Air India Free Baggage Limit: టాటా గ్రూప్‌లోని విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కొత్త రూల్‌ తీసుకొచ్చింది, తన ప్యాసెంజర్లకు భారీ షాక్‌ ఇచ్చింది. లగేజీ పాలసీని మార్చి, ఉచిత బ్యాగేజీ పరిమితిని తగ్గించింది. ఇప్పుడు, ఎయిర్ ఇండియాలో లగేజీని తీసుకెళ్లడం కాస్త ఖరీదైన వ్యవహారంగా మారింది. 


ఈ విమానయాన సంస్థ, ప్రయాణీకుల ఉచిత బ్యాగేజీ పరిమితిని 20 కిలోల నుంచి 15 కిలోలకు తగ్గించింది. భారత ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను తిరిగి తన నియంత్రణలోకి తీసుకున్నప్పటి నుంచి, ఈ విమానయాన సంస్థను తిరిగి లాభాల్లో విహరింపజేయడానికి టాటా గ్రూప్ కొత్త నిర్ణయాలు, చర్యలు తీసుకుంటోంది. అందులో భాగమే.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు నిర్ణయం. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు ఎయిర్ ఇండియా సుమారు రూ.50 వేల కోట్ల నష్టాన్ని చవిచూసింది. టాటా గ్రూప్, 2022లో ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసింది. 


ఎకానమీ కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్ ప్యాసెంజర్స్‌కు భారం
ట్రావెల్ ఏజెంట్లకు పంపిన నోటిఫికేషన్‌లో, కొత్త లగేజీ పాలసీ గురించి ఎయిర్‌లైన్ వెల్లడించింది. ఎకానమీ కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్ కేటగిరీల్లో ప్రయాణించే వ్యక్తులు ఇప్పుడు 15 కిలోల వరకు బ్యాగేజీని మాత్రమే ఉచితంగా తీసుకుని వెళ్లవచ్చు. ఈ నిర్ణయం గురువారం (02 మే 2024) నుంచే అమల్లోకి వచ్చింది. దీనికి ముందు, విమానయాన సంస్థలో చెక్-ఇన్ బ్యాగేజీగా 25 కిలోల వరకు తీసుకెళ్లడానికి అనుమతి ఉండేది. టాటా గ్రూప్‌ నియంత్రణలోకి వచ్చాక, ఆ పరిమితిని 20 కిలోలకు తగ్గించారు. ఇప్పుడు, మరో కోత పెట్టి 15 కిలోలకు తీసుకొచ్చారు.


ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA నిబంధనల ప్రకారం, అన్ని విమానయాన సంస్థలు కనీసం 15 కిలోల బ్యాగ్‌ను తీసుకెళ్లడానికి ప్రయాణీకులను అనుమతించాలి. ఈ రూల్‌కు తగ్గట్లుగా, దేశంలోని దాదాపు అన్ని ప్రైవేట్ విమానయాన సంస్థలు 15 కిలోల వరకు మాత్రమే ఫ్రీ చెక్-ఇన్ బ్యాగేజ్‌ను అనుమతిస్తున్నాయి. ఇప్పుడు ఎయిర్ ఇండియాలో కూడా అదే రూల్‌ అమల్లోకి వచ్చింది. అయితే, ఎయిర్‌ ఇండియా విషయంలో ఎయిర్‌ ప్యాసెంజర్లకు కాస్త వెసులుబాటు ఉంటుంది. ఇండిగో వంటి బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణీకులు 15 కిలోల ఫ్రీ పరిమితితో ఒక బ్యాగ్‌ను మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతి లభిస్తుంది. కానీ, ఎయిర్ ఇండియాలో 15 కిలోల వరకు ఎన్ని బ్యాగులైనా తీసుకెళ్లవచ్చు.


ఎకానమీ ఫ్లెక్స్ ప్యాసెంజర్లకు 25 కిలోల వరకు అనుమతి
15 కిలోల ఫ్రీ బ్యాగేజ్‌ ఎకానమీ క్లాస్‌లోని కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్ విభాగాలకు మాత్రమే వర్తిస్తుంది. ఎకానమీ ఫ్లెక్స్‌ కేటగిరీలో ప్రయాణించే వ్యక్తులు 25 కిలోల వరకు బ్యాగులను తీసుకెళ్లేందుకు అనుమతించనున్నట్లు ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి చెప్పారు. కొత్త విధానం వల్ల విమాన ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు ఉండదని తెలిపారు.


విమాన ప్రయాణంలో బరువు కూడా అత్యంత కీలకమైన విషయం. లగేజీ కారణంగా విమానం బరువు పెరిగితే, ప్రయాణంలో ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. బరువుపై నియంత్రణ వల్ల ఇంధనం ఆదా అవుతుంది, కంపెనీకి అదనపు ఖర్చు తప్పుతుంది. కొత్త లగేజీ పాలసీ కారణంగా ఎయిరిండియా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.


మరో ఆసక్తికర కథనం: ఇలాంటి జాబ్‌ అప్లికేషన్‌ ఎక్కడా చూసుండరు, ఉద్యోగం ఇస్తే డబ్బులు ఎదురిస్తాడట