UPI Transactions: మన దేశంలో, డిజిటల్ పద్ధతిలో చేసే చెల్లింపుల్లో (Digital payments) వేగవంతమైన ట్రెండ్ కనిపిస్తోంది. 2022 డిసెంబర్‌లో, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (Unified Payments Interface) లేదా UPI ఆధారితంగా జరిపిన చెల్లింపుల విలువ రూ. 12.82 లక్షల కోట్లకు చేరింది. ఇది రికార్డు స్థాయి. ఈ రూ. 12.82 లక్షల కోట్ల కోసం దేశ ప్రజలు జరిపిన లావాదేవీల సంఖ్య 782 కోట్ల పైమాటే.
ఈ విషయాన్ని వెల్లడిస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (Department of Financial Services) ఒక ట్వీట్ చేసింది. "భారత దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవంలో UPI గొప్ప సహకారం అందించింది. 2022 డిసెంబర్‌లో, 782 కోట్లకు పైగా UPI లావాదేవీల ద్వారా రూ. 12.82 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయి" అని తన ట్వీట్‌లో పేర్కొంది.
2022 అక్టోబర్, నవంబర్‌లో UPI గణాంకాలు
UPI ద్వారా, 2022 అక్టోబర్ నెలలో చేసిన చెల్లింపుల విలువ రూ. 12 లక్షల కోట్లు దాటింది. అక్టోబర్ నెలలోనే యూపీఐ పేమెంట్స్ తొలిసారి రూ. 12 లక్షల కోట్ల మార్కును దాటాయి. 2022 నవంబర్ నెలలో ఈ వ్యవస్థ ద్వారా 730.9 కోట్ల లావాదేవీలు జరగ్గా, వాటి విలువ రూ. 11.90 లక్షల కోట్లుగా ఉంది. 2016లో మొదలైన యూపీఐ సేవలు నగదు రహిత లావాదేవీల ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోస్తున్నాయి. యూపీఐ లావాదేవీల విధానం నెలనెలా ఎక్కువ ప్రాచుర్యం పొందుతోంది.
ఇప్పుడు, దేశంలోని 381 బ్యాంకులు UPI ద్వారా చెల్లింపుల సదుపాయాన్ని అందిస్తున్నాయి.
UPI ఎందుకు ఊపందుకున్నాయి?
గత ఏడాది కాలంగా, దేశంలో UPI లావాదేవీల సంఖ్య & వాటి విలువ చాలా వేగంగా పెరుగుతూ వస్తోంది. ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ సమయంలో అయినా, చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా తక్షణం చెల్లింపు చేయగలగడం ఈ పద్ధతిలో ఉన్న అత్యంత అనుకూల లక్షణం. దీంతో పాటు,యూపీఐ లావాదేవీలు సురక్షితంగా ఉండడం, అదనపు ఛార్జీలు లేకపోవడం కూడా కలిసొచ్చిన అంశం. అంతే కాదు, డబ్బును పెద్ద మొత్తంలో జేబులోనో, పర్సులోనో పెట్టుకుని వెళ్లాల్సిన అవసరం లేదు. దానివల్ల డబ్బు పోగొట్టుకునే, లేదా చోరీ జరిగే రిస్క్ పూర్తిగా తగ్గింది. ఒక వినియోగదారు UPI ద్వారా ఎన్ని ఖాతాలకు అయినా డబ్బును బదిలీ చేయవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా ప్రొఫైల్‌ను సృష్టించాల్సిన అవసరం లేదు. ఇన్ని సానుకూల అంశాలు ఉన్నాయి కాబట్టే.. బజ్జీల బిల్లు దగ్గర్నుంచి విమాన టిక్కెట్ల వరకు, అన్నింటికీ UPI పేమెంట్ ఒక మంత్రంగా మారింది.