How To Check Gold Purity: పండుగల సీజన్ కావడం, ధన్‌తేరస్‌ దగ్గర పడడంతో దేశంలోని నగల దుకాణాల్లో రద్దీ పెరిగింది. అయితే, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఫలితంగా 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి 62,000 స్థాయి పైన ఉంది. బంగారం ఖరీదైన వస్తువు కాబట్టి, ఈ పసుపు లోహాన్ని కొనుగోలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా, కొంటున్నది అసలు బంగారమో, కాకి బంగారమో కనిపెట్టే నేర్పు ఉండాలి. కొన్ని పద్ధతులు పాటిస్తే, బంగారం స్వచ్ఛతను సులభంగా తనిఖీ చేయవచ్చు.


హాల్‌మార్క్‌ ఉందో, లేదో చూడాలి:
హాల్‌మార్క్ ఉన్న బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేయాలి. హాల్‌మార్క్‌ను బంగారం స్వచ్ఛతకు సాక్ష్యంగా పరిగణిస్తారు. ఉంగరమైనా, వడ్డాణమైనా... ఆభరణం లోపలి వైపు ఎక్కడో ఒకట చోట BIS హాల్‌మార్క్ ఉండాలి. అది ఉంటేనే, నిర్దేశించిన స్వచ్ఛత ప్రమాణాలకు అనుగుణంగా పసిడి ఉందని అర్ధం. ఇది, ప్రభుత్వం ఇచ్చే స్వచ్ఛత ధృవీకరణ ముద్ర.


హాల్‌మార్కింగ్‌లో మూడు సంకేతాలు ఉంటాయి. ఒకటి.. BIS లోగో; రెండు.. స్వచ్ఛత గ్రేడ్; మూడు.. ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్, దీనిని HUID అని కూడా పిలుస్తారు. HUID అంటే హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్. బంగారం స్వచ్ఛత, బరువును ఈ కోడ్‌ ప్రతిబింబిస్తుంది. HUID గుర్తు ఉంటే, మీ ఆభరణం హాల్‌మార్క్ అయిందని అర్ధం. BIS కేర్ యాప్‌లోని 'verify HUID' ఫీచర్ ద్వారా పసిడి నాణ్యతను నిర్ధరించుకోవడంలో ఈ కోడ్‌ మీకు సాయపడుతుంది.


ఎక్స్-రే ఫ్లోరోసెన్స్
బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయడానికి మరొక సాధారణ పరీక్ష ఎక్స్-రే ఫ్లోరోసెన్స్‌. పరీక్షించాలనుకున్న ఆభరణంపై X-రేస్‌ను ప్రసరింపజేస్తారు. ఆ వస్తువు నుంచి రిఫ్లెక్ట్‌ అయ్యే X-రేస్‌ను విశ్లేషించడం ద్వారా స్వర్ణం స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. బంగారం, వెండి, రాగి మొదలైన లోహాలను ఈ విధంగా పరీక్షించొచ్చు.


యాసిడ్ టెస్ట్‌
తుప్పు, ఆక్సిడేషన్‌, యాసిడ్‌ వంటివి బంగారంపై ప్రభావం చూపవు. స్వర్ణకారుడి దగ్గరుండే నల్లటి రాయిపై బంగారు రంగులో ఉన్న వస్తువును రుద్దవచ్చు. ఆ తర్వాత ఆ రాయి ఉన్న రేణువులపై నైట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేస్తారు. బంగారం కాకపోతే, ఆ రేణువులు కరిగిపోతాయి.


డెన్సిటీ టెస్ట్‌
విలువైన లోహమైన బంగారం ప్రత్యేకమైన సాంద్రతను కలిగి ఉంటుంది. పసిడి స్వచ్ఛతను గుర్తించడానికి ఉన్న ఉత్తమ మార్గాల్లో సాంద్రత పరీక్ష ఒకటి. ముందుగా మీ బంగారాన్ని తూకం వేయాలి. నీటితో నిండిన కంటైనర్‌లో ముంచి దాని వాల్యూమ్‌ కొలవాలి. బంగారం సాంద్రతను కనిపెట్టడానికి దాని బరువును వాల్యూమ్‌తో భాగించాలి.


మరికొన్ని జాగ్రత్తలు:
చిన్న షాపుల్లో బంగారం కొనే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ షాపు వ్యక్తి నకిలీ/నాణ్యత లేని/దొంగ బంగారాన్ని మీకు అమ్మవచ్చు. ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే, మీకు బాగా తెలిసిన షాపునకు, లేదా పెద్ద షోరూమ్‌కు వెళ్లాలి.


బంగారం కొంటే కచ్చితంగా బిల్లు తీసుకోండి. బంగారంపై జీఎస్టీ 3 శాతం ఉంటుంది. బిల్లు అడక్కపోతే ఈ జీఎస్టీ తగ్గిస్తామని షాపువాళ్లు చెబుతుంటారు. ధర తగ్గుతుంది కదానికి పన్ను కట్టకుండా బంగారం కొనొద్దు, కచ్చితంగా జీఎస్‌టీ చెల్లించండి. ఒకవేళ బంగారం నష్టానికి గురై బీమాను క్లెయిమ్ చేయడానికి బిల్లు అవసరం. ఒకవేళ ఆ బంగాన్ని మళ్లీ అమ్మాలన్నా, ఇన్‌కంటాక్స్ చిక్కులు ఉండకూడదనుకున్నా కూడా బిల్లు తీసుకోవడం చాలా ముఖ్యం.


మరో ఆసక్తికర కథనం: అంబానీకి ఆగని బెదిరింపులు, ఈసారి సీరియస్‌ వార్నింగ్‌తో రెండు ఈ-మెయిల్స్‌


Join Us on Telegram: https://t.me/abpdesamofficial