TCS buyback retail entitlement ratio: 17 వేల కోట్ల రూపాయల విలువైన సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసే తేదీలను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ‍(Tata Consultancy Services) ప్రకటించింది. బైబ్యాక్‌ ప్రక్రియ డిసెంబరు 1న ప్రారంభమై, అదే నెల 7న ముగుస్తుంది. రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం యాక్సెప్టెన్స్‌ రేషియోను (TCS share buyback acceptance ratio) 17%గా టాటా గ్రూప్‌ కంపెనీ ప్రకటించింది. 


ఒక్కో షేరుకు రూ.4,150 ఫ్లోర్ ప్రైస్‌ చొప్పున షేర్‌హోల్డర్ల నుంచి తన షేర్లను టీసీఎస్‌ తిరిగి కొనుగోలు చేస్తుంది. మంగళవారం ‍‌(28 నవంబర్‌ 2023), టీసీఎస్‌ షేర్లు రూ. 3,470.45 వద్ద క్లోజ్‌ అయ్యాయి. ఈ ధరతో పోలిస్తే, బైబ్యాక్‌ ప్రైస్‌ (రూ.4,150) 20% ఎక్కువ. షేర్లను అమ్మజూపిన వారికి... తన దగ్గరున్న మిగులు/అంతర్గత నిల్వల నుంచి కంపెనీ చెల్లిస్తుంది.


బైబ్యాక్‌ ద్వారా మొత్తం 4,09,63,855 షేర్లను మార్కెట్‌ ఫ్లోటింగ్‌ నుంచి ఐటీ సర్వీసెస్‌ సంస్థ వెనక్కు తీసుకుంటుంది. ఈ మొత్తం, కంపెనీలో 1.12% వాటాకు సమానం. ఈ షేర్లను టీసీఎస్‌ బైబ్యాక్‌ చేసిన తర్వాత, మార్కెట్‌లో అంత మేరకు సప్లై తగ్గిపోతుంది. 


బైబ్యాక్ తర్వాత, EPS స్వతంత్ర ప్రాతిపదికన రూ.58.52 నుంచి రూ.59.18కి; నెట్‌వర్త్‌ 49.89% నుంచి 62.56%కు పెరుగుతుందని TCS అంచనా వేసింది.


రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి ప్రతి ఆరు షేర్లకు ఒక షేరు
షేర్‌ బైబ్యాక్‌ రికార్డ్‌ తేదీ (నవంబర్‌ 25, 2023) నాటికి ఎవరి అకౌంట్‌లో టీసీఎస్‌ షేర్లు ఉంటాయో, వాళ్లు మాత్రమే ఈ బైబ్యాక్‌లో పాల్గొనడానికి అర్హులు. రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం నిర్ణయించిన ఎన్‌టైటిల్‌మెంట్‌ రేషియో 17% ప్రకారం, రికార్డ్‌ డేట్‌ నాటికి పోర్ట్‌ఫోలియోలో ఉన్న ప్రతి ఆరు షేర్లలో ఒక షేరును (1 equity share for every 6 share) టీసీఎస్‌ కొంటుంది. అయితే.. ఇదేమీ నిర్బంధం కాదు, బైబ్యాక్‌ కోసం షేర్లను టెండర్‌ చేయాలా, వద్దా అన్నది ఇన్వెస్టర్‌ ఇష్టం.


రికార్డ్‌ తేదీ నాటికి పోర్ట్‌ఫోలియోలో ఉన్న టీసీఎస్‌ షేర్ల విలువ రూ.2 లక్షల కంటే తక్కువ ఉంటే, ఆ వ్యక్తిని రిటైల్‌ ఇన్వెస్టర్‌గా పరిగణనలోకి తీసుకుంటారు. 


ఇతర వాటాదార్లకు ఎన్‌టైటిల్‌మెంట్‌ రేషియోను ప్రతి 209 షేర్లకు 2 షేర్లుగా నిర్ణయించారు. టాటా గ్రూప్‌లోని రెండు హోల్డింగ్ కంపెనీలు.. టాటా సన్స్ (Tata Sons), టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ (Tata Investment Corporation) ఈ బైబ్యాక్‌లో పాల్గొనడానికి ఆసక్తి కనబరిచాయి. ఈ రెండు కంపెనీలు కలిసి గరిష్టంగా 2,96,15,048 షేర్ల వరకు టెండర్ చేసే అవకాశం ఉంది.


వాటాదార్ల దగ్గర నుంచి 100% స్పందన లభిస్తే... 
టీసీఎస్‌ బైబ్యాక్‌ చేయాలనుకున్న షేర్ల మొత్తాన్ని ఇన్వెస్టర్లు టెండర్‌ చేస్తే, కంపెనీ ప్రమోటర్ల వాటా ప్రస్తుతమున్న 72.3 శాతం నుంచి 72.41 శాతానికి పెరుగుతుంది. 


గత ఆరేళ్లలో, టీసీఎస్‌కు ఇది 5వ బైబ్యాక్‌. చివరిసారి, 2022 జనవరిలో రూ.18,000 కోట్ల రూపాయల విలువైన సొంత షేర్లను బైబ్యాక్‌ చేసింది. ఆ బైబ్యాక్‌లో షేర్‌ ఫ్లోర్‌ ప్రైస్‌ రూ.4,500. ఆ ఆఫర్‌ 7.5 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్ అయింది.  మార్కెట్‌ నుంచి 4 కోట్ల షేర్లను వెనక్కు తీసుకోవాలని కంపెనీ నిర్ణయిస్తే, షేర్‌హోల్డర్లు మొత్తం 30.12 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ చేశారు.


మార్కెట్‌ విలువ (Market capitalization) పరంగా చూస్తే, మన దేశంలో రిలయన్స్ తర్వాత రెండో అతి పెద్ద కంపెనీ టీసీఎస్‌ (Second largest company TCS). IT సెక్టార్‌ వరకే చూస్తే, ఇదే అత్యంత విలువైన సంస్థ.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply