Go Digit IPO Details In Telugu: సెలబ్రిటీ కపుల్ విరాట్‌ కోహ్లి - అనుష్క శర్మ (Virat Kohli - Anushka Sharma) పెట్టుబడి పెట్టిన "గో డిజిట్" కంపెనీకి సంబంధించిన కీలక ఈవెంట్‌ ప్రారంభమైంది. ఈ కంపెనీ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (IPO) ఈ రోజు (బుధవారం, 15 మే 2024) ఓపెన్‌ అయింది. బిడ్‌ వేయడానికి ఈ నెల 17వ తేదీ (శుక్రవారం) వరకు ఇన్వెస్టర్లకు అవకాశం ఉంది. పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా ₹2,614.65 కోట్లు సమీకరించాలన్నది గో డిజిట్‌ లక్ష్యం.


IPO ద్వారా ఒక్కో ఈక్విటీ షేరును ₹258 నుంచి ₹272 ప్రైస్‌ రేంజ్‌లో కంపెనీ జారీ చేస్తోంది. విరుష్క (Virushka) జంటకు గో డిజిట్‌లో పెట్టుబడులు ఉండడంతో ఈ IPO మార్కెట్‌ దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రే మార్కెట్‌లో ఈ షేర్లు మంచి సౌండ్‌ క్రియేట్‌ చేస్తున్నాయి, లిస్టింగ్‌ డే గెయిన్స్‌ రాబట్టొచ్చని ఇన్వెస్టర్లు నమ్ముతున్నారు. 


విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఎంత సంపాదిస్తారు?
పబ్లిక్‌ ఇష్యూ ద్వారా విరాట్ కోహ్లి - అనుష్క శర్మ ఎంత సంపాదిస్తారు అన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ ఫైల్‌ చేసిన పేపర్ల ప్రకారం.. విరుష్క జోడీకి ఈ కంపెనీలో భారీ పెట్టుబడులు ఉన్నాయి. ఈ సెలబ్రిటీ జోడీ, 2020లో, గో డిజిట్‌లో షేర్లు కొనుగోలు చేసింది. విరాట్ కోహ్లీ 2,66,667 షేర్లను, అనుష్క శర్మ 66,667 షేర్లను ఒక్కో షేర్‌ను ₹75 చొప్పున కొన్నారు. గో డిజిట్‌ ఐపీవో అప్పర్‌ ప్రైస్‌ బ్యాండ్‌ ₹272 ప్రకారం, ఈ జంటకు ఒక్కో షేరుకు ₹197 లాభం వస్తుంది.


విరాట్ కోహ్లీ 2,66,667 గో డిజిట్ షేర్లను ఒక్కొక్కటి ₹75 చొప్పున కొనుగోలు చేశాడు. ఈ ప్రకారం ఈ స్టార్‌ క్రికెటర్‌ పెట్టుబడి 2 కోట్ల రూపాయలు. ఐపీవో ద్వారా ఈ పెట్టుబడి 7.25 కోట్ల రూపాయలకు పెరుగుతుందని అంచనా.


విటాక్ కోహ్లీ భార్య, సినీ నటి అనుష్క శర్మ కూడా 66,667 గో డిజిట్ షేర్లను ₹75 చొప్పున కొనుగోలు చేసింది. కాబట్టి, ఆమె పెట్టిన పెట్టుబడి 50 లక్షల రూపాయలు. ఇప్పుడు ఈ విలువ దాదాపు 1.81 కోట్ల రూపాయలకు పెరుగుతుందని అంచనా.


బిడ్‌ వేయాలంటే ఎంత డబ్బు కావాలి?
ఐపీవో కోసం ఒక్కో లాట్‌లో 55 షేర్లను గో డిజిట్‌ చేర్చింది. ఇన్వెస్టర్లు ఐపీవో షేర్ల కోసం లాట్స్‌ రూపంలో బిడ్‌ వేయాలి. అప్పర్‌ ప్రైస్‌ బ్యాండ్‌ ₹272 ప్రకారం, ఈ ఐపీవోలో పెట్టుబడి పెట్టాలంటే కనీసం ₹14,960 (55 x 272) ఉండాలి. 


ఐపీవో కోసం ఈ కంపెనీ సమర్పించిన పేపర్ల ప్రకారం... ఈ నెల 21న షేర్ల కేటాయింపు జరుగుతుంది. షేర్లు అలాట్‌ కాని వాళ్లకు 22న డబ్బు తిరిగి వస్తుంది. కంపెనీ షేర్లు BSE, NSE మొయిన్‌ బోర్డ్‌లో 23వ తేదీన లిస్ట్‌ అవుతాయి. 


కంపెనీ ప్రమోటర్ గో డిజిట్ ఇన్ఫోవర్క్స్ సహా ఇప్పటికే ఉన్న ఇతర షేర్ హోల్డర్లు ఐపీవోలో షేర్లను అమ్మకానికి పెడుతున్నారు. ఐపీవో కోసం అందుబాటులోకి తెచ్చిన షేర్లలో రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం కేవలం 10% షేర్లు కేటాయించారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: డయాగ్నోస్టిక్ హెల్త్‌కేర్‌లో రిలయన్స్ కొత్త ఆట, మంచి కంపెనీ కోసం వేట