Special Trading Session On Saturday: సాధారణంగా, స్టాక్‌ మార్కెట్లలో శనివారం & ఆదివారాల్లో ట్రేడింగ్‌ జరగదు. ఆ రెండు రోజులు నో ట్రేడింగ్‌ డేస్‌. అయితే, ఈ వారంలో వచ్చే శనివారానికి (02 మార్చి 2024) ప్రత్యేకత ఉంది. ఆ రోజున స్టాక్‌ మార్కెట్లు ఓపెన్‌లోనే ఉంటాయి.


నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో (BSE) ఈ శనివారం నాడు కూడా ట్రేడింగ్‌ జరుగుతుంది. ఆ రోజున, డిజాస్టర్ రికవరీ సైట్ (Disaster Recovery Site) వద్ద ఇంట్రాడే నిర్వహిస్తారు. సైబర్ దాడులు, సాంకేతిక సమస్యల వంటి ఆకస్మిక సందర్భాల్లో మొత్తం డేటాను రక్షించేందుకు DR సైట్ పని చేస్తుంది. ఫలితంగా, అనుకోని అవాంతరాల సమయంలోనూ ట్రేడింగ్ సురక్షితంగా మారుతుంది. 


మార్చి 2న జరిగే ప్రత్యేక సెషన్‌లో... ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ జరుగుతుందని ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ గతంలోనే ఒక సర్క్యులర్‌ను జారీ చేశాయి.


రెండు ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లు
మార్కెట్‌ పార్టిసిపేంట్స్‌ అందరూ మార్చి 2న డీఆర్‌ సైట్ (DR Site) కోసం ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్‌లో పాల్గొనాలని సర్క్యులర్‌లో స్టాక్‌ మార్కెట్లు సూచించాయి. ఈ రోజున జరిగే ట్రేడింగ్‌, ప్రాథమిక సైట్ నుంచి DR సైట్‌కు మారుతుంది. 


DR సైట్‌లో, మొత్తం రెండు సెషన్లుగా ట్రేడ్‌ జరుగుతుంది. మొదటి ట్రేడింగ్ సెషన్ ఉదయం 9.15 నుంచి 10 గంటల వరకు; రెండో ట్రేడింగ్ సెషన్ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. 


మార్చి 2న జరిగే ప్రత్యేక సెషన్‌లో డెరివేటివ్ ప్రొడక్ట్స్‌ సహా అన్ని సెక్యూరిటీల గరిష్ట ప్రైస్‌ బ్యాండ్‌ను 5 శాతంగా నిర్ణయించారు. మ్యూచువల్ ఫండ్స్, ఫ్యూచర్ కాంట్రాక్టులకు కూడా ఇది 5 శాతంగా ఉంటుంది. సెబీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సూచనల మేరకు ఈ ప్రక్రియ పూర్తవుతుంది.


డీఆర్‌ సైట్ వెనుక పెద్ద కథ
మూడేళ్ల క్రితం, 2021 ఫిబ్రవరి 24న, NSEలో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఫలితంగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లో ట్రేడింగ్ ఆ రోజు ఉదయం 11.40 నుంచి మధ్యాహ్నం 03.45 గంటల మధ్య నిలిచిపోయింది. ఈ సమయంలో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అత్యవసర సందర్భాల్లో డేటాను రక్షించుకునే వ్యవస్థ ఉండాలని అప్పుడే నిర్ణయించారు. ఈ కారణంగానే విపత్తు పునరుద్ధరణ సైట్‌ను అభివృద్ధి చేశారు.


డిజాస్టర్ రికవరీ సైట్‌ ద్వారా ట్రేడింగ్‌ చేయడం ద్వారా, ఆ సైట్ ఎలా పని చేస్తుందో తనిఖీ చేస్తారు. ఇంకా ఏవైనా అప్‌డేషన్స్‌ అవసరమైతే వాటినీ తీసుకొస్తారు. ఫైనల్‌గా, ఆ సైట్‌ను అత్యుత్తమ వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారు. డిజాస్టర్ రికవరీ సైట్‌ సంపూర్ణంగా సిద్ధమైతే.. సైబర్ దాడులు, సర్వర్ క్రాష్‌లు, ఇతర సమస్యల నుంచి ట్రేడింగ్‌కు రక్షణ కల్పించొచ్చు. ఇది మార్కెట్‌ను, పెట్టుబడిదార్ల సమాచారాన్ని, సంపదను కాపాడుతుంది. 


వాస్తవానికి, ఈ ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ను ఈ ఏడాది జనవరి 20నే నిర్వహించాల్సి ఉంది. జనవరి 22న అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కారణంగా ఈ క్రార్యక్రమం వాయిదా పడింది. ఆ రోజు ఈక్విటీ మార్కెట్‌కు సెలవు కూడా ఇచ్చారు. దీనికి బదులుగా, అదే వారంలోని శనివారం నాడు పూర్తి స్థాయిలో మార్కెట్లను నిర్వహించారు.


మరో ఆసక్తికర కథనం: టాక్స్‌ సేవింగ్‌ ఎఫ్‌డీలో లక్షన్నర డిపాజిట్‌ చేస్తే ఐదేళ్లకు ఎంత డబ్బు తిరిగొస్తుంది?