Biggest Companies In The World: ఈ ఏడాది ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీల జాబితాలో చాలా అప్‌డేషన్స్‌ వస్తున్నాయి. చాలా కాలం తర్వాత, ఆపిల్‌ను వెనక్కి నెట్టి మైక్రోసాఫ్ట్‌ మొదటి స్థానాన్ని ఆక్రమించగా, ఇప్పుడు ఎన్‌విడియా ‍‌(Nvidia) వంతు వచ్చింది. మార్కెట్‌ విలువను (Market Capitalization) భారీగా పెంచుకున్న ఈ కంపెనీ, ఆపిల్‌ను దాటి ముందుకు దూసుకెళ్లింది.


ప్రస్తుతం, ఎన్‌విడియా మార్కెట్ విలువ 3 ట్రిలియన్‌ డాలర్ల (3 లక్షల కోట్ల డాలర్లు) మైలురాయిని దాటింది. ప్రపంచంలో ఈ బెంచ్‌మార్క్‌ అందుకున్న మూడో కంపెనీ ఇది. ఎన్‌విడియా కంటే ముందు మైక్రోసాఫ్ట్, ఆపిల్‌ మాత్రమే ఈ ఘనత సాధించాయి.


ప్రస్తుతం, ఎన్‌విడియా మార్కెట్ క్యాపిటలైజేషన్ 3.011 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది, ప్రపంచంలోనే రెండో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ఈ సంస్థ మార్కెట్‌ విలువ గత 3 నెలల్లోనే సుమారు 1 ట్రిలియన్ డాలర్లు (లక్ష కోట్ల డాలర్లు) పెరిగింది. ఈ నెల 7వ తేదీన ఈ షేర్ల విభజన ఉంది. దీంతో, అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్‌లో ఎన్‌విడియా షేర్లకు గిరాకీ గణనీయంగా పెరిగింది. ఫలితంగా షేర్‌ ధర దూసుకెళ్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఎన్‌విడియా షేర్ల విలువ ఏకంగా 147 శాతం పెరిగింది. గత నెల 22 నుంచి స్టాక్‌ విలువ దాదాపు 30 శాతం జంప్‌ చేసింది. అత్యాధునిక ప్రాసెసర్ల తయారీకి ఎన్‌విడియా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం, అన్ని రంగాల్లో కృత్రిమ మేధ (Artificial Intelligence లేదా AI) అవసరం పెరుగుతోంది. ఈ టెక్నాలజీ కోసం అత్యాధునిక ప్రాసెసర్లు అవసరం. ఈ డిమాండ్‌ను ఎన్‌విడియా ఎన్‌క్యాష్‌ చేసుకుంటోంది. 


టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ‍‌(Microsoft) ఈ సంవత్సరం మళ్లీ ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీగా అవతరించింది. ఈ కంపెనీ చాలా కాలం పాటు ఆపిల్ నీడలో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్ 3.151 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఎన్‌విడియా మార్కెట్‌ విలువ దీనికి దగ్గరగా ఉండడంతో, మైక్రోసాఫ్ట్ స్థానానికి కూడా ఎన్‌విడియా నుంచి ముప్పు పొంచి ఉంది.


ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా చాలా కాలం అధికారం చెలాయించిన ఆపిల్‌ (Apple), ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది. 2007లో ఐఫోన్‌ (iPhone) సేల్స్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఆపిల్‌ స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. అయితే, ఇప్పుడు ఈ కంపెనీ వృద్ధి రేటు మందగించింది. దీంతో తన స్థానాన్ని ఎన్‌విడియాకు వదులుకోక తప్పలేదు. ఆపిల్‌ మార్కెట్ క్యాప్ ఇప్పుడు 3.003 ట్రిలియన్ డాలర్లు.


విలువ పరంగా ప్రపంచంలోని పెద్ద కంపెనీల్లో... గూగుల్‌ (Google) మాతృ సంస్థ ఆల్ఫాబెట్ (Alphabet) ఫోర్త్‌ ర్యాంక్‌ సాధించింది. దీని ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.177 ట్రిలియన్ డాలర్లు. అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోసం పెరుగుతున్న డిమాండ్ నుంచి గూగుల్ భారీగా లాభపడుతోంది.


జెఫ్ బెజోస్‌కు చెందిన అమెజాన్ (Amazon), మార్కెట్ క్యాప్ పరంగా ప్రపంచంలో ఐదో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా నిలిచింది. దీని మార్కెట్‌ విలువ ప్రస్తుతం 1.886 ట్రిలియన్ డాలర్లు. విశేషం ఏంటంటే... మార్కెట్‌ విలువ ప్రకారం ప్రపంచంలోని ఐదు అతి పెద్ద కంపెనీలూ అమెరికాకు చెందినవే.


సౌదీ అరేబియాకు చెందిన సౌదీ అరామ్‌కో (Saudi Aramco) గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఒకప్పుడు ప్రపంచంలోనే రెండో అతి పెద్ద కంపెనీ హోదాను అనుభవించిన ఈ సంస్థ, ప్రస్తుతం ఆరో స్థానానికి పడిపోయింది. దీని మార్కెట్‌ విలువ ప్రస్తుతం 1.820 ట్రిలియన్ డాలర్లు.


మరో ఆసక్తికర కథనం: మీ కంట్రోల్‌లో విమానం టిక్కెట్‌ రేట్లు - కొత్త ఫెసిలిటీ ప్రారంభించిన ఎయిర్‌ ఇండియా