Top Philanthropists of India: పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు.. భారతదేశంలోని ఉన్న లక్షలాది వ్యాపారవేత్తల్లో కొంతమంది మాత్రం చాలా స్పెషల్‌. వాళ్లు, తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంటారు. సమాజం నుంచి తీసుకున్న సంపదను తిరిగి సమాజాభివృద్ధి కోసం వెచ్చిస్తుంటారు.


ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరోపకారుల (Philanthropists) జాబితాను ఫోర్బ్స్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. 2022 లిస్ట్‌లో భారతీయ పారిశ్రామికవేత్తల పేర్లు కూడా ఇందులో భారీ సంఖ్యలో ఉన్నాయి. 2022 సంవత్సరంలో, రూ. 100 కోట్ల కంటే ఎక్కువ విరాళాలు ఇచ్చిన 15 మంది భారతీయులు ఈ లిస్ట్‌లో ఉన్నారు. అదే సంవత్సరంలో, రూ. 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ఆస్తిని విరాళంగా ఇచ్చిన భారతీయ పారిశ్రామికవేత్తల సంఖ్య 20. తమ సంపదలో ఎక్కువ భాగాన్ని విరాళంగా ఇస్తూ, అపర దాన కర్ణులుగా నిలిచిన భారతదేశ పారిశ్రామికవేత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


భారతదేశ అపర దాన కర్ణుల జాబితా:


శివ్‌ నాడార్
దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ (Shiv Nadar) భారతదేశంలోని అతి పెద్ద దానశీలుల్లో ఒకరు. ఏటా కోట్ల విలువైన ఆస్తులను ఇస్తున్నారు. పేద, అణగారిన వర్గాల కోసం శివ్ నాడార్ ఫౌండేషన్ అనే సంస్థను నడుపుతున్నారు. శివ నాడార్, 2022 సంవత్సరం వరకు మొత్తం రూ. 1,161 కోట్లను విరాళంగా ఇచ్చారు. ఈ డబ్బుతో విద్యారంగాభివృద్ధి కోసం పనులు జరుగుతున్నాయి. 2022లో, సగటున, ప్రతి రోజూ దాదాపు 3 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు.


రతన్ టాటా
రతన్ టాటా ‍‌(Ratan Tata) కూడా తన సంపదలో ఎక్కువ భాగాన్ని దాతృత్వానికి కేటాయిస్తున్నారు. రూ. 80 లక్షలతో రతన్ టాటా ట్రస్ట్ 1919లో స్థాపించారు. ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చే దేశంలోని ప్రాచీన ఫౌండేషన్ ఇది.


అజీమ్ ప్రేమ్ జీ
విప్రో ఫౌండర్‌ ఛైర్మన్‌ అజీమ్ ప్రేమ్‌జీ Azim Premji), 2022 సంవత్సరంలో మొత్తం 484 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు మొత్తం రూ. 1,737,47 కోట్లు విరాళంగా వివిధ సంస్థలకు అందాయి.


ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) పేరు కూడా దాతృత్వ జాబితాలో చేరింది. ఫోర్బ్స్ ప్రకారం, 2022 సంవత్సరంలో ముఖేష్ అంబానీ మొత్తం రూ. 411 కోట్ల విరాళం ఇచ్చారు. ఇందులో ఎక్కువ భాగం విద్య కోసం ఖర్చు చేశారు.


కుమార్ మంగళం బిర్లా
దాతల జాబితాలో ఉన్న ఆదిత్య బిర్లా గ్రూప్ యజమాని కుమార మంగళం బిర్లా (Kumara Mangalam Birla), 2022లో మొత్తం రూ. 242 కోట్లను దాతృత్వ కార్యక్రమాల కోసం విరాళంగా ఇచ్చారు.


గౌతమ్ అదానీ
అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ (Gautam Adani), 2022 సంవత్సరంలో మొత్తం రూ. 190 కోట్లను విరాళాల కోసం ఖర్చు చేశారు. తన 60వ పుట్టిన రోజు సందర్భంగా, మొత్తం 60,000 కోట్ల రూపాయల విరాళం ఇస్తానని కూడా ప్రకటించారు.