Teamlease Report:
ఆర్థిక మందగమనంతో ఉద్యోగాల్లోంచి తీసేస్తున్న తరుణంతో ఓ చల్లని కబురు! 2022 ఆర్థిక ఏడాది నాలుగో త్రైమాసికంలో ఉద్యోగాలు ఇచ్చేందుకు చాలా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. సేవల రంగంలోని 77 శాతం కంపెనీలు నియామకాలు చేపట్టాలన్న సంకల్పంతో ఉన్నట్టు టీమ్‌లీజ్ ఎంప్లాయిమెంట్ ఔట్‌లుక్ రిపోర్ట్ వెల్లడించింది. 2021 నాలుగో క్వార్టర్‌తో పోలిస్తే నియామకాలు చేపట్టాలన్న సంకల్పం 27 శాతం పెరిగిందని పేర్కొంది.
మొత్తంగా సేవలు, తయారీ రంగాల కంపెనీల్లో నియామకాల సెంటిమెంటు సగటున 68 శాతంగా ఉందని టీమ్‌లీజ్ తెలిపింది. మూడో త్రైమాసికంలో ఇది 65 శాతమేనని పేర్కొంది. రాబోయే మూడు నెలల్లో తాజా గ్రాడ్యుయేట్లు, ఎంట్రీ లెవల్ ఉద్యోగులను తీసుకొనేందుకు 79 శాతం ఎంప్లాయర్స్ సిద్ధంగా ఉన్నారు. మధ్య స్థాయిలో 50 శాతం, సీనియర్ స్థాయిలో 32 శాతం అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరిమాణాన్ని బట్టి పెద్ద కంపెనీలు 82 శాతం, చిన్నవి 61 శాతం, మీడియం 50 శాతం ఉపాధి కల్పనకు సిద్ధంగా ఉన్నాయి.
ఈ-కామర్స్ (98%), టెలీ కమ్యూనికేషన్స్ (94%), విద్యా రంగం (93%), ఆర్థిక సేవలు (88%), లాజిస్టిక్స్ (81%) కంపెనీల్లో ఎక్కువ ఉద్యోగాలు లభించనున్నాయి. ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని భావించే యువతకు ఇదే మంచి తరుణమని నిపుణులు చెబుతున్నారు. 'భారత్‌లో ఉపాధి కల్పన సెంటిమెంటు సానుకూలంగా ఉంది. 77 శాతం కంపెనీలు నియామకాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి' అని టీమ్ లీజ్ సర్వీసెస్ చీఫ్ మయూర్ టాడె అన్నారు.
సేవల రంగానికి సంబంధించి మెట్రో, టైర్-1 నగరాల్లో హైరింగ్ సెంటిమెంటు బలంగా ఉందని మయూర్ తెలిపారు. 99 శాతం ఆసక్తితో ఉన్నారన్నారు. బెంగళూరు (97%), చెన్నై (94%), దిల్లీ (90%), హైదరాబాద్ (86%), ముంబయి (85%) వంటి నగరాల్లో టెలికాం, ఆర్థిక సేవల్లో రిక్రూట్‌మెంట్ ఉంటుందన్నారు. టైర్-3 నగరాల్లో సెంటిమెంటు 47 నుంచి 49 శాతానికి పెరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో హైరింగ్ సెంటిమెంటు ఒక శాతం తగ్గిందని వెల్లడించారు.
కొన్ని రంగాల్లో రీటెన్షన్ రేటు పెరిగిందని టీమ్‌లీజ్ తెలిపింది. ప్రతిభావంతులను రీటెయిన్ చేసుకోవడం తగ్గిందని పేర్కొంది. ఐటీలో 27.19 శాతం, విద్య రంగంలో 18.02 శాతం, ఈ-కామర్స్, సంబంధిత స్టార్టప్పుల్లో 15.13 శాతం, కేపీవోల్లో 13.79 శాతం, టెలీ కమ్యూనికేషన్స్‌లో 12.05 శాతం వరకు ఉంది.
Also Read: వాటే రికవరీ! రూ.3 లక్షల కోట్ల నష్టం నుంచి తేరుకున్న స్టాక్ మార్కెట్లు!
Also Read: క్రేజీ రిటర్న్! 2022లో సూపర్ డూపర్ రాబడి అందించిన సిప్ ఫండ్స్!