TCS Q2 Results: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రెండో త్రైమాసిక (జులై-సెప్టెంబర్) పనితీరు చెత్తగా లేదు, అలాగని గొప్పగా చెప్పుకోడానికి కూడా ఏమీ లేదు. మొత్తంగా ఫలితాలు కలగూర గంపలా ఉన్నాయి. దేశంలో అతి పెద్ద IT ఎక్స్‌పోర్టర్ అయిన TCS, కొత్త ఆర్డర్లలో స్థిరమైన వృద్ధిని, మెరుగైన నిర్వహణ మార్జిన్‌ను నివేదించింది. ఆదాయంలో.. స్థిర కరెన్సీ (CC) ప్రాతిపదికన వృద్ధి కనిపిస్తున్నా, డాలర్ ప్రాతిపదికన వృద్ధి తగ్గింది.
త్రైమాసిక ప్రాతిపదికన ఉద్యోగుల వలసలు (ఆట్రిషన్ రేట్) తగ్గినట్లు కంపెనీ చెబుతున్నా, వార్షిక ప్రాతిపదికన అధికంగా ఉన్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో, నికర ఉద్యోగుల చేరిక గత తొమ్మిది త్రైమాసికాల కంటే అత్యల్పంగా 9,840గా ఉంది. గత కొన్ని త్రైమాసికాల్లో చూసిన భారీ నియామకాలతో పోల్చి చూస్తే, ఈ అంకె చాలా తక్కువ.
టీసీఎస్ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు
సెప్టెంబరు త్రైమాసికంలో ఈ కంపెనీ రూ.10,431 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలోని లాభం రూ.9,624 కోట్లతో పోలిస్తే ఇది 8 శాతం వృద్ధి. ఏకీకృత ఆదాయం రూ.46,867 కోట్ల నుంచి 18 శాతం పెరుగుదలతో రూ.55,309 కోట్లకు చేరుకుంది. బలమైన ఆర్డర్లు ఈ వృద్ధికి కారణం. జులై-సెప్టెంబరులో కంపెనీ ఆర్డర్స్ బుక్ 8.1 బిలియన్ డాలర్లుగా ఉంది.
తగ్గిన నిర్వహణ లాభం
నికర లాభంలో కొద్దిగా వృద్ధి కనిపించినా, నిర్వహణ లాభం (ఆపరేటింగ్ మార్జిన్) మాత్రం 90 బేసిస్ పాయింట్లు తగ్గి 24 శాతానికి పరిమితం అయింది. హ్యూమన్ రిసోర్స్ కన్సల్టింగ్ ఫీజులు పెరగడమే దీనికి కారణంగా, తన గైడెన్స్‌లో ఈ కంపెనీ మేనేజ్‌మెంట్ వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం కల్లా నిర్వహణ లాభాల మార్జిన్‌ను 25 శాతానికి చేర్చడమే లక్ష్యంగా వెల్లడించింది.
మధ్యంతర డివిడెండ్
ఒక్కో షేరుకు రూ.8 చొప్పున మధ్యంతర డివిడెండ్‌కు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. డివిడెండ్‌ను వచ్చే నెల 7న చెల్లిస్తారు.
లక్ష్యాన్ని దాటి నియామకాలు
సెప్టెంబర్ త్రైమాసికంలో నికరంగా 9,840 మంది ఉద్యోగులను కొత్తగా చేర్చుకోవడంతో, మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,16,171కు చేరింది. ఇందులో 157 దేశాలకు చెందిన వారు ఉన్నారు. మొత్తం ఉద్యోగుల్లో మహిళల వాటా 35.7 శాతం. ఏప్రిల్-సెప్టెంబరులో (ఆరు నెలల కాలం) 35 వేల మంది తాజా ఉత్తీర్ణులను నియమించుకున్నామని, మరో 12,000 మందిని తీసుకుంటున్నామని మేనేజ్‌మెంట్ తెలిపింది. దీంతో, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్లాన్ చేసిన 40,000 నియామకాలను దాటి 47,000 మందిని చేర్చుకున్నట్లు అవుతుందని వెల్లడించింది.
ఉద్యోగ వలసలు
ఈ కంపెనీలో ఉద్యోగ వలసలు (ఆట్రిషన్ రేట్) 21.5 శాతంగా నమోదైంది. ఏడాదిలో ఇది 20 శాతానికి దిగివస్తుందని టీసీఎస్ అంచనా వేసింది. గత త్రైమాసికంలో ఇది 19.7 శాతంగా ఉంది.
భవిష్యత్ సవాళ్లు
టీసీఎస్ బిజినెస్‌లో సింహభాగం వాటా ఉన్న అమెరికాలో అధిక ద్రవ్యోల్బణం, మాంద్యం భయాలకు తోడు రూపాయి విలువ పడిపోతున్నా ఆ ప్రభావం ఇంకా ఆర్డర్ల మీద పడలేదని సంస్థ తెలిపింది. అయితే, ప్రస్తుత పరిస్థితులు నల్లేరు మీద నడకలా మాత్రం లేవని, సవాలు విసురుతున్నాయని, నిరంతర పర్యవేక్షణ అవసరమని టీసీఎస్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. తద్వారా, సమీప కాల పరిస్థితులు ఆశాజనకంగా లేవని చెప్పకనే చెప్పింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.