LRS: భారతీయులు, విదేశాల్లో ఉన్నప్పుడు క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే వ్యయాలకు సంబంధించి రూల్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మార్చింది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డుల (ICC) వినియోగాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (RBI LRS) పరిధిలోకి తీసుకువచ్చింది. దీంతోపాటు, ప్రస్తుతం 5%గా ఉన్న 'మూలం వద్ద పన్ను వసూలు' (Tax collection at source/TCS) రేటును 20%కి పెంచింది. కొత్త రూల్స్ ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి.
LRS పరిధిలోకి రావడం వల్ల, ఒక ఆర్థిక సంవత్సరంలో, విదేశాల్లో 2.5 లక్షల అమెరికన్ డాలర్లను దాటి క్రెడిట్ కార్డ్ ద్వారా ఖర్చు చేయాలంటే ఇకపై రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోవాలి. ప్రస్తుతం క్రెడిట్ కార్డ్ వ్యయాలు LRS పరిధిలో లేవు కాబట్టి, అర్‌బీఐ అనుమతి కూడా అక్కర్లేదు. దీనిని ఉపయోగించుకుని కొందరు భారతీయులు 2.5 లక్షల అమెరికన్ డాలర్ల విలువ కంటే ఎక్కువ మొత్తాన్ని విదేశాలకు పంపారు. దీనిని అడ్డుకోవడానికి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ కొత్త రూల్స్ తీసుకువచ్చింది.
FEM (CAT) రూల్స్-2000లోని రూల్ నంబర్ 5 ప్రకారం, వ్యక్తులు (individuals) ఒక ఆర్థిక సంవత్సరం ప్రాతిపదికన, LRS పరిమితి 2,50,000 అమెరికన్ డాలర్ల విలువకు మించకుండా, ఈ క్రింది ప్రయోజనాల కోసం విదేశీ మారకపు సౌకర్యాన్ని పొందవచ్చు. నిర్దేశిత పరిమితిని మించిన చెల్లింపులకు రిజర్వ్ బ్యాంక్ ముందస్తు అనుమతి అవసరం.
ఎల్‌ఆర్‌ఎస్ పరిధిలోకి వచ్చే వ్యయాలు:
i) విదేశాలకు వ్యక్తిగత పర్యటనలు (నేపాల్, భూటాన్ మినహా)
ii) బహుమతి లేదా విరాళం చెల్లింపు
iii) ఉపాధి/ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లినప్పుడు
iv) విదేశాలకు వలస వెళ్లినప్పుడు
v) విదేశాల్లో ఉంటున్న సమీప బంధువుల జీవనభృతి కోసం చేసే చెల్లింపులు
vi) వ్యాపారం, కాన్ఫరెన్స్ లేదా ప్రత్యేక శిక్షణకు హాజరు కావడం కోసం చేసే ప్రయాణ వ్యయం
vii) విదేశాల్లో వైద్య పరీక్షలు లేదా వైద్య చికిత్స/చెకప్ కోసం విదేశాలకు వెళ్లే రోగితో పాటు సహాయకుడిగా వెళ్లడం
viii) విదేశాల్లో వైద్య చికిత్సకు సంబంధించిన ఖర్చులు
ix) విదేశాల్లో చదువు కోసం చేసే ఖర్చులు
x) ఇతర అవసరాల కోసం చేసే కరెంట్ ఖాతా లావాదేవీ
రూ.7 లక్షల లోపు వ్యయాలకు TCS నుంచి మినహాయింపు
అంతర్జాతీయ క్రెడిట్/డెబిట్ కార్డ్‌ను ఉపయోగించి విదేశాల్లో చేసే ఖర్చుపై విధించే 20 శాతం TCSపై ప్రజల్లో సంశయాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా మరొక స్పష్టత ఇచ్చింది. ఒక ఆర్థిక సంవత్సరంలో, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి చేసే రూ. 7 లక్షల లోపు వ్యయాలకు TCS వర్తించదని వెల్లడించింది. జులై 1, 2023 తర్వాత డెబిట్/క్రెడిట్ కార్డ్‌తో ఖర్చు చేసినా, రూ. 7 లక్షల లోపు వ్యయాలకు కూడా TCS నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది.
ఎప్పుడో ఒకసారి సరదాగా విదేశాలకు వెళ్లేవారికి రూ.7 పరిమితి ఊరట కల్పిస్తుందని, అయితే.. తరచుగా వ్యాపార/వృత్తిపరమైన ప్రయాణాలు చేసేవాళ్లకు ఈ పరిమితి చాలా తక్కువని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రూ.7 లక్షల థ్రెషోల్డ్ కంటే ఎక్కువ మొత్తం కోసం ఎదురు చూస్తున్నారని వివరించారు.
ఇది కూడా చదవండి: ఫారిన్‌లో కార్డ్ పేమెంట్స్‌పై మరింత ఊరట - కొత్త ప్రకటన చేసిన కేంద్రం