IT Firms Revoke Offer: ఐటీ సెక్టార్లో ఉద్యోగాల పరిస్థితి అర్థమవ్వడం లేదు! సీనియర్లకు వేతనాల పెరుగుదలలో కోతలు కనిపిస్తున్నాయి. ప్రెషర్లనేమో త్వరగా జాయిన్ చేసుకోవడం లేదు. తాజాగా విప్రో, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా వంటి కంపెనీలు విద్యార్థులకు ఇచ్చిన ఆఫర్‌ లెటర్లను రద్దు చేశాయని తెలిసింది.


టెక్‌ కంపెనీలు వందల మంది విద్యార్థులకు కఠినమైన సెలక్షన్‌ ప్రాసెస్‌లో వడపోశాయి. ఎంపికైన వారికి ఆఫర్‌ లెటర్లు జారీ చేశాయి. మధ్యలో ఏమైందో తెలియదు గానీ మూడు నాలుగు నెలలపాటు వారి చేరికను వాయిదా వేశాయి. చివరికి ఇప్పుడు ఆఫర్‌ లెటర్లను రద్దు చేశాయి. ఆఫర్లు రద్దైనట్లు మెయిల్స్‌ పంపించాయి.


'మా అకాడమిక్‌ ఎలిజిబిలిటీ క్రైటీరియాకు మీరు సరిపోవడం లేదని గుర్తించాం. అంటే ఇకపై మీ ఆఫర్‌ చెల్లదు లేదా రద్దవుతుంది' అని ఈమెయిళ్లలో పంపినట్టు తెలిసింది. ఈ విషయంపై కంపెనీలు ఇంకా స్పందించలేదు.


ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. పైగా అమెరికా, ఐరోపాల్లో ఆర్థిక మాంద్యం భయాలు పట్టుకున్నాయి. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతోంది. ఫలితంగా చాలావరకు భారత పరిశ్రమలు, ఐటీ, టెక్నాలజీ కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. రాబోయే కాలంలో ఐటీ నియామకాలు మరింత తగ్గిపోతాయని, నెగెటివ్‌ వృద్ధిరేటు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Variable Pay: ఐటీ ఉద్యోగులకు కంపెనీలు ఇంతకు ముందే షాకిచ్చిన సంగతి తెలిసిందే. అట్రిషన్‌ రేటుతో భారీ వేతనాలు ఆఫర్‌ చేసే సంస్థలు ఇప్పుడు వేరియబుల్‌ పేను ఆలస్యం చేస్తున్నాయి. మరికొన్ని పర్సంటేజీ తగ్గిస్తున్నాయి. తాజాగా దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ వేరియబుల్‌ పేను 70 శాతానికి తగ్గించినట్టు వార్తలు వచ్చాయి. ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ ఖర్చులు పెరగడం, లాభదాయకత, మార్జిన్లు తగ్గడమే ఇందుకు కారణాలని తెలిసింది.


విప్రో ఈ మధ్యే కొందరు ఉద్యోగుల వేరియబుల్‌ పేను నిలిపివేసింది. మార్జిన్లపై ఒత్తిడి, టాలెంట్‌ సరఫరా గొలుసులో సామర్థ్యం లేకపోవడం, టెక్నాలజీలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టాల్సి రావడమే ఇందుకు కారణాలుగా తెలిపింది. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌ క్వార్టర్లీ వేరియబుల్‌ పేను కొందరు ఉద్యోగులకు నెల రోజులు ఆలస్యం చేసింది. ఇప్పుడు ఇన్ఫోసిస్‌ అదే బాటలో నడిచింది. 2023 ఆర్థిక ఏడాది, తొలి త్రైమాసికంలో వేరియబుల్ పే ఔట్‌ను 70 శాతానికి కుదించింది. ఇదే విషయాన్ని ఉద్యోగులకు తెలియజేసింది.


జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ అంచనాలు అందుకోలేదు. ఖర్చులు ఎక్కువ అవ్వడంతో నికర లాభం కేవలం 3.2 శాతమే పెరిగింది. పూర్తి ఏడాది ఆదాయ వృద్ధిరేటు మాత్రం 14-16 శాతం వరకు ఉంటుందని ధీమా వ్యక్తం చేసింది. ఎక్కువ గిరాకీ, ఒప్పందాలు ఉన్నాయని వెల్లడించింది.