India Cements: దేశీయ స్టాక్ మార్కెట్లలో రాధాకిషన్ దమానీ పేరు ఇన్వెస్టర్లకు పరిచయం అక్కర్లేదు. భారత స్టాక్ మార్కెట్లలో దివంగత రాకేష్ జున్‌జున్‌వాలాను బిగ్‌బుల్ అని పిలుస్తుంటారు. అయితే ఆయన గురువే రాధాకిషన్ దమానీ. ప్రస్తుతం దమానీ దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగించటంతో పాటుగా తన అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ కంపెనీ కింద నిర్వహిస్తున్న డీమార్ట్ రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్నారు. ఇది మధ్య తరగతి నుంచి ధనికుల వరకు అన్ని కేటగిరీల కొనుగోలుదారులను ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా దేశీయ ఈక్విటీ మార్కెట్లలో గురువారం రోజున భారీ బ్లాక్ డీల్ జరిగింది. ఈ క్రమంలో ఇండియా సిమెంట్స్ కంపెనీకి చెందిన షేర్లను బిర్లాకు చెందిన సిమెంట్ దిగ్గజ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్ వాటిని కొనుగోలు చేసిందని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో దమానీ నుంచి 6.91 కోట్ల ఇండియా సిమెంట్స్ కంపెనీ షేర్లను అల్ట్రాటెక్ సంస్థ కొనుగోలు చేయటం మార్కెట్లలో పెద్ద ర్యాలీకి దారితీసింది. ఇన్వెస్టర్లు ఈ క్రమంలో అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపటంతో ఇంట్రాడేలో కంపెనీ షేర్లు దాదాపు 5 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. దీంతో క్లోజింగ్ సమయంలో అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీ షేర్ల ధర ఎన్ఎస్ఈలో ఒక్కోటి 5.45% లాభంలో రూ.11,749.85 వద్ద ముగిశాయి. ఈ క్రమంలో నేడు స్టాక్ ధర ఒక్కో షేరుకు రూ.607 రూపాయల మేర పెరిగింది.
రాధాకిషన్ దమానీ, అతని అనుబంధ సంస్థలు విక్రయించిన షేర్లు మొత్తం వాటాలు ఇండియా సిమెంట్స్ కంపెనీలో 24 శాతానికి సమానమైనవిగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక్కో షేరు రూ.277 చొప్పున ఈ బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ నుంచి రాధాకిషన్ దమానీ, అతని యూనిట్లు రూ.1,914 కోట్లు అందుకున్నాయి. అలాగే నేడు ఇండియా సిమెంట్స్ కంపెనీ షేర్లు ఇంట్రాడేలో ఒక్కోటి గరిష్ఠంగా రూ.298.80 రేటుకు చేరుకున్నాయి. అయితే గురువారం మార్కెట్లు ముగిసే సమయానికి స్టాక్ 11.09 శాతం లాభంలో రూ.291.75 వద్ద తన ప్రయాణాన్ని ముగించింది.
ఈ పరిస్థితులను విశ్లేషిస్తున్న నిపుణులు మాత్రం ఇది అదానీని కిల్లింగ్ గేమ్ అని అంటున్నారు. వాస్తవానికి అదానీ గ్రూప్ గత ఏడాది కాలం నుంచి సిమెంట్ వ్యాపారంపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. నష్టాల్లో ఉన్న అనేక సిమెంట్ కంపెనీలను చేజిక్కించుకోవటంతో పాటు పెద్ద సిమెంట్ కర్మాగారాలను వరుసగా కొనుగోలు చేస్తూ పోతోంది. ఈ క్రమంలో సంఘి సిమెంట్స్, ఏసీసీ సిమెంట్స్, అంబుజా సిమెంట్స్ వంటి కంపెనీలను వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మార్కెట్లో బిర్లాలకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్స్ అగ్రగామి సిమెంట్స్ సంస్థగా కొనసాగుతున్న వేళ దానిని వెనక్కి నెట్టేందుకు గౌతమ్ అదానీ వరుస వాటాల కొనుగోలుతో పరిశ్రమలో హీట్ పెంచేస్తున్నారు. అయితే దీనిని కట్టడి చేసేందుకు ప్రస్తుతం కుమార మంగళం బిర్లా సైత్ తన ఆట మెుదలెట్టినట్లు ఇండియా సిమెంట్స్ డీల్ ద్వారా అర్థం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం మోదీ సర్కార్ దేశంలోని మౌలిక సదుపాయాల రంగంపై భారీగా ఖర్చు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వేగంగా దేశంలో ఇన్ ఫ్రా రంగం అభివృద్ధి చెందుతోంది. ఈ బూమ్ క్యాష్ చేసుకునేందుకు అదానీ వాస్తవానికి సిమెంట్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సిమెంట్ కేటగిరీలో అల్ట్రాటెక్ సిమెంట్ 23 శాతం వాటాను కలిగి ఉంది. గత 12 నెలల్లో కంపెనీ 19 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసింది. వచ్చే 3 ఏళ్లలో రూ.32,400 కోట్ల పెట్టుబడితో ఈ ఉత్పత్తిని 35 మిలియన్ టన్నులకు పెంచాలని కంపెనీ భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అల్ట్రాటెక్ ప్రత్యక్ష పోటీ అదానీ గ్రూప్ కంపెనీలతోనే ఉండనుందని తెలుస్తోంది. సిమెంట్ వ్యాపారంలో రెండు సంస్థలు తమ ఆధిపత్యాన్ని చెలాయించటం ద్వారా కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన నుంచి భారీగా లాభపడాలని చూస్తున్నాయి. ప్రస్తుతం భారీ డీల్ జరిగిన ఇండియా సిమెంట్స్ బిజినెస్ టర్నోవర్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.5,112 కోట్లుగా ఉంది.