Ukraine Conflict: ఉక్రెయిన్, రష్యా యుద్ధం కొనసాగుతుండటంతో పలు సంస్థలు రష్యాపై నిషేధం విధించాయి. పలు దేశాలు రష్యా నుంచి ఎగుమతి, దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా కోకా కోలా, పెప్సికో కంపెనీలు రష్యాకు షాకిచ్చాయి. రష్యాలో ఉత్పత్తి, విక్రయాలు నిలిపివేస్తున్నామని కూల్ డ్రింక్ కంపెనీలు ప్రకటించాయి. ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న కారణంగా సాఫ్ట్ డ్రింక్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయని అంతర్జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది.
తన పొరుగుదేశం ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య, బాంబు దాడులను అంతర్జాతీయంగా పలు దేశాలు ఖండించాయి. యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని పలు దేశాలు సూచించినా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. దాంతో ముడి చమురు ధరలు సైతం భారీగా పెరగుతున్నాయి. అమెరికా, ఇతర యూరప్ దేశాలు రష్యా నుంచి ముడి చమురు దిగుమతులపై నిషేధం విధించడంతో ఇది మరింత ప్రభావం చూపనుంది. ఈ క్రమంలో సాఫ్ట్ డ్రింక్ కంపెనీలు పెప్సికో, కోకో కోలాలు బాధితుల పక్షాన నిలుస్తామని తమ ప్రకటనల్లో పేర్కొన్నాయి. అనాలోచితంగా ఇతర దేశాలపై యుద్ధాలకు దిగే దేశంలో తమ వ్యాపారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని రష్యాకు భారీ షాకిచ్చాయి.
ఉక్రెయిన్‌లో ప్రస్తుతం నెలకొన్న భయానక పరిస్థితుల దృష్ట్యా పెప్సి-కోలా, తమ ఇతర బ్రాండ్ల వ్యాపారాన్ని రష్యాలో నిలిపివేస్తున్నట్లు ప్రకటిస్తున్నాము అని పెప్సికో ఓ ప్రకటనలో తెలిపింది. గత నెల చివరి వారంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలైన తరువాత నుంచి టెక్ దిగ్గజం యాపిల్ నుంచి వీసా వరకు పలు కంపెనీలు తమ కార్యకలాపాలను రష్యాలో తాత్కాలికంగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.