Vijay Kedia: స్మాల్‌ క్యాప్ కంపెనీ ప్రెసిషన్ క్యామ్‌షాఫ్ట్స్‌ షేర్లు హాట్‌కేకుల్లా మారాయి. ఈ కౌంటర్‌లో కొనుగోళ్ల కోసం ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. రెండు రోజులుగా స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ఉన్నా, ఈ కంపెనీ షేర్లు మాత్రం తారాజువ్వలను తలపిస్తూ జుమ్మని దూసుకుపోతున్నాయి. 


రెండు రోజుల్లో 40% హై జంప్‌
ఈ రెండు రోజుల్లో, ప్రెసిషన్ క్యామ్‌షాఫ్ట్స్‌ షేర్లు 40% ర్యాలీ చేశాయి. ప్రముఖ ఇన్వెస్టర్ విజయ్ కిషన్‌లాల్ కేడియా (Vijay Kishanlal Kedia) పేరు ఈ కంపెనీ ఫ్రెష్‌ షేర్ హోల్డింగ్ డేటాలో కనిపించింది. అంటే, ఇటీవలే ఈ కంపెనీ షేర్లను విజయ్‌ కేడియా కొన్నారు. ఈ వార్త బయటకు రాగానే, అదే కంపెనీ షేర్లు తమకూ కావాలంటూ పెట్టుబడిదార్లు పోటీ పడుతున్నారు. 


BSE డేటా ప్రకారం, 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో, 10 లక్షల ప్రెసిషన్ క్యామ్‌షాఫ్ట్స్‌ షేర్లను విజయ్‌ కేడియా కొనుగోలు చేశారు. ఇది, ఆ కంపెనీలో 1.05% వాటాకు సమానం.


ఇవాళ (మంగళవారం, 18 ఏప్రిల్‌ 2023) మధ్యాహ్నం 12.05 గంటల సమయానికి, క్రితం రోజు ముగింపు ధర రూ. 127.9 తో పోలిస్తే ఈ స్టాక్‌ 13.07% లేదా రూ. 16.70 పెరిగి రూ. 144.60 వద్ద ట్రేడవుతోంది. అంతేకాదు, రూ. 149.20 వద్ద 'ఇంట్రాడే హై'తో పాటు 52-వారాల కొత్త గరిష్టాన్ని కూడా నమోదు చేసింది. 


ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ షేరు 44% పైగా పెరిగింది, గత ఆరు నెలల కాలంలో 32% ర్యాలీ చేసింది. అయితే ఊపు మొత్తం గత రెండు రోజులుగా మాత్రమే కనిపించింది, అంతకుముందు వరకు దాదాపు ఫ్లాట్‌గా ట్రేడయింది. గత ఒక ఏడాది కాలంలో ఈ కౌంటర్‌ కేవలం 6% లాభాలను మాత్రమే అందించింది. 


ప్రెసిషన్ గ్రూప్‌లో ఈ కంపెనీ ఒక భాగం. వాహన విడిభాగాల తయారీ వ్యాపారాన్ని ప్రెసిషన్ క్యామ్‌షాఫ్ట్ చేస్తోంది. పుణెలో 1992లో ప్రారంభమైన ఈ కంపెనీ, ఒకే కప్పు కింద అన్ని రకాల క్యామ్‌షాఫ్ట్‌లను తయారు చేస్తోంది. ప్రపంచంలో అతి పెద్ద క్యామ్‌షాఫ్ట్ తయారీ కంపెనీల్లో ఒకటిగా దీనికి పేరుంది. 


కంపెనీ ఆదాయం, లాభం
2022 డిసెంబర్ 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో, కంపెనీ ఏకీకృత నికర అమ్మకాలు రూ. 277.8 కోట్లుగా లెక్క తేలాయి. రెండో త్రైమాసికంలోని రూ. 273.7 కోట్ల ఆదాయంతో పోలిస్తే ఇది 1.5% వృద్ధి. అంతకుముందు సంవత్సరం అదే త్రైమాసికంలోని రూ. 244 కోట్లతో పోలిస్తే 13.85% పెరుగుదల. డిసెంబర్ త్రైమాసికంలో రూ. 17.8 కోట్ల పన్ను తర్వాతి నికర లాభాన్ని ఈ కంపెనీ ప్రకటించింది.


కేడియా హోల్డింగ్స్
తాజా కార్పొరేట్ షేర్‌ హోల్డింగ్స్‌ డేటా ప్రకారం... విజయ్ కిషన్‌లాల్ కేడియా పోర్ట్‌ఫోలియోలో 16 స్టాక్స్‌ ఉన్నాయి. వాటి నికర విలువ రూ. 724.2 కోట్లకు పైమాటే.


న్యూలాండ్ లాబొరేటరీస్, హెరిటేజ్ ఫుడ్స్, సియారామ్ సిల్క్ మిల్స్, అతుల్ ఆటో వంటి స్టాక్స్‌లో కేడియా హోల్డింగ్స్ ఉన్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.