Year Ender 2022: 2022లో, ఇన్వెస్టర్ల సంపదను గంగలో కలిపిన టాప్-5 కంపెనీలతో ఒక జాబితా విడుదలైంది. ఈ 5 కంపెనీల షేర్లు కొన్న వాళ్ల డబ్బు 50 శాతం నుంచి 66 శాతం వరకు హరించుకుపోయింది. ఈ వెల్త్ డిస్ట్రాయర్లలో మొదటి 4 న్యూ ఏజ్ టెక్నాలజీ కంపెనీలు కాగా, వీటిలోనూ 3 సంస్థలు స్టార్టప్ ఎకోసిస్టమ్ నుంచి వచ్చినవి కావడం విశేషం.
టాప్-5 వెల్త్ డిస్ట్రాయర్లు:
1. వన్97 కమ్యూనికేషన్స్ (One97 Communications - Paytm)
ఛైర్మన్ & CEO: విజయ్ శేఖర్ శర్మ
2022లో ఇప్పటి వరకు నష్టం: 65.6%
ప్రస్తుత మార్కెట్ విలువ: రూ. 36,737 కోట్లు
దేశంలో అతి పెద్ద IPO (అప్పటికి) అన్న ఘతన నుంచి అతి పెద్ద సంపద విధ్వంసక సంస్థ స్థాయికి పడిపోయింది. కంపెనీ నికర నష్టాలు, సంక్లిష్టమైన వ్యాపార నమూనా వల్ల పెట్టుబడిదారుల నమ్మకాన్ని నిలబెట్టుకోలేక పోయింది. ఈ ఏడాది (2022) నవంబర్‌లో ప్రీ-ఐపీవో వాటాదారులకు ఒక సంవత్సరం లాక్-ఇన్ గడువు ముగియడంతో, భారీగా అమ్మకాలు జరిగి స్టాక్ ధరను మరింత దిగజార్చాయి.
2. జెన్సార్ టెక్నాలజీస్ (Zensar Technologies)
ఛైర్మన్: హర్ష్ గోయెంకా
CEO: అజయ్ భూటోరియా
2022లో ఇప్పటి వరకు నష్టం: 52.7%
ప్రస్తుత మార్కెట్ విలువ: రూ. 4,918 కోట్లు
2021లో బలమైన బుల్ రన్ చేసింది. 2022 సంవత్సరంలో ఏర్పడిన ప్రపంచ స్థాయి సవాళ్ల వల్ల భారీగా దెబ్బతింది, క్లయింట్ ఖర్చు మీద ఎక్కువ ప్రభావం పడింది. ఫలితంగా, ప్రాజెక్ట్‌లు రద్దయ్యాయి లేదా ఆలస్యం అయ్యాయి. ఆర్డర్ పరిమాణం తగ్గింది. అట్రిషన్ తగ్గించేందుకు వేతనాల పెంపుదల కూడా సంస్థ లాభదాయకతను దెబ్బతీసింది.
3. జొమాటో (Zomato)
చైర్మన్: కౌశిక్ దత్తా
CEO: దీపిందర్ గోయల్
2022లో ఇప్పటి వరకు నష్టం: 51.3%
ప్రస్తుత మార్కెట్ విలువ: రూ. 55,871.84 కోట్లు
2021లో బంపర్ లిస్టింగ్‌ను చూసిన ఈ స్టార్టప్, ఆ తర్వాత పెట్టుబడిదారుల ఆసక్తిని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. కంపెనీ వ్యాపార నమూనా, త్రైమాసిక ఫలితాల్లో బలహీనత, తిరిగి బలాన్ని చేకూర్చే ఆర్థిక అంశాలు లేకపోవడం, అధిక వాల్యుయేషన్లు ఈ స్టాక్ ధరలో భారీ పతనానికి ప్రధాన కారణాలు.
4. ఎఫ్‌ఎస్‌ఎన్ ఈ-కామర్స్ వెంచర్స్ (FSN E-Commerce Ventures - Nykaa)
ఛైర్మన్ & CEO: ఫల్గుణి నాయర్
2022లో ఇప్పటి వరకు నష్టం: 50.8%
ప్రస్తుత మార్కెట్ విలువ: రూ. 55,871 కోట్లు
అతి పెద్ద బ్యూటీ &కాస్మొటిక్ ఉత్పత్తుల ఈ-రిటైలర్, లిస్టింగ్ తర్వాత లాభాల్లో తగ్గుదలను నివేదించింది. Ajio, Tata Cliq, Myntra వంటి ఇతర పెద్ద ఆన్‌లైన్ ప్లేయర్లు కూడా ఈ విభాగంలోకి ప్రవేశించడంతో, నైకా భవిష్యత్తు, ఆదాయ వృద్ధి మీద మదుపరుల్లో నమ్మకం తగ్గింది. ఫ్యాషన్ సెగ్మెంట్ నుంచి కొనసాగుతున్న నష్టాలు కూడా కంపెనీ మొత్తం లాభదాయకతను దెబ్బతీస్తున్నాయి.
5. గ్లాండ్ ఫార్మా (Gland Pharma)
చైర్మన్: యు క్వాన్ స్టాన్లీ లూ
CEO: శ్రీనివాస్ సాదు
2022లో ఇప్పటి వరకు నష్టం: 50.7%
ప్రస్తుత మార్కెట్ విలువ: రూ. 28,959 కోట్లు
చైనా కంపెనీ యాజమాన్యంలో నడుస్తున్న ఈ ఫార్మా కంపెనీ, తన ప్రధాన మార్కెట్లయిన US & యూరప్ లాభాల్లో గత కొన్ని త్రైమాసికాలుగా భారీ క్షీణతను చూస్తోంది. కొన్ని ఉత్పత్తుల విలువ బాగా పడిపోవడం దీనికి కారణం. చైనీస్ ప్రమోటర్ కంపెనీ అయిన ఫోసున్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ చాలా తక్కువ విలువకు గ్లాండ్ ఫార్మా షేర్లను అమ్మడం, ఆదాయాలు & RoEని (return on equity) తగ్గించిన Cenexi కొనుగోలు వంటివి పెట్టుబడిదారుల్లో ఆందోళనలు పెంచాయి. ఫలితంగా, వచ్చిన ధరకు షేర్లను భారీ స్థాయిలో అమ్మేసి బయటపడ్డారు.