Tata Group IPOs: దాదాపు రెండు దశాబ్దాల అతి సుదీర్ఘ విరామం తర్వాత, టాటా గ్రూప్ నుంచి కొత్త IPO ఇటీవల వచ్చింది. ఇకపై, ఈ గ్రూప్ కంపెనీలు దశాబ్దాల నిశ్శబ్ధాన్ని బద్దలు కొట్టడమే కాదు, కొత్త రికార్డులనూ సృష్టించవచ్చు. మార్కెట్ వర్గాలు చెబుతున్న మాట నిజమే అయితే, రాబోయే కొన్ని సంవత్సరాల్లో టాటా గ్రూప్ నుంచి చాలా IPOలు మార్కెట్‌లో ప్రకంపనలు పుట్టించవచ్చు. స్టాక్ మార్కెట్‌లో ఈ గ్రూప్ కార్యకలాపాలు రికార్డు స్థాయికి చేరుకోవచ్చు.
ఈ కంపెనీల నుంచి IPOలు!
రాబోయే 2-3 సంవత్సరాల్లో టాటా గ్రూప్ నుంచి 6 నుంచి 8 ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్ (IPOs) మార్కెట్లో చూడవచ్చని ET రిపోర్ట్ చేసింది. టాటా క్యాపిటల్, బిగ్‌బాస్కెట్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, టాటా డిజిటల్, టాటా బ్యాటరీస్, టాటా ఎలక్ట్రానిక్స్, టాటా ఆటోకాంప్ సిస్టమ్స్, టాటా హౌసింగ్ వంటి పేర్లతో ఆ పబ్లిక్ ఆఫర్లు పెట్టుబడిదార్లను అలరించవచ్చు.
నవంబర్‌లో ముగిసిన 2 దశాబ్దాల సుదీర్ఘ విరామం
సుమారు 20 సంవత్సరాల తర్వాత, 5 నెలల క్రితం, టాటా గ్రూప్ మొదటి IPO ప్రారంభమైంది. 2023 నవంబర్ చివరిలో టాటా టెక్ సంస్థ తన పబ్లిక్ ఆఫర్‌ను లాంచ్ చేసింది. దీనికి మార్కెట్లో పెట్టుబడిదార్ల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. రూ. 3000 కోట్ల విలువైన ఈ IPO, 2023 నవంబర్ 22 నుంచి 24 వరకు ఓపెన్‌లో ఉంది, మొత్తం 70 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.
TCS IPO 20 సంవత్సరాల క్రితం వచ్చింది
టాటా టెక్ IPO కంటే ముందు, టాటా గ్రూప్ నుంచి వచ్చిన చివరి IPO టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (TCS). TCS IPO 20 సంవత్సరాలకు ముందు, 2004 జులైలో లాంచ్ అయింది. ప్రస్తుతం టీసీఎస్ భారత స్టాక్ మార్కెట్‌లో రెండో అతి పెద్ద కంపెనీగా అవతరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) మాత్రమే దీని కంటే ముందుంది.
దేశంలో అతి పెద్ద వ్యాపార సమూహం
టాటా గ్రూప్ IPO వార్తతో, ఇప్పటికే మార్కెట్‌లో లిస్ట్ అయిన గ్రూప్ షేర్లు కూడా ప్రయోజనం పొందుతున్నాయి. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత, గ్రూప్‌లోని వివిధ షేర్ల ధరలు 5 శాతం వరకు పెరిగాయి. వరుసగా 11 రోజులుగా నష్టాలను చవిచూస్తున్న టాటా ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసెస్ షేర్ ధర కూడా ఈ రోజు (బుధవారం, 27 మార్చి 2024) 5% లాభపడింది.
లిస్టెడ్ కంపెనీల పరంగా చూస్తే, టాటా గ్రూప్ భారతదేశంలోని అతి పెద్ద కార్పొరేట్ గ్రూప్. ప్రస్తుతం ఈ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.30 లక్షల కోట్లకు పైగా ఉంది. రూ.30 లక్షల కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మార్కెట్ విలువ గల ఏకైక గ్రూప్ ఇది మాత్రమే.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఎవరికీ అందనంత ఎత్తులో ఎల్‌ఐసీ బ్రాండ్ విలువ, తలవంచిన ప్రపంచ దిగ్గజాలు