NSE Bonus Shares: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) కీలక మైలురాయిని చేరింది, ఒక బిలియన్ డాలర్ల లాభదాయకమైన కంపెనీగా మారింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ‍‌(FY24) ఎన్‌ఎస్‌ఈ నికర లాభం 51 శాతం పెరిగి రూ. 8,306 కోట్లకు (1 బిలియన్ డాలర్లు) చేరుకుంది. ఆ ఏడాదిలో కంపెనీ ఆదాయం కూడా 28 శాతం వృద్ధితో రూ. 16,352 కోట్లకు పెరిగింది. ప్రభుత్వ ఖజానాకు ఎన్‌ఎస్‌ఈ రూ. 43,514 కోట్లు జమ చేసింది.


ఖర్చులు భారీగా పెరిగిప్పటికీ తగ్గని లాభాలు
2023 జనవరి-మార్చి కాలానికి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (National Stock Exchange) ప్రకటించిన ఆర్థిక ఫలితాల ప్రకారం... ఈ 3 నెలల కాలంలో ‍‌(Q4 FY24) కంపెనీకి రూ. 4,625 కోట్ల ఆదాయం వచ్చింది, దానిపై రూ. 2,488 కోట్ల నికర లాభం మిగిలింది. వార్షిక ప్రాతిపదికన (YoY) ఆదాయం 34 శాతం పెరిగింది. కంపెనీ ఎబిటా (EBITDA) కూడా గత ఏడాది ఇదే కాలం కంటే 78 శాతం పెరిగి రూ. 3,610 కోట్లుగా నమోదైంది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో NSE మొత్తం ఖర్చులు దాదాపు 90 శాతం పెరిగి రూ. 5,350 కోట్లకు చేరాయి. 2022-23 ఫైనాన్షియల్‌ ఇయర్‌లో (FY23) ఇదే లెక్క రూ.2,812 కోట్లుగా ఉంది. ఖర్చులు భారీగా పెరిగినప్పటికీ కంపెనీ లాభం 1 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది.


1 షేరుకు 4 బోనస్ షేర్లు + డివిడెండ్
4:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్ల జారీకి NSE డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది. అంటే... ఒక్కో షేరుకు 4 బోనస్ షేర్లను (NSE Bonus Shares) జారీ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనితో పాటు, 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు 90 రూపాయల డివిడెండ్‌ను (NSE Dividend) కూడా నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ ప్రకటించింది. డివిడెండ్‌ రూపంలోనే సుమారు రూ. 4,455 కోట్లను NSE పంపిణీ చేస్తుంది. బోనస్‌ షేర్లు, డివిడెంజ్‌కు సంబంధించి రికార్డ్‌ డేట్‌ను ఇంకా నిర్ణయించలేదు, త్వరలో వెల్లడిస్తారు. వాస్తవానికి, NSE ఒక అన్‌-లిస్టెడ్‌ కంపెనీ. ఈ షేర్లు ఇంకా లిస్ట్‌ కాలేదు. 


ప్రభుత్వ ఖజానాలో రూ.43,514 కోట్లు జమ
2023-24 ఆర్థిక సంవత్సరంలో, భారత ప్రభుత్వ ఖజానా కోసం NSE ఒక్కటే భారీ స్థాయిలో కాంట్రిబ్యూట్‌ చేసింది, రూ. 43,514 కోట్లు జమ చేసింది. ఇందులో... సెక్యూరిటీస్ లావాదేవీల పన్నుగా రూ. 34,381 కోట్లు, ఆదాయ పన్ను కింద రూ. 3,275 కోట్లు, స్టాంప్ డ్యూటీ కింద రూ. 2,833 కోట్లు, జీఎస్టీ రూపంలో రూ. 1,868 కోట్లు ఉన్నాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి (SEBI) రూ. 1,157 కోట్లు చెల్లించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.