MD and Global CEO of Cipla Umang Vohra: మన దేశంలో సిప్లా పేరు తెలీని వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. డాక్టర్‌ రాసే ప్రిస్క్రిప్షన్‌లో ఈ కంపెనీ నుంచి కనీసం ఒక్క మెడిసిన్‌ అయినా ఉంటుంది. భారతీయ వైద్య రంగంలో సిప్లాది నాయకత్వ స్థానం. లీడర్‌ పొజిషన్‌కు చేరడానికి సిప్లా చాలా శ్రమించింది. ఆ శ్రమ వెనుక ఒక్కడున్నాడు.


సిప్లా ఎదుగుదలను చూస్తే... ఓ కంపెనీ గతి మారడానికి, కొత్త శిఖరాలు ఎక్కడానికి మందలకొద్దీ సిబ్బంది అవసరం లేదనిపిస్తుంది. సరైనోడు ఒక్కడున్నా చాలనిపిస్తుంది. సిప్లా కూడా, కేవలం ఒకే ఒక వ్యక్తి విజన్‌తోనే ఇప్పుడున్న స్థాయికి చేరింది. భారతీయ ఫార్మా కంపెనీని గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చిన ఒక బలమైన నాయకుడతను. అతనే... సిప్లా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & గ్లోబల్ సీఈవో 'ఉమాంగ్ ఓహ్రా'. సిప్లా బండిని విజయ తీరాల వైపు నడిపిన డ్రైవర్‌ అతను. 


ఉమాంగ్ ఓహ్రా, ఎనిమిదేళ్ల క్రితం, 2016లో సిప్లాలో బాధ్యతలు స్వీకరించారు. అతని నాయకత్వంలో, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో సిప్లా ఒక బలమైన ప్లేయర్‌గా తొడగొట్టింది. 2024 సెప్టెంబర్ 20 నాటికి కంపెనీ నికర విలువ రూ.1,32,401 కోట్లకు చేరుకుంది.


వ్యూహాల్లో దిట్ట
2016లో సిప్లాలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా చేరేనాటికి ఓహ్రాకు రెండు దశాబ్దాల మార్కెట్ అనుభవం ఉంది. సిప్లాలో చేరడానికి ముందు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, ఐషర్ మోటార్స్, పెప్సికో వంటి పెద్ద కంపెనీల్లో లీడింగ్‌ రోల్స్‌లో పని చేశారు.  సిప్లాలో అమలు చేసిన గ్లోబల్ ఫార్మాస్యూటికల్ వ్యూహంపై డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌లో ఉన్నప్పుడే సమగ్ర అవగాహన పెంచుకున్నారు. ఆ స్ట్రాటెజీ సారాన్ని జీర్ణించుకుని, పర్‌ఫెక్ట్‌గా అమలు చేసి ఫలితాలు సాధించారు.


సిప్లాలో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి, ప్రధాన మార్కెట్లలో పోటీపైనే ఓహ్రా దృష్టి పెట్టారు. సిప్లా ఎప్పటికీ రేస్‌లో ఉండేలా చూసుకున్నారు. దీంతోపాటు, ఇన్నేవేషన్స్‌కు పెద్ద పీట వేశారు. దీంతో, వేగంగా మారుతున్న ఆరోగ్య సంరక్షణ వాతావరణానికి అనుగుణంగా సిప్లాలో మార్పులు ప్రారంభమయ్యాయి. క్రమంగా హైయ్యర్‌ రిజల్ట్స్‌ వచ్చాయి.


చదువు
ఉమాంగ్ ఓహ్రా బెంగళూరులోని MSRITలో కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. TA PAI మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ నుంచి MBA డిగ్రీ అందుకున్నారు.


ఇన్నోవేషన్ & పేషెంట్ కేర్‌పైనే ఫోకస్‌
పరిస్థితులకు తగ్గట్లుగా ఓహ్రా వ్యూహాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అధునాతన సాంకేతికత, సమాచార విశ్లేషణలు, సరికొత్త ఆవిష్కరణలను తన వ్యూహాల్లో భాగంగా మార్చారు. ఆరోగ్య సమస్యలకు వీలైనన్ని పరిష్కారాలు చూపడం & రోగి ఆరోగ్యంలో స్థిరత్వం తీసుకురావడం ఫస్ట్‌ రూల్స్‌గా పెట్టుకున్నారు. ఈ రూల్స్‌ను తూ.చ. తప్పకుండా పాటించే టీమ్‌ను తయారు చేశారు. మరోవైపు.. మందులు తయారు చేయగల వ్యాధుల జాబితాను కూడా సిప్లా పెంచింది. ముఖ్యంగా, శ్వాసకోశ వ్యాధులు, కీళ్లనొప్పులు, మధుమేహం, డిప్రెషన్‌ వంటి ఆరోగ్య సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టింది.


సిప్లా విస్తరణ
ప్రస్తుతం, సిప్లాకు ప్రపంచవ్యాప్తంగా 47 తయారీ కేంద్రాలు ఉన్నాయి. దీని ఉత్పత్తులు 86 దేశాల ప్రజలు ఉపయోగిస్తున్నారు. 


సిప్లా చరిత్ర
ఖ్వాజా అబ్దుల్ హమీద్ సిప్లాను ఓ స్టార్టప్‌ కంపెనీగా స్థాపించారు. కెమికల్, ఇండస్ట్రియల్ & ఫార్మాస్యూటికల్ లాబొరేటరీస్‌గా ముంబైలో ప్రారంభమైంది. 1984 జులైలో ఈ బ్రాండ్‌లో కొత్త మార్పులు వచ్చాయి, కంపెనీ ప్రయాణం కీలక మలుపు తిరిగింది. అక్కడి నుంచి ఒక్కో మైలురాయి దాటుతూ ఇప్పుడున్న స్థాయికి చేరింది సిప్లా.


మరో ఆసక్తికర కథనం: రూ.78000 పైనే పసిడి, రూ.1000 తగ్గిన వెండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి