Apple CEO Tim Cook Meets PM Modi: భారత్‌లో పర్యటిస్తున్న ఆపిల్ సీఈవో టిమ్ కుక్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. భారత పర్యటన సందర్భంగా తనకు లభించిన సాదర స్వాగతం పట్ల టిమ్ కుక్ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం అంతటా విస్తరించేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు ఆపిల్ కంపెనీ కట్టుబడి ఉందని టిమ్ కుక్ ప్రధానికి తెలిపారు.
ప్రధానితో సమావేశం గురించి టిమ్ కుక్ ఒక ట్వీట్ చేశారు. "సాదర స్వాగతం పలికినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. విద్య, అభివృద్ధి నుంచి తయారీ, పర్యావరణం వరకు భారతదేశ భవిష్యత్ మీద సాంకేతికత సానుకూల ప్రభావం చూపుతుందన్న మీ వైఖరిని ప్రజలతో మేం పంచుకుంటాం. దేశవ్యాప్తంగా విస్తరించడానికి, పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉన్నాం" అని ఆ ట్వీట్‌లో టిమ్ కుక్ వివరించారు.
టిమ్ కుక్‌తో భేటీ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒక ట్వీట్ చేశారు. " మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది టిమ్ కుక్. విభిన్న అంశాలపై అభిప్రాయాలను పరస్పరం వెల్లడించడం, భారతదేశంలో జరుగుతున్న సాంకేతిక ఆధారిత పరివర్తనల సమాచారాన్ని పంచుకోవడం ఆనందంగా ఉంది" అని తన ట్వీట్‌లో ప్రధాని పేర్కొన్నారు.
ఆపిల్ సీఈవో టిమ్ కుక్ సోమవారం నుంచి భారత పర్యటనలో ఉన్నారు. మొదట ముంబై చేరుకున్న టిమ్ కుక్, భారతదేశంలో ఆపిల్ తొలి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించారు. ఆపిల్ ముంబై స్టోర్‌ను యాపిల్ బీకేసీగా (Apple BKC) పిలుస్తున్నారు. ముంబయిలోని ఖరీదైన బాంద్రా కుర్లా ప్రాంతంలో ఉన్న మాల్‌లో ఈ స్టోర్ ఉంది.
ఆపిల్ రిటైల్ స్టోర్ ప్రారంభానికి ముందు అంబానీ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశం అయ్యారు. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌తో కలిసి వడ పావ్ తిన్నారు. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌తో సహా కొందరు ప్రముఖ వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులను కూడా ఆయన కలిశారని సమాచారం. బుధవారం దిల్లీ చేరుకున్నారు.
ఇవాళ (గురువారం), దిల్లీ సాకేత్ ప్రాంతంలోని హై-ఎండ్ మాల్‌లో ఏర్పాటు చేసిన ఆపిల్ రిటైల్ స్టోర్ తలుపులను టిమ్ కుక్ అన్‌లాక్ చేస్తారు. దీంతో, అక్కడ కూడా సేల్స్ ప్రారంభం అవుతాయి. ఈ స్టోర్‌ను యాపిల్ సాకేత్‌గా (Apple Saket) పిలుస్తున్నారు.
2016లో ఆపిల్ CEO తొలిసారి భారత్‌కు వచ్చారు. మళ్లీ ఏడు సంవత్సరాల తర్వాత భారత్‌లో అడుగు పెట్టారు.