Happy 42nd Birthday Dhoni: ఇండియన్‌ క్రికెట్ టీమ్‌ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఇవాళ, 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్న ధోని, తన ఇన్‌కమ్‌ ఇన్నింగ్స్‌లో మాత్రం నాటౌట్‌గా ఇప్పటికీ స్కోర్‌ చేస్తున్నాడు. స్ట్రైక్‌ రేట్‌ కూడా  సూపర్‌గా మెయిన్‌టైన్‌ చేస్తున్నాడు.


'బ్రాండ్‌ ధోని' వాల్యూ రూ.660 కోట్ల పైమాటే
మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం 35కు పైగా బ్రాండ్‌ యాడ్స్‌లో నటిస్తున్నాడు. మార్కెటింగ్ ఏజెన్సీ డఫ్ & ఫెల్ప్స్ డేటా ప్రకారం, "బ్రాండ్ ధోని" వాల్యూ ప్రస్తుతం $80.3 మిలియన్లు. అంటే దాదాపు రూ.663 కోట్లు. రిటైర్మెంట్ తర్వాత కూడా ధోని బ్రాండ్ విలువ పెరుగుతుండడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఏజెన్సీ లెక్క ప్రకారం, మిస్టర్‌ కూల్‌ 2020 సంవత్సరంలో రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు, అతని బ్రాండ్ వాల్యూ $61.2 మిలియన్లు. అప్పుడు అతని చేతిలో 28 బ్రాండ్లు ఉన్నాయి. 2022 సంవత్సరంలో, ధోనీ ఫేస్ వాల్యూ పీక్‌లోకి వెళ్లింది, బ్రాండ్ల సంఖ్య 36కి చేరింది.


ధోనీ బ్రాండ్ వాల్యూకి బలమైన పునాది అభిమానులే
సోషల్ మీడియాలో మహేంద్ర సింగ్ ధోనిని 75 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఈ ఏడాది IPLలోనూ అతడి క్రేజ్ కనిపించింది. మహేంద్ర సింగ్ ధోని రంగంలోకి దిగిన ప్రతిసారీ, IPL మ్యాచ్‌లు ప్రసారం చేసిన 'జియో సినిమా' వ్యూయర్‌షిప్‌ రికార్డులు సృష్టించింది. ప్రత్యర్థి జట్ల హోమ్ గ్రౌండ్స్‌లోనూ ధోనికి అద్భుతమైన మద్దతు లభించింది. క్రికెట్‌ను పిచ్చిగా ప్రేమించే ఇండియాలో ధోనీకి ఉన్న క్రేజ్ అతని బ్రాండ్‌ వాల్యూని పెంచేస్తోంది.


ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీ పోర్ట్‌ఫోలియోలో ఈ-కామర్స్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, హెల్త్‌కేర్‌, రియల్ ఎస్టేట్ సహా బోలెడన్ని బ్రాండ్స్‌ ఉన్నాయి. ధోనీ, 2005లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టినప్పుడు, బ్రాండ్‌ పరంగా ఫస్ట్‌ బ్రేక్ వచ్చింది. అప్పుడు, కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ యాడ్‌ చేశాడు. ప్రస్తుతం... ఇండిగో పెయింట్స్, మాస్టర్ కార్డ్, మ్యాట్రిమోనీ.కామ్, ఖాతా బుక్, ఫైర్ బోల్ట్, అనకాడెమీ, గరుడ ఏరోస్పేస్, కార్స్ 24 సహా చాలా బ్రాండ్స్‌కు ఫేస్‌గా ఉన్నాడు. ఖాతా బుక్, గరుడ ఏరోస్పేస్, కార్స్ 24 వంటి కొన్ని కంపెనీల్లో ధోనీకి వాటా కూడా ఉంది.


2022లో, ఎక్కువ బ్రాండ్స్‌కు సైన్‌ చేసి వ్యక్తుల్లో మహేంద్ర సింగ్ ధోనీ ఒకడు. యాడ్‌-మార్కెటింగ్‌లో ఫేమస్‌ ఫేస్‌గా నిలిచిన అతి కొద్ది మంది క్రీడాకారుల్లోనూ ఒకడు. మహేంద్ర సింగ్ ధోనీ కాకుండా, రిటైర్‌ అయిన స్పోర్ట్స్ పర్సనాలిటీల్లో భారీ బ్రాండ్‌ వాల్యూ ఉంది సచిన్ టెండూల్కర్‌కు మాత్రమే. ఇప్పటికీ మైదానంలో ఉండి ఎక్కువ డబ్బు సంపాదిస్తున్న క్రీడాకారుల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, పీవీ సింధు, నీరజ్ చోప్రా వంటి పేర్లున్నాయి.


ప్రభుత్వ ఖజానా నింపడంలో ముందు వరుస
సంపాదనలోనే కాదు, టాక్స్ కట్టడంలోనూ ధోనీదే పైచేయి. చాలా సంవత్సరాలుగా. దేశంలో ఎక్కువ ఇన్‌కం టాక్స్‌ కడుతున్న వ్యక్తుల్లో ధోనీ భాయ్‌ ఒకడు. సొంత రాష్ట్రం జార్ఖండ్‌లో, చాలా ఏళ్లుగా బిగ్గెస్ట్‌ టాక్స్‌ పేయర్‌ ఎంఎస్‌ ధోనీ. ప్రస్తుత అసెస్‌మెంట్‌ ఇయర్‌లో 38 కోట్ల రూపాయల అడ్వాన్స్ టాక్స్‌ డిపాజిట్ చేసినట్లు సమాచారం. దీని ప్రకారం, అతని సంపాదన ఏడాదికి దాదాపు రూ. 130 కోట్లు అవుతుంది. దీనికి ముందు ఏడాది కూడా రూ.38 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్‌గా జమ చేశాడు. 2020-21లో రూ.30 కోట్లు డిపాజిట్‌ చేశాడు. ధోని సంపాదనపై రిటైర్‌మెంట్ ఎలాంటి ప్రభావం చూపలేదని ఈ లెక్కలు చెబుతున్నాయి.


మరో ఆసక్తికర కథనం: కొండ దిగొస్తున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial