LinkedIn Top Companies List: టాటా గ్రూప్‌లోని ఐటీ కంపెనీ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS), పని వాతావరణానికి సంబంధించి దేశంలో అత్యుత్తమ సంస్ధగా నిలిచింది. ప్రొఫెషనల్ సోషల్ మీడియా అయిన లింక్డ్‌ఇన్ (LinkedIn), టాప్‌-25 కంపెనీలతో ఒక లిస్ట్‌ను రిలీజ్‌ చేసింది. 


TCS తర్వాత అమెజాన్‌, మోర్గాన్ స్టాన్లీ
భారతదేశంలోని టాప్ కంపెనీలు-2023 జాబితాను ('2023 Top Companies India') లింక్డ్‌ఇన్ విడుదల చేసింది. పని చేయడానికి, ఉద్యోగ జీవితంలో పురోగతికి ఉత్తమమైన కంపెనీగా టీసీఎస్‌కు తొలి ప్రాధాన్యత దక్కింది. ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్ (Amazon ) రెండో స్థానంలో, పెట్టుబడులు & ఆర్థిక సేవల బ్యాంక్‌ మోర్గాన్ స్టాన్లీ (Morgan Stanley) మూడో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత... రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (4), మెక్వారీ గ్రూప్‌ (5), డెలాయిట్‌ (6), ఎన్‌ఏవీ ఫండ్‌ (7), ష్రైడర్‌ ఎలక్ట్రిక్‌ (8), వయాట్రిస్‌ (9), రాయల్‌ కరేబియన్‌ (10) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


ఏ అంశాల ఆధారంగా లిస్ట్‌ విడుదల?
లింక్డ్‌ఇన్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. మొత్తం ఎనిమిది ప్రమాణాల ఆధారంగా లిస్ట్‌ సిద్ధం చేశారు. అవి... కంపెనీలో పని చేయదగిన వాతావరణం, వృత్తిగతంగా అభివృద్ధి చెందే అవకాశాలు, వ్యక్తిగత నైపుణ్యాల వృద్ధికి అవకాశం, కంపెనీ స్థిరత్వం, విదేశీ ఉద్యోగ అవకాశాలు, కంపెనీతో ఉద్యోగుల అనుబంధం, ఉద్యోగాల్లో స్త్రీ-పురుష వైవిధ్యం, విద్యా నేపథ్యం, దేశంలో ఉద్యోగుల ఉనికి.


ఐటీ కంపెనీల ఆధిపత్యం తగ్గింది
గత ఏడాది (2022) జాబితాలో టెక్నాలజీ కంపెనీలదే ఆధిపత్యం. అయితే, ఈ ఏడాది ఆ హవా తగ్గింది. 2023 జాబితాలో ఆర్థిక సేవలు, చమురు & గ్యాస్, వృత్తిపరమైన సేవలు, తయారీ, గేమింగ్‌ రంగాల్లోని కంపెనీలు కూడా ఉన్నాయి. నివేదిక ప్రకారం... జాబితాలోని 25 కంపెనీల్లో 10 ఆర్థిక సేవలు, బ్యాంకులు, ఆర్థిక సాంకేతిక (ఫిన్‌టెక్‌) రంగానికి చెందినవి. వీటిలో మాక్వారీ గ్రూప్ ఐదో స్థానంలో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 11వ స్థానంలో, మాస్టర్ కార్డ్ 12వ స్థానంలో, యూబీ 14వ స్థానంలో ఉన్నాయి.


మొదటిసారి చోటు సంపాదించిన 17 కంపెనీలు
ఈసారి లిస్ట్‌లో విశేషం ఏంటంటే... టాప్‌-25 కంపెనీల్లోని 17 కంపెనీలు తొలిసారి ఈ లిస్ట్‌లో చోటు సంపాదించాయి. భారతీయ వ్యాపార వాతావరణంలో బలమైన వేగాన్ని, వైవిధ్యాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. 20వ స్థానంలో ఉన్న డ్రీమ్‌11, 24వ స్థానంలో ఉన్న గేమ్స్‌24x7 వంటి కంపెనీలు తొలిసారిగా జాబితాలో చేర్చబడ్డాయి. గేమింగ్ రంగానికి పెరుగుతున్న ప్రజాదరణను ఇది చూపుతోంది. 2022 టాప్‌ అంకుర సంస్థల జాబితాలో ఉన్న జెప్టో, 2023 జాబితాలో 16వ స్థానంలో నిలిచింది.


“ఈ అనిశ్చితి వాతావరణంలో, తమ వృత్తిగత జీవితాన్ని మెరుగు పరుచుకోవడానికి, దీర్ఘకాల విజయాన్ని సాధించేందుకు వీలు కల్పించే కంపెనీల కోసం వృత్తి నిపుణులు వెదుకుతున్నారు. అలాంటి వాళ్లు, ఉద్యోగ అవకాశాలను వెదుక్కునేందుకు వీలుగా ఈ జాబితాను ప్రకటించాం. అన్ని స్థాయుల్లోని నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కనుగొనడంలో ఈ జాబితా సాయపడుతుంది" - లింక్డ్‌ఇన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నిరజిత బెనర్జీ


లింక్డ్‌ఇన్‌ టాప్‌-25 కంపెనీల్లో అత్యధికం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ముంబయి, హైదరాబాద్‌, దిల్లీ, పుణె నిలిచాయి.