డిజిటల్ కరెన్సీ.. ఎప్పటి నుంచో ఈ పేరు మనం వింటూనే ఉన్నాం. క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్ వంటి వాటిపై మన భారతీయులు కూడా చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఈ రోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ కరెన్సీ గురించి మాట్లాడారు. 


భారతీయ రిజర్వు బ్యాంకు నేతృత్వంలో బ్లాక్‌చైన్‌ సాంకేతికతో డిజిటల్‌ రూపాయిని తీసుకొస్తామని ప్రకటించారు. 2022-23 ఆర్థిక ఏడాదిలోనే డిజిటల్‌ రూపాయిని విడుదల చేస్తామని వెల్లడించారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంతకీ ఇది క్రిప్టో కరెన్సీకి పోటీగా తెస్తున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మరి ఇలాంటి తరుణంలో అసలు ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? బిట్ కాయిన్ అంటే ఏంటి? ఇందులో ఎలా పెట్టుబడులు పెట్టాలో ఓసారి చూద్దాం.


క్రిప్టో కరెన్సీ..?


ప్రభుత్వ నియంత్రణ కానీ, బ్యాంకుల మధ్యవర్తిత్వం కానీ ఏవీ లేని, ఇద్దరు వ్యక్తులు లేదా సంస్థల మధ్య నేరుగా, సురక్షితంగా బదిలీ చేసుకోగల డిజిటల్ కరెన్సీనే ఈ క్రిప్టో కరెన్సీగా పిలుస్తున్నారు.


ఈ కరెన్సీని ఏ ప్రభుత్వమూ జారీ చేయదు. ఇది ఏ బ్యాంకు నియంత్రణలోనూ ఉండదు. ఇది చాలా పకడ్బందీగా రూపొందించిన ఓపెన్‌సోర్స్ కంప్యూటర్ ఆల్గారిథమ్ ఆధారిత నెట్‌వర్క్ ద్వారా నడుస్తుంది.


నియంత్రణ ఉందా?


క్రిప్టో కరెన్సీపై నియంత్రణ ప్రభుత్వం, బ్యాంకుల వంటి కేంద్రీకృత సంస్థలకు ఉండదు. ఇది ఎవరి నియంత్రణలో ఉండని డీసెంట్రలైజడ్డ్ వ్యవస్థ. ఎవరికీ కమీషన్లు, భారీ ఫీజులు, లావాదేవీల మీద పరిమితులు ఉండవు. ఒక యాప్ ద్వారానే లావాదేవీలను జరుపుకోవచ్చు


బిట్ కాయిన్..?


బిట్ కాయిన్.. ఈ మధ్య విపరీతంగా ప్రచారం అవుతున్న వాటిలో ఇదీ ఒకటి. బిట్ కాయిన్‌కు భౌతికంగా రూపం లేదు. ఇది ఓ క్రిప్టో కరెన్సీ. దీని లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలోనే జరుగుతాయి.


అమెరికా, బ్రిటన్, జపాన్ వంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో దీనికి అనుమతి ఉంది. అయితే, వాస్తవానికి ఒకటి రెండు దేశాలు తప్ప దీనిని ఏ ప్రభుత్వమూ అధికారికంగా తమ లావాదేవీల్లో ఉపయోగించట్లేదు.


పెట్టుబడి ఎలా పెట్టాలి?


2030 నాటికి ప్రపంచ కరెన్సీ చలామణిలో నాలుగో వంతు క్రిప్టోకరెన్సీలు ఉంటాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే లావాదేవీల్లో క్రిప్టోకరెన్సీల వినియోగం అంతకంతకూ పెరుగుతుందని అర్థం. మరి ఇలాంటి క్రిప్టో కరెన్సీలపై పెట్టుబడులు ఎలా పెట్టాలి?


ఎవరైనా ఇందులో పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే క్రిప్టో మార్కెట్ ఎప్పుడూ తీవ్రమైన ఒడిదొడుకులతో నిత్యం విలువలు మారుతూ ఉంటాయి. అందుకే క్రిప్టో కరెన్సీతో కోటీశ్వరులు అయిన వారున్నారు.. తక్కువ కాలంలో తీవ్రంగా నష్టపోయిన వారూ ఉన్నారు. అందుకే దీని గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి.


క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలంటే కంప్యూటర్‌ నిపుణులు అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా డిజిటల్‌గా ఇన్వెస్ట్ చేయవచ్చు. భారత్​లోనూ చాలా ఎక్స్చేంజీలు... కనీస ఛార్జీలు, కమీషన్లతో క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. డిజిటల్ పెట్టుబడులను కొన్ని యాప్స్ ద్వారా కూడా చేయవచ్చు. అయితే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టే ముందు ఎంచుకున్న ఎక్స్చేంజీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.


ఉదాహరణకు మీరు బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టాలంటే... మీరు లక్షలు పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. కనీసం రూ.100 పెట్టుబడి పెట్టొచ్చు. తద్వారా కాయిన్ రేటు పెరిగితే ఆ ప్రకారం మీ పెట్టుబడి విలువ పెరుగుతుంది. కాయిన్ రేటు తగ్గితే... మీ పెట్టుబడి విలువ తగ్గుతుంది. సపోజ్ కాయిన్ రేటు ఓ 5 శాతం పెరిగితే మీ రూ.100 ధర... 5 శాతం పెరిగి... రూ.105 అవుతుంది. ఇలా తక్కువ మొత్తంతో కూడా క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టవచ్చు. అందుకు క్రిప్టోకరెన్సీ ఎక్స్‌ఛేంజ్‌లు అవకాశం ఇస్తున్నాయి.


అయితే క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టే వారు తమ దగ్గర ఉన్న మొత్తం డబ్బును కాకుండా కొంతకొంతగా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. క్రిప్టోకరెన్సీ విలువలు వేగంగా మారే అవకాశం ఉండడంతో రిస్క్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.


Also Read: Income Tax, Union Budget 2022: ఆదాయ పన్ను! మనం ఏం అడిగాం? నిర్మలమ్మ ఏం వడ్డించింది...?


Also Read: Budget 2022: గుడ్ న్యూస్.. 80 లక్షల ఇళ్ల నిర్మాణం.. రూ.44 వేల కోట్లు కేటాయింపు