Vande Bharat Train Sleeper Coach Launch Date: ప్రయాణీకుల సుదూర ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చడానికి భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు సౌకర్యాలను పెంచుతోంది. భారతదేశంలో హైస్పీడ్ రైలు వందే భారత్‌లో, అతి త్వరలో, స్లీపర్ కోచ్‌లు ప్రవేశపెట్టబోతోంది. రైల్వే మంత్రిత్వ శాఖ చెప్పిన ప్రకారం, వందే భారత్ స్లీపర్ రైలు సెట్ మొదటి నమూనా సిద్ధంగా ఉంది. దీనిని త్వరలో క్షేత్ర స్థాయిలోకి తీసుకొస్తారు. ముందుగా, స్లీపర్‌ కోచ్‌లను వందే భారత్‌ రైలుకు జత చేసి, మార్గదర్శకాల ప్రకారం కొన్ని ట్రయల్స్ నిర్వహిస్తారు. ట్రయల్‌ రన్‌ సమయంలో ప్రయాణీకులను ఈ కోచ్‌లలోకి అనుమతించరు.


వందే భారత్ స్లీపర్ కోచ్‌ల ట్రయల్‌ రన్‌ విజయవంతం అయిన తర్వాతే ప్రయాణికుల కోసం దీనిని అధికారికంగా అందుబాటులోకి తీసుకొస్తారు. అంటే, వందే భారత్ స్లీపర్ కోచ్‌ల రిజర్వేషన్‌ ప్రారంభిస్తారు. కొత్త సంవత్సరంలో, జనవరి నుంచి స్లీపర్‌ కోచ్‌లు అందుబాటులోకి రావచ్చు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో చేసిన ప్రకటనలో, వందే భారత్ స్లీపర్‌ను సుదూర & మధ్యస్థాయి దూర ప్రయాణాలకు అనుకూలంగా రూపొందించామని వెల్లడించారు. దీని ద్వారా ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.


వందే భారత్ స్లీపర్‌లో ఆధునిక సౌకర్యాలు


వందే భారత్ రైలు బోగీల్లో అతి పెద్ద & అతి ముఖ్య లక్షణం దాని సురక్షిత నమూనా. భద్రత కోణాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్‌ రూపకల్పనలో ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఈ రైలులో కవచ్-4 వ్యవస్థ కూడా ఉంటుంది. ఈ రైలు బోగీలను EN-45545 HL3 అగ్నిమాపక భద్రత ప్రమాణాల ప్రకారం నిర్మించారు.


వందే భారత్ స్లీపర్ కప్లర్లను కూడా ఆధునిక సాంకేతికతతో తయారు చేశారు. దీనివల్ల రైలు ప్రయాణం పూర్తిగా కుదుపు లేకుండా సాగుతుంది. బ్రేకింగ్ సిస్టమ్ కూడా అత్యాధునికం, రైలు యాక్సిలరేషన్ సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే, లోకో పైలట్ - రైలు మేనేజర్ మధ్య కమ్యూనికేషన్ కోసం టాక్ బ్యాక్ సదుపాయం కూడా ఉంది.


Also Read: శ్రీనగర్ దాల్ సరస్సులో ఉబెర్ షికారా రైడ్స్ ప్రారంభం


స్లీపర్ కోచ్‌లో చిన్న విషయాలపైనా ప్రత్యేక శ్రద్ధ


వందే భారత్‌ రైలులో ప్రయాణికుల సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. బోగీల్లో రెండు అదనపు టాయ్‌లెట్లను కూడా ఏర్పాటు చేశారు. బోగీలకు ఆటోమేటిక్ లాకింగ్‌ డోర్‌లు ఏర్పాటు చేశారు. తద్వారా, రైలు స్టార్ట్ అయిన తర్వాత డోర్లు ఆటోమేటిక్‌గా మూసుకుపోతాయి. దీనివల్ల, రైలు స్టార్‌ అయిన తర్వాత, దోపిడీ దొంగల వంటివాళ్లు లోపలకు ప్రవేశించలేరు, ప్రయాణికులకు ఆస్తి & ప్రాణనష్టం జరగదు. ఒక కోచ్ నుంచి మరొక కోచ్‌కు వెళ్లేందుకు మధ్యలో ఏర్పాటు చేసిన గ్యాంగ్‌వే కూడా పూర్తిగా మూసుకుపోతుంది, ఇది ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మారుస్తుంది.


రైలు బోగీల్లో అప్పర్‌ బెర్త్‌ మీదకు ప్రయాణీకులకు సులువుగా చేరుకోవడానికి ఎర్గోనామిక్‌గా రూపొందించిన నిచ్చెన అమర్చారు. ఎయిర్ కండిషనింగ్, సెలూన్ లైటింగ్ ఉంటాయి. ప్రయాణీకుల సౌకర్యాలను పర్యవేక్షించడానికి కోచ్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. అన్ని కోచ్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.


మరో ఆసక్తికర కథనం: బంగారం ధరలు స్థిరం, రూ.లక్ష వద్ద వెండి - ఈ రోజు బిస్కట్‌, ఆర్నమెంట్‌ గోల్డ్‌ రేట్లు ఇవీ