షావోమి ఇండియా చిక్కుల్లో పడింది! రూ.653 కోట్లు కస్టమ్స్‌ సుంకం ఎగవేతకు పాల్పడినట్టు తెలిసింది. ది డైరెక్టరేట్‌ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) ఎగవేతను గుర్తించి షావోమి టెక్నాలజీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (షామి ఇండియా)కు మూడు షోకాజ్‌ నోటీసులు పంపించింది.


భారత్‌లో ఎంఐ బ్రాండ్‌తో షావోమి ఇండియా మొబైల్స్‌ను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్లలో కొన్నింటిని విదేశాల నుంచి షావోమి ఇండియా దిగుమతి చేసుకుంటుంది. లేదంటే విడి పరికాలను ఒప్పంద తయారీదారుల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడే అసెంబుల్డ్‌ చేస్తుంది. దేశంలోని స్మార్ట్‌ఫోన్‌ విపణిలో షావోమికి గణనీయమైన వాటానే ఉంది.


విలువను తగ్గించి షావోమి ఇండియా కస్టమ్స్‌ సుంకం ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించామని డీఆర్‌ఐ తెలిపింది. సంబంధిత కంపెనీ, ఒప్పంద తయారీ సంస్థల్లో పరిశోధన చేపట్టామని పేర్కొంది. దర్యాప్తులో షామి ఇండియా ప్రాంగణంలో అనుమానాస్పందంగా కనిపించిన పత్రాలను డీఆర్‌ఐ స్వాధీనం చేసుకుంది. ఒప్పంద నిబంధన ప్రకారం క్వాల్‌కామ్‌ యూఎస్‌ఏ, బీజింగ్‌ షావోమి మొబైల్స్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ లిమిటెడ్‌కు షావోమి ఇండియా రాయల్టీ, లైసెన్స్‌ ఫీజు చెల్లిస్తున్నట్టు గుర్తించింది.






'షావోమి ఇండియా, సంబంధిత తయారీ కంపెనీల్లోని కీలక ఉద్యోగుల స్టేట్‌మెంట్లను రికార్డు చేశాం. షావోమి కంపెనీ డైరెక్టర్‌ ఒకరు రాయల్టీ చెల్లించినట్టు ధ్రువీకరించారు' అని డీఆర్‌ఐ ప్రకటించింది. రాయల్టీ, లైసెన్స్‌ ఫీజు చెల్లించడమే కాకుండా ఒప్పంద తయారీదారుల నుంచి దిగుమతి చేసుకున్న ఉత్పత్తి లావాదేవీల విలువను జోడించలేదని వెల్లడించింది. దీంతో షావోమి ఇండియా కస్టమ్స్‌ సుంకం ఎగవేసినట్టు గుర్తించామని పేర్కొంది.


'డీఆర్‌ఐ దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత షావోమి టెక్నాలజీస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి 01-4-2017 నుంచి 30-06-2020 కాలానికి రూ.653 కోట్లు రికవరీకి డిమాండ్‌ చేస్తూ షోకాజ్‌ నోటీసులు జారీ చేశాం. 1962, కస్టమ్స్‌ చట్టం ప్రకారం వీటిని జారీ చేశాం' అని డీఆర్‌ఐ తెలిపింది.