Twitter Bird auction: మొత్తానికి ఎలాన్ మస్క్ (Elon Musk) కోరిక నెరవేరింది, ఆక్షన్ సూపర్ హిట్ అయింది. ఆన్‌లైన్‌లో వేలం పెట్టిన ట్విట్టర్ (Twitter auctions) వస్తువులకు మంచి ధర వచ్చింది.
Twitter Bird auction: శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ప్రధాన కార్యాలయంలోని (San Francisco Twitter headquarters) చాలా వస్తువులను ఎలాన్ మస్క్ వేలానికి పెట్టారు. మొత్తం 27 గంటల పాటు ఈ వేలం కొనసాగింది. హెరిటేజ్ గ్లోబల్ పార్ట్‌నర్స్ కంపెనీ దీనిని నిర్వహించింది. ఆన్‌లైన్ వేలంలో ట్విట్టర్ అమ్మకానికి పెట్టిన కొన్ని వస్తువులకు సాధారణ స్పందన రాగా, మరికొన్నింటి కోసం మాత్రం బిడ్డర్స్ పోటీ పడ్డారు. ఒకర్ని మించి మరొకళ్లు రేట్లు పెంచుకుంటూ వెళ్లారు. కళ్లు చెదిరే ధర పెట్టి కొన్ని వస్తువులు కొనుక్కున్నారు.
631 రకాల వస్తువులు వేలం
నాలుగు అడుగుల ఎత్తున్న నీలి రంగు ట్విటర్ పిట్ట ప్రతిమ, 10 అడుగుల నియాన్ లైట్ వెర్షన్‌తో ఉన్న ట్విట్టర్ డిస్‌ప్లే, '@' ఆకారంలో ఉన్న ఒక ప్రతిమతో పాటు కాఫీ మెషీన్లు, డిజైనర్ కుర్చీలు, ఐమ్యాక్‌లు, వంట గది సామాన్లు, N95 మాస్కుల డబ్బాలు వంటి 631 రకాల వస్తువులను ట్విట్టర్ ప్రధాన కార్యాలయం వేలంలోకి తెచ్చింది. ఈ ఆన్‌లైన్ ఆక్షన్ పేజ్‌కి “Online Auction Sale Featuring Surplus Corporate Office Assets of Twitter!” అని టైటిల్ ఇచ్చింది.
ఈ 631 రకాల వస్తువుల్లో... నీలి రంగు ట్విటర్ పిట్ట ప్రతిమ, నియాన్ లైట్ వెర్షన్ ట్విట్టర్ లోగోకు భారీ స్పందన వచ్చింది. నాలుగు అడుగుల నీలి రంగు ట్విటర్ పిట్ట స్టాచ్యూకి 65కు పైగా బిడ్స్ వచ్చాయి. దీనిని 1,00,000 డాలర్లకు (భారత కరెన్సీలో దాదాపు 81,25,000 రూపాయలు) ఒక వ్యక్తి గెలుచుకున్నాడు. అయితే కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలను ట్విట్టర్ గానీ, ఆక్షన్ నిర్వహించిన కంపెనీ గానీ బహిర్గతం చేయలేదు. 10 అడుగుల ఎత్తున్న నియాన్ లైట్ వెర్షన్ ట్విటర్ (Twitter) డిస్‌ప్లేకు ఈ వేలంలో 40,000 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 32,18,240 రూపాయలు) చెల్లించి మరో వ్యక్తి సొంతం చేసుకున్నాడు. దీని కోసం 56కు పైగా బిడ్స్ వచ్చాయి.
‘@’ రూపంలో ఉన్న ప్లాంటర్ (మొక్కలు పెంచుకునే కుండీ లాంటిది) 15,000 డాలర్లు (రూ. 12,21,990) పలికింది. ప్రత్యేకంగా కలపతో తయారు చేయించిన ఒక కాన్ఫరెన్స్ రూమ్ టేబుల్ కూడా వేలంలో ఉంది. 10,500 డాలర్ల (రూ. 8,55,393) రేటు వద్ద దీని బిడ్ క్లోజ్ అయింది. వంట గది సామగ్రిని కూడా ఈ వేలంలో ట్విట్టర్ అమ్మకానికి పెట్టింది. కాఫీ వెండింగ్ మెషీన్, ఫుడ్ డీహైడ్రేటర్, బీర్స్ స్టోర్ చేసుకునే మూడు కెగేటర్లు, పిజ్జా ఓవెన్.. ఇలా ఒక్కో దానికి 10 వేల డాలర్ల వరకు (దాదాపు రూ. 8,15,233) ధర లభించినట్లు తెలుస్తోంది. Polycom కాన్ఫరెన్స్ కాల్ స్పీకర్ ఫోన్‌లు సుమారు 300 డాలర్లకు అమ్ముడయ్యాయి. ఫేస్‌మాస్క్‌లు, సౌండ్‌ప్రూఫ్ ఫోన్ బూత్‌లకు మరో 4 వేల డాలర్లు వచ్చాయి.
కొన్ని వస్తువులు వాటి స్ట్రీట్ వాల్యూ కంటే ఎక్కువగా అమ్ముడయ్యాయి. సాధారణంగా 1195 డాలర్ల ధర పలికే డిజైనర్ హెర్మన్ మిల్లర్ ప్లైవుడ్ కుర్చీ, కనీసం 1400 డాలర్లకు అమ్ముడుబోయింది.
శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ప్రధాన కార్యాలయంతో పాటు చాలా ప్రాంతాల్లోని ఆఫీసులకు కనీసం అద్దె కట్టలేని పరిస్థితికి మస్క్ దిగజారారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అద్దెను సర్దుబాటు చేయడం కోసం, శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంలో ఉన్న వస్తువులను వేలానికి పెట్టాలని ఎలాన్ మస్క్ ఆదేశించినట్లు సమాచారం. అయితే.. ట్విటర్ ఆర్థిక పరిస్థితి బాగోలేక ఈ వస్తువులు అమ్ముతున్నారనడం నిజం కాదని వేలాన్ని నిర్వహించిన హెరిటేజ్ గ్లోబల్ పార్ట్‌నర్స్ వెల్లడించింది. మరి ఎందుకు వేలానికి పెట్టారన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు.