Stock Market Update Telugu: ఒమిక్రాన్‌ భారత ఆర్థిక వ్యవస్థకు మళ్లీ తలనొప్పులు తీసుకొచ్చేలా ఉంది. మూడో వేవ్‌ భయంతో  భారత స్టాక్‌ మార్కెట్లు నేడు 'బేర్‌'మన్నాయి. కీలక సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు , ఎఫ్‌ఐఐ, డీఐఐలు తమ వాటాలు ఉపసంహరించడం, ఆసియా మార్కెట్ల నష్టాలు, డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగింపు నెగెటివ్‌ సెంటిమెంట్‌కు దారితీశాయి. చివరి మూడు సెషన్లలో వచ్చిన లాభాలను స్వీకరించడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 609, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 176, బ్యాంక్‌ నిఫ్టీ 210 పాయింట్ల వరకు నష్టపోయాయి.





క్రితం రోజు 60,223 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,731 వద్ద భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలైంది. 11 గంటల సమయంలో 59,300 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. దాదాపు 825 పాయింట్లకు పైగా నష్టపోయింది. మధ్యాహ్నం తర్వాత కాస్త కొనుగోళ్లు పెరగడంతో పుంజుకున్న సూచీ 59,781 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 621 పాయింట్ల నష్టంతో 59,601 వద్ద ముగిసింది.


బుధవారం 17,925 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,768 వద్ద మొదలైంది. 17,655 వద్ద  ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఒకానొక దశలో 230కి పైగా పతనమైంది. ఆ తర్వాత కాస్త కోలుకొని 17,979 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరికి 179 పాయింట్ల నష్టంతో 17,745 వద్ద ముగిసింది.


బ్యాంక్‌ నిఫ్టీ ఉదయం విలవిల్లాడింది. 500 పాయింట్ల వరకు పతనమైంది. ఉదయం 37,242 వద్ద ఆరంభమైన సూచీ 37,058 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత కాస్త కోలుకొని 37,752 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 210 పాయింట్ల నష్టంతో 37,485 వద్ద ముగిసింది.


నిఫ్టీలో 15 కంపెనీలు లాభాల్లో, 35 నష్టాల్లో ముగిశాయి. యూపీఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌,  బజాజ్‌ ఆటో, మారుతి, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్ లాభపడగా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, శ్రీసెమ్‌, టెక్‌ మహీంద్ఆ, అదానీ పోర్ట్స్‌ షేర్లు నష్టాల పాలయ్యాయి.