Taiwan Shipping Firm: కంపెనీ ఆదాయం పెరిగినప్పుడో, పండుగ సమయాల్లోనో, ఛైర్మన్‌ పుట్టిన రోజనో, ఇతర ప్రత్యేక సందర్భాల్లోనో.. వివిధ కంపెనీల యాజమాన్యాలు బోనస్‌ ప్రకటిస్తుంటాయి. జీతంలో 10 శాతం లేదా 25 శాతం లేదా ఒక నెల జీతం లేదా రెండు నెలల జీతం ఇలా... తమకు తోచిన విధంగా ఉద్యోగులకు కానుకలు అందిస్తుంటాయి.


ఇండియాలో బోనస్‌ల గురించి చెప్పుకోవాలంటే... ముందుగా సూరత్‌కు చెందిన వజ్రాల కంపెనీ శ్రీ హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్‌ (Shri Hari Krishna Exports) గురించి చెప్పుకోవాలి. ఈ కంపెనీ ఛైర్మన్‌ సావ్‌జీ ఢోలాకియా (Savji Dholakiya), ఏటా దీపావళి సమయంలో బహుమతుల రూపంలో వందలాది కార్లు, ఫ్లాట్లను తన ఉద్యోగులకు ఇస్తారు. భారీ స్థాయి నగదు బహుమతులు కూడా అందిస్తారు. ఆ తర్వాత ఇండియన్‌ రైల్వే శాఖ గురించి మాట్లాడుకోవాలి. రైల్వే శాఖ, ఏటా దసరా సమయంలో తన ఉద్యోగులకు దాదాపు రెండున్నర నెలల జీతానికి తగ్గకుండా బోనస్‌ ప్రకటిస్తుంది. 2022 దసరా సమయంలో 78 రోజుల బోనస్‌ చెల్లించింది.


వీటికి తాతల్లాంటి బోనస్‌ను తైవాన్‌కు చెందిన ఎవర్‌గ్రీన్ మెరైన్ కార్పొరేషన్ (Evergreen Marine Corp.) ప్రకటించింది. తన సిబ్బందిలో కొంతమందికి తారాస్థాయి బోనస్‌లను అందించి, కొత్త సంవత్సరాన్ని అద్భుతంగా జరుపుకుంది.


బోనస్‌గా 50 నెలల జీతం
తైపీకి చెందిన ఈ షిప్పింగ్ కంపెనీ, సంవత్సరాంతపు బోనస్‌గా 50 నెలల జీతాన్ని ఇస్తోంది. ఇది, నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ జీతానికి సమానం. ఉద్యోగి హోదా, పనితీరు ఆధారంగా ఈ బోనస్‌ తగ్గుతూ వస్తుంది. 


కంపెనీ తరపున పని చేస్తున్న అందరికీ ఈ బోనస్‌లు ఇవ్వడం లేదని సమాచారం. తైవాన్ ఆధారిత ఒప్పందాలు ఉన్న సిబ్బందికి మాత్రమే ఇవి వర్తిస్తాయని కంపెనీ అధికారులు వెల్లడించారు. ఇది పూర్తిగా ప్రైవేట్‌ వ్యవహారం కాబట్టి, తమ పేర్లు బయటపెట్టొద్దని మీడియాను కోరారు. 


2022 డిసెంబరు 30న, కొంతమంది ఉద్యోగులు $65,000 పైగా నగదు చెల్లింపులు అందుకున్నారని తైవీ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది.


తారాస్థాయి బోనస్‌ల విషయమై ఎవర్‌గ్రీన్‌ మెరైన్ కార్పొరేషన్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.


అయితే, ఎవర్‌గ్రీన్ మెరైన్ సిబ్బంది అందరూ గరిష్ట స్థాయి అదృష్టవంతులు కాదు. షాంఘైకి చెందిన ఈ కంపెనీ ఉద్యోగులకు నెలవారీ జీతాల కంటే 5-8 రెట్లు మాత్రమే బోనస్‌లు అందాయట. ఇది అన్యాయం అంటూ వాళ్లు రగిలిపోయారట. వీళ్ల వల్లే బోనస్‌ల సమాచారం బయటకు పొక్కిందని భావిస్తున్నారు.


గత రెండు సంవత్సరాలుగా షిప్పింగ్‌ బిజినెస్‌ ఊహించని స్థాయిలో పెరిగింది. ఫలితంగా, ఈ రెండు సంవత్సరాల్లో ఎవర్‌గ్రీన్‌ మెరైన్ కార్పొరేషన్ కూడా భారీ స్థాయిలో వ్యాపారం చేసింది, లాభాలను ఆర్జించింది. 2022లో దీని ఆదాయం 20.7 బిలియన్ల డాలర్లకు పెరగనుందని అంచనా. 2020తో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం.


సూయజ్‌ కాల్వలో చిక్కుకున్న నౌక
ఈ ఎవర్‌గ్రీన్‌ మెరైన్ కార్పొరేషన్‌ మనకు దాదాపు రెండేళ్ల క్రితమే తెలుసు. 2021 ప్రారంభంలో, ఈ కంపెనీ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో, ఈ కంపెనీకి చెందిన ఒక ఓడ సూయజ్ కాల్వలో అడ్డంగా నిలిచిపోయింది. దాని వల్ల సూయస్‌ కాల్వలో రోజుల తరబడి రాకపోకలు ఆగిపోయాయి. ఫలితంగా, నౌకా వాణిజ్య సంస్థలకు కోటానుకోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. ఈ నౌకను తిరిగి కదిలించేసరికి సదరు కంపెనీకి, సూయజ్‌ కాల్వ నిర్వహణ సంస్థలకు తల ప్రాణం తోకకు చేరింది. నౌక వల్ల వాటిల్లిన వాణిజ్యం నష్టానికి పరిహారం కోరుతూ, ఈ  ఎవర్‌గ్రీన్‌ మెరైన్  కార్పొరేషన్‌ మీద కోర్టులో కేసులు కూడా నడిచాయి.