Railway Rules For Carrying Crackers In Train: మరికొన్ని రోజుల్లో దీపావళి పండుగ వస్తుంది. ఇప్పటికే, దేశవ్యాప్తంగా దీపావళి షాపింగ్ (Divali 2024 Shopping) జోరుగా సాగుతోంది. కొత్త బట్టలు, చెప్పులు, మిఠాయిలు, ఇంట్లోకి కావలసిన సరకులు, గృహాలంకరణ వస్తువులతో పాటు బాణాసంచా కూడా దీపావళి షాపింగ్ లిస్ట్‌లో ఉంటుంది. వాస్తవానికి, ఇదే అత్యంత కీలకమైంది. దీపావళి అంటేనే క్రాకర్స్ వెలగాలి, చెవులు చిల్లులు పడేలా మోతలు మోగాలి. వెలుగులు, మోతలు లేకుండా దీపావళి జరగదేమో. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అప్పుడే బాణసంచా దుకాణాలు కూడా వెలిశాయి. పటాకుల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వాయు కాలుష్యం కారణంగా, దిల్లీలో బాణసంచా కాల్చడంపై నిషేధం విధించారు. కానీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం దీపావళి క్రాకర్స్‌పై నిషేధం లేదు. ఎలాంటి ఆంక్షలు లేకుండా కాల్చొచ్చు, పేల్చొచ్చు.
మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పటాకుల తయారీ యూనిట్లు ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో బాణసంచా బాగా చౌకగా లభిస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా అలాంటి చోట్లకు వెళ్లి ప్రజలు బాణసంచా కొంటారు. కొంతమంది క్రాకర్ బాక్స్‌లను గిఫ్ట్‌గా కూడా ఇస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో... టపాసులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లాల్సి వస్తుంది. మరి.. రైల్లో క్రాకర్స్‌ను తీసుకెళ్లొచ్చా?. దీనికి సంబంధించి భారతీయ రైల్వే ఏవైనా రూల్స్ పెట్టిందా?.
క్రాకర్స్‌కు రైల్లో నో ఎంట్రీ
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, రైలులో ప్రయాణించేటప్పుడు కొన్ని వస్తువులను తీసుకెళ్లడంపై నిషేధం ఉంది. ఆ వస్తువుల వల్ల రైలు భద్రత, ప్రయాణికుల భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. రైల్వే రూల్స్‌ను చూస్తే... రైలులో ప్రయాణిస్తున్నప్పుడు గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్, మండే రసాయనాలు, పెట్రోల్ & డీజిల్ వంటి ఇంధనాలు, యాసిడ్, దుర్వాసన వచ్చే వస్తువులు, కత్తుల వంటి పదునైన వస్తువులు, విరిగిపోయే లేదా కారిపోయే వస్తువులను అనుమతించరు. ఇలాంటి వస్తువుల ప్రయాణికులు సమస్యలు ఎదుర్కోవచ్చు. కాబట్టి, పైన చెప్పినవన్నీ నిషేధిత జాబితాలోకి చేరాయి. వీటితో పాటు దీపావళి బాణసంచా కూడా నిషేధిత జాబితాలో ఉంది. ఈ రూల్ ప్రకారం, రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులెవరూ టపాసులు వెంట తీసుకెళ్లకూడదు. దీనిని ధిక్కరిస్తే కోరిమరీ సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుంది.
3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడొచ్చు
నిషేధిత వస్తువులను వెంట తీసుకెళ్తున్న ప్రయాణీకులను అడ్డుకునే అధికారం రైల్వే అధికార్లకు ఉంది. అలాంటి ప్రయాణీకులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 164 ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. ప్రయాణీకులు వెయ్యి రూపాయల వరకు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడొచ్చు. కేసు తీవ్రతను బట్టి ఈ రెండింటినీ ఒకేసారి విధించవచ్చు.
బాణసంచాకు మండే స్వభావం అత్యధికంగా ఉంటుంది. అది అంటుకోవడానికి మంటే అక్కర్లేదు, కాస్త వేడి తగినా చాలు. రైల్లో బాణసంచా పేలితే రైలు బోగీకి కూడా మంటలు అంటుకునే ప్రమాదం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగొచ్చు. అందుకే భారతీయ రైల్వే విభాగం రైల్లోకి బాణసంచా తీసుకురావడాన్ని నిషేధించింది.
మరో ఆసక్తికర కథనం: పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ - ఈ వ్యాపారాల్లో లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది!