Buy Rating To DMart Shares: డీమార్ట్‌ బ్రాండ్‌తో బిజినెస్‌ చేస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ స్టాక్‌ గురువారం ‍‌(04 మార్చి 2024) ట్రేడింగ్ సెషన్‌లో బలంగా పెరిగింది. ప్రస్తుతం ఈ షేరు రెండేళ్ల గరిష్ట స్థాయి రూ. 4710ని చేరుకుంది. దీనికి కారణం.. 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (Q4FY24) అద్భుతమైన ఆదాయ వృద్ధి + విదేశీ బ్రోకరేజ్ సంస్థ CLSA డీమార్ట్‌ షేర్ల మీద ఫుల్‌ పాజిటివ్‌గా ఉండడం.


డీమార్ట్‌ వ్యాపారం, షేర్లకు సంబంధించి CLSA ఒక నివేదిక విడుదల చేసింది. డీమార్ట్‌ షేర్లను కొనుగోలు చేయాలని (Buy Rating) బ్రోకరేజ్ హౌస్ పెట్టుబడిదారులకు సూచించింది. అవెన్యూమార్ట్‌ స్టాక్‌కు బయ్‌ రేటింగ్‌తో పాటు CLSA ఇచ్చిన టార్గెట్ ధర రూ. 5,107. 


తక్కువ నిర్వహణ ఖర్చులు కలిగిన డిస్కౌంట్ రిటైలర్ డిమార్ట్‌ అని తన నివేదికలో CLSA పేర్కొంది. డిస్కౌంట్‌ కారణంగా వినియోగదార్లకు తక్కువ ధరలకు వస్తువులు లభిస్తాయి, దీనివల్ల అమ్మకాలను పెరుగుతాయి. అధిక ధరల పట్ల ఎప్పుడూ జాగ్రత్తగా వ్యవహరించే భారత మార్కెట్‌లో తన వాటాను పెంచుకోవడానికి ఈ వ్యూహం డీమార్ట్‌కు సాయపడింది. CLSA రిపోర్ట్‌ ప్రకారం, డీమార్ట్‌ తన ప్రైవేట్ లేబుల్‌ను వేగంగా ప్రచారం చేస్తోంది, తర్వాతి దశలో స్టాక్‌ను లిక్విడేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.


CLSA నివేదిక ప్రకారం, 500 బిలియన్‌ డాలర్ల విలువైన భారతదేశ ఆహారం & కిరాణా మార్కెట్‌లో డీమార్ట్‌ ఒక పెద్ద ప్లేయర్. ప్రస్తుతం ఈ స్పేస్‌ను చిన్న చిల్లర వ్యాపారులు ఆక్రమించారు. వచ్చే 25 సంవత్సరాల్లో TAM (total addressable market) 2.3 ట్రిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని CLSA నమ్ముతోంది. దీనిలో డీమార్ట్‌ వాటా ప్రస్తుతం ఉన్న 1 శాతం నుంచి 5 శాతానికి పెరుగుతుందని లెక్కగట్టింది. 2033-34 ఆర్థిక సంవత్సరం నాటికి డీమార్ట్ స్టోర్లు మూడు రెట్లు పెరుగుతాయని అంచనా వేసింది. ప్రస్తుతం ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 341 స్టోర్లు ఉన్నాయి.


వాల్‌మార్ట్ మాదిరిగానే డీమార్ట్ కూడా ప్రతి లక్ష మందికి ఒక స్టోర్‌ను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంటే, వచ్చే 25 ఏళ్లలో 7000 డీమార్ట్ స్టోర్లు ఉంటాయని CLSA తెలిపింది. బ్రోకరేజ్ హౌస్ తన కవరేజీని అప్‌గ్రేడ్‌ చేయడానికి ఇదే కారణం.


2023-24 నాలుగో త్రైమాసికంలో అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ఆదాయం 20 శాతం జంప్‌తో రూ.12,393 కోట్లకు చేరింది, మూడో త్రైమాసికంలో ఇది రూ.10,337 కోట్లుగా ఉంది. ఈ కారణంగా గురువారం ట్రేడ్‌లో ఈ స్టాక్‌ బలంగా పెరిగింది, 4.14 శాతం జంప్‌తో రూ. 4,645 వద్ద ముగిసింది. ఫలితంగా 3 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను అధిగమించడంలో డీమార్ట్ మరోసారి విజయం సాధించింది. గత నెల రోజుల్లో ఈ స్టాక్ 21 శాతం పెరిగింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.