Vodafone Idea shares jump:  కేంద్ర ప్రభుత్వం వోడాఫోన్ ఐడియా సంస్థకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకోవడంతో, ఆ సంస్థ షేర్లు స్టాక్ మార్కెట్‌లో భారీగా పెరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం జరిగిన సమావేశంలో వోడాఫోన్ ఐడియాకు సంబంధించి సుమారు రూ.87,695 కోట్ల సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం బకాయిలపై ఐదేళ్ల పాటు మోరటోరియం విధించేందుకు ఆమోదం తెలిపింది. ఈ బకాయిలను ఇప్పుడు ఆర్థిక సంవత్సరం 2031-32 నుండి 2040-41 మధ్య కాలంలో చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. దీనివల్ల కంపెనీపై ఉన్న తక్షణ ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది.

Continues below advertisement

మార్చి 2026 నుండి ప్రారంభం కావాల్సిన భారీ చెల్లింపులను ప్రభుత్వం 2032 వరకు వాయిదా వేసింది. ఈ మోరటోరియం కాలంలో బకాయిలపై ఎటువంటి అదనపు వడ్డీ లేదా పెనాల్టీలు విధించరు. వోడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి ఉన్న దాదాపు  49 శాతం వాటాను కాపాడుకోవడానికి, టెలికాం రంగంలో పోటీని నిలబెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయం వెలువడకముందే, రిలీఫ్ ప్యాకేజీ వస్తుందనే అంచనాలతో షేర్ ధర 52 వారాల గరిష్టానికి చేరినప్పటికీ, నిర్ణయం వెలువడిన తర్వాత మార్కెట్‌లో కొంత లాభాల స్వీకరణ కనిపించింది. బకాయిలను పూర్తిగా రద్దు చేయకుండా కేవలం వాయిదా వేయడంతో, ఇన్వెస్టర్లు కొంత అప్రమత్తత పాటించారు. ఫలితంగా, గరిష్ట స్థాయి నుండి షేర్ ధర కొంత మేర వెనక్కి తగ్గింది.

సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం, AGR బకాయిలను పునఃసమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉండటంతో ఈ ఊరట లభించింది. ఈ నిర్ణయం వల్ల వోడాఫోన్ ఐడియాకు తన నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడానికి మరియు 5G సేవలను వేగవంతం చేయడానికి అవసరమైన నిధులను సమీకరించుకునే అవకాశం లభిస్తుంది. 20 కోట్ల మంది వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ 'లైఫ్ లైన్' అందించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Continues below advertisement

టెలికాం రంగంలో ఏజీఆర్  అంటే సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం. ఏజీఆర్ బకాయిలు అనేది గత రెండు దశాబ్దాలుగా నడుస్తున్న ఒక పెద్ద వివాదం. టెలికాం కంపెనీలు తాము సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ఈ మొత్తం సుమారు 8 శాతం.   స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీల  సుమారు 3-5 శాతం  చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును లెక్కించేందుకు ప్రాతిపదికగా తీసుకునే ఆదాయాన్నే 'ఏజీఆర్' అంటారు.

టెలికాం సేవలతో పాటు డివిడెండ్లు, డిపాజిట్లపై వచ్చే వడ్డీ, ఆస్తుల విక్రయం ద్వారా వచ్చే లాభం వంటి టెలికామేతర ఆదాయాన్ని కూడా ఏజీఆర్‌లో కలపాలని ప్రభుత్వం  వాదించింది.  కేవలం ఫోన్ కాల్స్, డేటా వంటి టెలికాం సేవల ద్వారా వచ్చే ఆదాయంపై మాత్రమే ఫీజు కట్టాలని కంపెనీలు వాదించాయి. ఈ వివాదం 2005 నుండి సుప్రీంకోర్టులో కొనసాగింది. చివరకు 2019లో సుప్రీంకోర్టు ప్రభుత్వ నిర్వచనాన్నే సమర్థించింది. అంటే, కంపెనీలు గత 15-20 ఏళ్ల ఆదాయంపై అన్ని రకాల ఫీజులు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అసలు బకాయి కంటే దానిపై పడిన వడ్డీ, పెనాల్టీలు, మరియు పెనాల్టీపై వడ్డీ భారీగా పెరిగిపోయాయి. మొత్తం బకాయిల్లో దాదాపు 75 శాతం భాగం ఈ వడ్డీలు, జరిమానాలే ఉండటం గమనార్హం. కంపెనీలు తాము చెల్లించాల్సిన బకాయిలు తక్కువని భావించగా, ప్రభుత్వం లెక్కించిన గణాంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.