Aadhaar Card:  భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.17 కోట్లకు పైగా 12 అంకెల ఆధార్ నంబర్‌లను డీయాక్టివేట్ చేసింది. మరణించిన వ్యక్తుల ఆధార్ నంబర్‌లను దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంది.  

ఫ్యామిలీ మెంబర్ చనిపోయిన సంగతి చెప్పేందుకు ప్రత్యేక సెగ్మెంట్

ఈ ప్రయత్నంలో భాగంగా, UIDAI 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదైన మృతుల వివరాలు నమోదు చేసందుకు myAadhaar పోర్టల్‌లో మార్పులు చేసింది. కొత్త సర్వీస్ తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్తగా పెట్టిన Reporting of Death of a Family Member సర్వీస్ ద్వారా మృతుల వివరాలు తెలియజేయవచ్చు. కుటుంబ సభ్యుడు మరణించినప్పుడు, వ్యక్తి పోర్టల్‌లో సమాచారం అందించవచ్చు. 

చనిపోయిన వారి వివరాలు అందిన వెంటనే ధ్రువీకరించిన తర్వాత డీయాక్టివ్

బుధవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఆధార్ డేటాబేస్ కచ్చితత్వాన్ని కొనసాగించడానికి ఈ చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో నమోదైన మరణాల డేటాను UIDAI సేకరిస్తోంది. సరైన ధృవీకరణ తర్వాత చనిపోయిన వారికి చెందిన ఆధార్ నంబర్‌ను డీయాక్టివేట్ చేయడానికి ఈ చర్యలు తీసుకుంటోంది. 

రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో చర్యలు 

UIDAI, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI)ని ఆధార్ నంబర్‌లతో అనుసంధానించి మరణాల రికార్డులు షేర్ చేయాలని సూచించింది. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS)ని ఉపయోగించి 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపు 1.55 కోట్ల మరణాల రికార్డులు పొందింది. సరైన ధృవీకరణ తర్వాత దాదాపు 1.17 కోట్ల ఆధార్ నంబర్‌లను డీయాక్టివేట్ చేసింది. ఇంకా దాదాపు 6.7 లక్షల మరణాల రికార్డుల ఆధారంగా నంబర్‌లను డీయాక్టివేట్ చేసే పని జరుగుతోంది. 

ఫిర్యాదు చేసిన వ్యక్తి బంధుత్వ వివరాలు కూడా ఇవ్వాలి

'Reporting of Death of a Family Member' కింద, కుటుంబ సభ్యుడు మరణించినప్పుడు, మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యుడు మరణించిన వ్యక్తితో తన సంబంధానికి రుజువును సమర్పించాలి. పోర్టల్‌లో మరణించిన వారి ఆధార్ నంబర్, మరణ నమోదు నంబర్, ఇతర వివరాలను అందించాలి. మీరు అందించిన సమాచారాన్ని మొదట ధృవీకరిస్తారు. ఆ తర్వాత ఆధార్‌ను డీయాక్టివేట్ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది.

వందేళ్లకు పైబడిన వారే మొదటి టార్గెట్

ఈ పని కోసం UIDAI రాష్ట్ర ప్రభుత్వాల సహాయం కూడా తీసుకుంటోంది. పైలట్ ప్రాజెక్ట్‌గా, 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఆధార్ కార్డ్ హోల్డర్‌లకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకుంటున్నారు, వారు జీవించి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ధృవీకరణ నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే ఆధార్ నంబర్‌ను డీయాక్టివేట్ చేస్తారు.      

అధికారికంగా లెక్కలు చూస్తే 2010 నుంచి చనిపోయారని డీయాక్టివ్ అయిన ఆధార్ నెంబర్‌లు 1.17 కోట్ల మంది మాత్రమే. ఇది 2024 డిసెంబర్ వరకు ఉన్నా లెక్క. అదే టైంలో అధికారిక గణాంకాల ప్రకారం చనిపోయిన వారి సంఖ్య 16 కోట్ల మందికిపైగా ఉన్నారు.అంటే ఇందులో కనీసం పది శాతం ఆధార్ నెంబర్ లు కూడా డీయాక్టివ్ కాలేదు. వీటిని ఘోస్ట్ గార్డులుగా చెబుతారు.