Stock Market Closing Bell:  భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఒకవైపు ద్రవ్యోల్బణం భయాలు, మరోవైపు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ముడి చమురు ధరలతో వారంతంలో నష్టాలే మిగిలాయి. మే చివరి కల్లా 50 బీపీఎస్‌ పాయింట్ల వరకు పెంచుతామని యూఎస్‌ ఫెడ్‌ చెప్పడం మదుపర్లలో నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,171 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 714కి పైగా నష్టాల్లో ముగిసింది.


BSE Sensex


క్రితం సెషన్లో 57,911 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,531 వద్ద నష్టాల్లో మొదలైంది. ఉదయం నుంచి ఫ్లాట్‌గా ట్రేడ్‌ సాగింది. ఆ తర్వాత కాస్త పుంజుకొని 57,689 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది.  మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. 57,134 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని అందుకుంది. చివరికి 714 పాయింట్ల నష్టంతో 57,197 వద్ద ముగిసింది.


NSE Nifty


గురువారం 17,392 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,242 వద్ద ఓపెనైంది. కాస్త కొనుగోళ్ల మద్దతు లభించడంతో 17,315 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఒక్కసారిగా పతనమైంది. 17,149 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మొత్తంగా 220 పాయింట్ల నష్టంతో 17,171 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ట్రేడ్‌ అయింది. ఉదయం 36,514 వద్ద మొదలైంది. 35,991 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,578 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 771 పాయింట్ల నష్టంతో 36,044 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 8 కంపెనీలు లాభపడగా 42 నష్టాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్‌, ఎం అండ్‌ ఎం,  హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐటీసీ, మారుతీ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, ఎస్‌బీఐ, హిందుస్థాన్‌ యునిలివర్‌, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌ నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు పతనమయ్యాయి. క్యాపిటల్‌ గూడ్స్‌, బ్యాంక్‌, హెల్త్‌కేర్‌, మెటల్‌, రియాల్టీ 1-2 శాతం వరకు నష్టపోయాయి.