Arshad Warsi Reaction on SEBI Ban: స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీల్లో పాల్గొనకుండా సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నిషేధానికి గురైన బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సి (Arshad Warsi) స్పందించారు. మార్కెట్‌పై అవగాహన లేక తానతో పాటు తన భార్య కూడా నష్టపోయినట్లు ట్వీట్‌ చేశారు.  


వార్సిపై సెబీ ఎందుకు నిషేధం విధించింది?
అర్షద్ వార్సి (Arshad Warsi), అతని భార్య మరియా గోరెట్టి (Maria Goretti), యూట్యూబర్ మనీష్ మిశ్రాతో పాటు, సాధ్నా బ్రాడ్‌కాస్ట్ ప్రమోటర్లు శ్రేయ గుప్త, గౌరవ్ గుప్త, సౌరభ్ గుప్త, పూజ అగర్వాల్, వరుణ్ మీడియాను సెక్యూరిటీ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయకుండా సెబీ పూర్తిగా నిషేధించింది. 


సాధ్నా బ్రాడ్‌కాస్ట్‌ లిమిటెడ్‌, షార్ప్‌లైన్‌ బ్రాడ్‌కాస్ట్‌ లిమిటెడ్‌ కంపెనీల షేర్లను కొనుగోలు చేయండంటూ.. పెట్టుబడిదార్లను తప్పుదోవ పట్టించేలా "ది అడ్వైజర్" "మనీవైస్" YouTube ఛానెల్‌ళ్లలో వీళ్లు వీడియోలు అప్‌లోడ్‌ చేశారని సెబీ తేల్చింది. దీని ద్వారా ఆయా కంపెనీల షేర్‌ ధరల్ని కృత్రిమంగా పెంచారని నిర్ధరించింది. ఈ వీడియోలు విడుదలైన తర్వాత, షేర్ ధర & వాల్యూమ్‌లో విపరీతమైన జంప్ కనిపించింది. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియో చూసిన రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలో ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టారు. షేర్‌ ధరలు పెరగ్గానే తమ వాటాలను అమ్మేసి, నిందితులు లాభపడ్డారు. సాధ్నా బ్రాడ్‌కాస్ట్‌ ప్రమోటర్లకు కూడా ఈ మోసంలో భాగం ఉందని సెబీ విచారణలో తేలింది.


అర్షద్‌ వార్సి తదితరులు "పంప్‌ & డంప్‌" మోసానికి పాల్పడ్డారని; తద్వారా అర్షద్ వార్సీ రూ. 29.43 లక్షలు, అతని భార్య మరియా రూ. 37.56 లక్షల లాభం తీసుకున్నారని, ఇక్బాల్‌ హుస్సేన్‌ వార్సి రూ. 9.34 లక్షలు సంపాదించారని సెబీ వెల్లడించింది.


ఒక కంపెనీ చేసే వ్యాపారం, ఆర్థిక పరిస్థితితో (ఫండమెంటల్స్‌) సంబంధం లేకుండా, స్టాక్‌ ధరను కృత్రిమంగా పెంచేలా చేసే మోసాన్ని "పంప్‌ & డంప్‌" స్కీమ్‌ అంటారు. 


తప్పుదారి పట్టించే వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా అక్రమంగా లాభపడినందుకు ఈ మోసగాళ్లందరికీ సెబీ రూ. 41.85 లక్షల జరిమానా విధించింది. వాళ్లు అక్రమంగా సంపాదించిన రూ. 54 కోట్ల లాభాలను కూడా స్వాధీనం చేసుకుంది.


వార్సి ఏమని ట్వీట్‌ చేశారు?
సెబీ తీసుకున్న చర్యలపై అర్షద్‌ వార్సి స్పందించారు. స్టాక్ మార్కెట్‌ ట్రేడింగ్‌ చేయకుండా  తనతో పాటు తన భార్య మరియా గోరెట్టిపై నిషేధం విధించడంపై ట్విట్టర్‌ ద్వారా బాధను వ్యక్తం చేశారు. మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని, తనకు, తన భార్య మరియాకు స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌పై అసలు అవగాహన లేదని, ఇతర ఇన్వెస్టర్ల మాదిరిగానే తాను కూడా పెట్టుబడి పెట్టానని, కష్టపడి సంపాదించిన డబ్బంతా పోయిందంటూ ట్వీట్‌ చేశారు.