు, కస్టమర్‌ క్రెడిట్ కార్డ్ ఖాతాలో జీవిత భాగస్వామిని, పిల్లలు (18 ఏళ్లు పైబడినవారు) లేదా తల్లిదండ్రులు వంటి కుటుంబ సభ్యులను యాడ్‌ చేసుకోవడానికి అనుమతిస్తాయి. వీరిని యాడ్-ఆన్ కార్డ్‌హోల్డర్‌లు అంటారు. యాడ్-ఆన్ కార్డ్‌హోల్డర్‌ల పేరిట ప్రత్యేక క్రెడిట్‌ కార్డ్‌ వస్తుంది. ఇది, ప్రైమరీ కార్డ్‌హోల్డర్‌ ఖాతాతో ముడిపడి ఉంటుంది. 


-- యాడ్-ఆన్ కార్డ్‌హోల్డర్‌ చేసే అన్ని లావాదేవీలకు ప్రాథమిక కార్డ్‌హోల్డర్‌ బాధ్యత వహిస్తారు.
-- క్రెడిట్ పరిమితి ప్రైమరీ & యాడ్-ఆన్ కార్డ్ మధ్య షేర్‌ అవుతుంది. దీని అర్థం.. ప్రాథమిక కార్డ్ మొత్తం క్రెడిట్ పరిమితికి మించి యాడ్-ఆన్ కార్డ్‌హోల్డర్లు కొనుగోళ్లు చేయలేరు.
-- యాడ్-ఆన్ కార్డ్‌ విషయంలో రివార్డ్ పాయింట్‌లు, క్యాష్‌బ్యాక్, బీమా కవరేజ్ వంటి అన్ని బెనిఫిట్స్‌ ప్రైమరీ కార్డ్ లాగానే ఉంటాయి.


యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
సాధారణంగా, బ్యాంకులు యాడ్-ఆన్ కార్డ్‌లను జారీ చేస్తాయి. మీరు కార్డ్‌ను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న వ్యక్తికి బ్యాంక్‌ నిర్దేశించిన అన్ని అర్హతలు ఉన్నయో, లేవో ముందుగా చెక్‌ చేయాలి. యాడ్-ఆన్ కార్డ్‌ పొందే అన్ని అర్హతలు ఉంటే, దాని కోసం ప్రైమరీ కార్డ్‌హోల్డర్‌ దరఖాస్తు చేయాలి. బ్యాంక్‌ మొబైల్ యాప్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, బ్రాంచ్‌కు వెళ్లి అప్లై చేయొచ్చు. మీరు బ్రాంచ్‌కు వెళితే... యాడ్-ఆన్ కార్డ్‌హోల్డర్‌ ID రుజువు, చిరునామా రుజువు, ఫోటో వంటి అవసరమైన పత్రాలు తీసుకెళ్లండి. ప్రాథమిక కార్డ్‌హోల్డర్‌ అర్హత, క్రెడిట్ స్కోర్‌లను బట్టి బ్యాంకులు కొన్నిసార్లు ముందస్తుగా ప్రి-అప్రూవ్డ్‌ యాడ్-ఆన్ కార్డ్‌లను అందిస్తాయి. ఇలాంటి కేస్‌లో ప్రాసెస్‌ అతి వేగంగా పూర్తవుతుంది.


అప్లికేషన్‌ను బ్యాంక్‌ ఆమోదిస్తే, మీరు యాడ్‌ చేసిన వ్యక్తి పేరు మీద బ్యాంక్ యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్‌ని జారీ చేస్తుంది. ఈ కార్డ్‌ను యాడ్‌-ఆన్‌ కార్డ్‌హోల్డర్‌ స్వతంత్రంగా ఉపయోగించుకోవచ్చు. ఆ బిల్లు ప్రైమరీ కార్డ్‌హోల్డర్‌ ఖాతాకు యాడ్‌ అవుతుంది.


ప్రి-పెయిడ్‌ కార్డులు (Prepaid Cards)
గిఫ్ట్‌గా ఇవ్వదగిన వాటిలో ఇదొక టైప్‌. ఈ కార్డ్‌లో ముందుగానే బ్యాలెన్స్‌ లోడ్‌ ‍‌(pre-loaded balance) చేస్తారు. దీనిలో బ్యాలెన్స్‌ ఉన్నంతవరకు ఖర్చు చేసుకోవచ్చు. ప్రి-లోడెడ్ బ్యాలెన్స్‌తో వస్తుంది కాబట్టి దీనిపై ఎలాంటి వడ్డీ ఛార్జీలు లేదా పెనాల్టీలు ఉండవు. అంతేకాదు, పరిమితికి మించి ఖర్చు పెట్టే ప్రమాదంమూ లేదు. ప్రి-పెయిడ్‌ కార్డ్‌లను చాలా షాపులు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో ఆమోదిస్తారు.


ప్రి-పెయిడ్‌ కార్డ్‌ను ఎలా బహుమతిగా ఇవ్వాలి? (How to Gift a Prepaid Card?)
ప్రి-పెయిడ్‌ కార్డ్‌ను బహుమతిగా ఇవ్వాలంటే, ముందుగా, దానిని ఒక బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి కొనుగోలు చేయాలి. మీకు ఇష్టం వచ్చినంత డబ్బును ఆ కార్డ్‌లో లోడ్ చేయొచ్చు. ఆ కార్డ్‌ను మీకు ఇష్టమైనవారికి గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ప్రి-పెయిడ్‌ కార్డులను వాడడం చాలా ఈజీ. పైగా, భద్రతను & నగదు రహిత లావాదేవీల సౌకర్యాన్ని అందిస్తాయి.


మరో ఆసక్తికర కథనం: రైల్లో బాణసంచా తీసుకెళ్తున్నారా? - జైల్లో దీపావళి జరుపుకోవాల్సి వస్తుంది