WPI Inflation:
వినియోగదారులకు శుభవార్త! నవంబర్ నెలలో టోకు ధరల ద్రవ్యోల్బణం 21 నెలల కనిష్ఠానికి తగ్గింది. వార్షిక ప్రాతిపదికన 5.85 శాతంగా నమోదైంది. అక్టోబర్లోని 8.39 శాతంతో పోలిస్తే బాగా తగ్గిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
'గతేడాదితో పోలిస్తే ఆహారం, ఆహార పదార్థాలు, ప్రాథమిక లోహాలు, వస్త్రాలు, రసాయనాలు, రసాయన ఉత్పత్తులు, కాగితం, కాగితం ఉత్పత్తుల ధరలు తగ్గడంతో ఈ ఏడాది నవంబర్లో ద్రవ్యోల్బణం తగ్గింది' అని కామర్స్ మినిస్ట్రీ వెల్లడించింది.
నెలవారీ ప్రాతిపదికన అక్టోబర్లోని 0.39 శాతం పెరుగుదలతో పోలిస్తే నవంబర్లో 0.26 శాతం తగ్గింది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం అక్టోబర్లో 8.33 శాతం ఉండగా నవంబర్లో 2.17 శాతంగా నమోదైంది. అంతకు ముందు నెల్లో ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం 11.04 శాతం ఉండగా నవంబర్లో 5.52 శాతంగా ఉంది.
క్రూడ్ పెట్రోలియం, సహజ వాయువు ద్రవ్యోల్బణం మాత్రం స్వల్పంగా పెరిగింది. అక్టోబర్లో 43.57 శాతంగా ఉంటే నవంబర్లో 48.23 శాతానికి చేరుకుంది.
వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం సైతం నవంబర్లో తగ్గుముఖం పట్టడం విశేషం. వార్షిక ప్రాతపదికన 11 నెలల కనిష్ఠమైన 5.88 శాతానికి దిగొచ్చింది. అక్టోబర్లో మాత్రం ఇది 6.77 శాతంగా ఉండటం గమనార్హం.
ద్రవ్యోల్బణాన్ని 6 శాతం కన్నా తక్కువగా ఉంచాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్లో అది సాధ్యమైంది. కాగా ఇదే సమయంలో గతేడాది ద్రవ్యోల్బణం 4.91 శాతమే కావడం గమనార్హం.