Sula Vineyards Shares: ఆల్కహాలిక్‌ డ్రింక్స్‌ కంపెనీ సూల వైన్‌యార్డ్స్‌‌ షేర్లు ఇవాళ్టి ట్రేడ్‌లో (బుధవారం, 12 ఏప్రిల్‌ 2023) ఫుల్‌ రైజ్‌లో ఉన్నాయి, ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి.


FY23 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ సేల్స్‌ విపరీతంగా పెరిగాయి. ఎలైట్, ప్రీమియం వైన్‌ల మొత్తం అమ్మకాలు FY22 కంటే FY23లో 30% (YoY) జంప్‌ చేశాయి, కొత్త రికార్డ్‌లు క్రియేట్‌ చేశాయి. 


అమ్మకాల్లో 10 లక్షల కేసుల మైలురాయి
కంపెనీ సొంత బ్రాండ్స్‌ సేల్స్‌ సైజ్‌ 10 లక్షల కేసులను దాటింది, ఎలైట్ & ప్రీమియం వైన్‌లు మొదటిసారిగా 5 లక్షల కేసుల మార్కును అధిగమించాయి. కంపెనీ తన సొంత బ్రాండ్‌లతో పాటు వైన్ టూరిజం వ్యాపారంలోనూ అత్యధిక వార్షిక ఆదాయాన్ని  నమోదు చేసింది. సొంత బ్రాండ్స్‌ విభాగంలో, Q4 FY23లో, 15% YoY వృద్ధిని సాధించగా, వైన్ టూరిజం Q4 FY23లో 18% YoY పెరిగింది.


కంపెనీ వెల్లడించిన తాత్కాలిక సమాచారం ప్రకారం, FY23 నాలుగో త్రైమాసికానికి సూల వైన్‌యార్డ్స్‌ నికర ఆదాయం (లాభం) దాని సొంత బ్రాండ్‌ల నుంచి రూ. 104.3 కోట్లు, వైన్ టూరిజం నుంచి రూ. 12.4 కోట్లుగా ఉంది, గది అద్దెల ఆదాయం, ఆహారం & పానీయాల విక్రయం సహా అన్ని ఆదాయాలు, అనుబంధ సేవలు ఈ విభాగం కిందకు వస్తాయి. 


మొత్తం FY23కి, సొంత బ్రాండ్‌ల నుంచి నికర ఆదాయం రూ. 482.5 కోట్లు, వైన్ టూరిజం నుంచి రూ. 45 కోట్లుగా ఉంటుందన్నది కంపెనీ అప్‌డేట్‌ చేసిన తాత్కాలిక సమాచారం.


ప్రైస్‌ యాక్షన్‌
ఇవాళ మధ్యాహ్నం 11.15 గంటల సమయానికి, సూల వైన్‌యార్డ్స్‌ స్టాక్ దాదాపు 12 శాతం పెరిగి రూ. 394 వద్ద ట్రేడ్‌ అవుతోంది. క్రితం రోజు రూ. 352.1 వద్ద ముగిసింది. 


ఈ కౌంటర్‌ గత నెల నెల రోజుల్లో దాదాపు 14 శాతం లాభపడగా, లిస్టింగ్‌ నాటి నుంచి ఇప్పటి వరకు 26 శాతం పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) 19 శాతం పైగా ర్యాలీ చేసింది.


“సూల వైన్‌యార్డ్స్‌ లిమిటెడ్‌ 23 సంవత్సరాల ప్రయాణంలో FY23 అత్యంత ముఖ్యమైనది, విజయవంతమైన సంవత్సరాల్లో ఒకటి. ప్రీమియమైజేషన్‌పై మేం పెట్టిన దృష్టి ప్రయోజకరంగా మారింది. మొత్తం 1 మిలియన్ కేసుల విక్రయాల మైలురాయిలో, 52% కంటే పైగా వాటా మా ఎలైట్ & ప్రీమియం వైన్‌లది. ప్రి-పాండమిక్ FY19లో ఆ వాటా కేవలం 46% మాత్రమే" - సూల వైన్‌యార్డ్స్‌ CEO రాజీవ్ సమంత్


"FY23లో, మా వైన్ టూరిజం వ్యాపారం మొత్తం ఆదాయం రూ. 80 కోట్లకు చేరుకుంది. FY19లోని కేవలం రూ. 44 కోట్ల నుంచి ఇది పెరిగింది. రాబోయే సంవత్సరంలో ఇది 100 కోట్ల వ్యాపారంగా ఆవిర్భవిస్తుందని మేము ఆశిస్తున్నాం" - రాజీవ్ సమంత్


మహారాష్ట్ర, కర్ణాటకలోని వైనరీలతో, భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఫ్లాంట్ల ద్వారా 1 మిలియన్ (10 లక్షలు) కేసులను సూల వైన్‌యార్డ్స్‌ ఉత్పత్తి చేసి విక్రయించింది. అంతేకాదు, భారతదేశంలో వైన్ టూరిజంను కూడా సూల ప్రారంభించింది. ప్రస్తుతం, సంవత్సరానికి 3 లక్షల మంది సందర్శకులు సూల నాసిక్ ఎస్టేట్‌ను సందర్శిస్తున్నారు. 2005లో దేశంలోనే మొట్టమొదటి వైనరీ టేస్టింగ్ రూమ్‌ను ఈ కంపనీ ప్రారంభించింది. 2010లో భారతదేశపు మొట్టమొదటి వైన్‌యార్డ్‌ రిసార్ట్‌ను స్థాపించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.