Tata Sons appoints Campbell Wilson as CEO and MD of Air India, know details: ఎయిర్ ఇండియా కొత్త సీఈవో, ఎండీగా క్యాంప్‌బెల్ విల్సన్‌ను టాటా సన్స్ నియమించింది. రెగ్యులేటరీ నిబంధనలను అనుసరించి ఎయిర్ ఇండియా బోర్డు ఆయన నియామకాన్ని ఆమోదించింది. 50 ఏళ్ల విల్సన్‌కు వైమానిక రంగంలో 26 ఏళ్ల అనుభవం ఉంది. వివిధ సర్వీసులు, లో కాస్ట్ ఎయిర్‌లైన్స్‌ను నడిపించడంలో ఆయనకెంతో అనుభవం ఉంది. గతంలో ఆయన తక్కువ తక్కువ ఖర్చుతో ఏర్పాటైన సింగపూర్ ఎయిలైన్స్ స్కూట్‌కు సీఈవోగా పనిచేశారు.
జపాన్, కెనడా, హాంగ్‌కాంగ్ వంటి దేశాల్లో పదిహేను ఏళ్లకు పైగా ఎస్‌ఐఏలో విల్సన్ పనిచేశారు. 1996లో ఆయన మేనేజ్‌మెంట్ ట్రైనీగా అక్కడ చేశారు. 2011లో సింగపూర్ ఎయిర్‌లైన్స్ సబ్సిడరీ స్కూట్‌కు ఫౌండింగ్ సీఈవోగా ఉన్నారు. 2016 వరకు సంస్థను నడిపించారు. ఆ తర్వాత ఎస్‌ఐఏలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ధరలు, డిస్ట్రిబ్యూషన్, ఈ కామర్స్, మర్చండైజింగ్, బ్రాండ్ మార్కెటింగ్, గ్లోబల్ సేల్స్, ఎయిర్‌లైన్స్ విదేశీ కార్యాలయాలను చూసుకున్నారు. మళ్లీ 2020 ఏప్రిల్‌లో రెండోసారి స్కూట్‌కు సీఈవోగా వచ్చారు.
విల్సన్‌ను ఎయిర్ ఇండియాలోకి తీసుకున్నందుకు సంతోషంగా ఉందని ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అన్నారు. 'క్యాంప్‌బెల్‌ను ఎయిర్ ఇండియాలోకి స్వాగతిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ పరిశ్రమలో ఆయనకెంతో అనుభవం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో వివిధ శాఖల్లో పనిచేశారు. ఆయన అనుభవం ద్వారా ఎయిర్ ఇండియాకు ఎంతో మేలు కలుగుతుంది. ఇప్పటికే ఆయన ఆసియాలో ఒక ఎయిర్‌లైన్ బ్రాండ్‌ను నిర్మించారు. ఆయనతో కలిసి ప్రపంచ స్థాయి ఎయిర్‌లైన్‌ను నిర్మించేందుకు నేను కృషి చేస్తాను' అని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతగానో గౌరవించే టాటా గ్రూపులోకి వస్తున్నందుకు గౌరవంగా అనిపిస్తోందని విల్సన్ తెలిపారు.