Stock Market Opening 20 March 2023: బ్యాంకింగ్‌ రంగంలో సంక్షోభ ప్రభావం, ముఖ్యంగా స్విట్జర్ల్యాండ్‌కు చెందిన క్రెడిట్‌ సూయిస్‌ ప్రభావం ఇవాళ స్టాక్‌ మార్కెట్ల మీద చాలా గట్టిగా పడింది. IT షేర్లు కూడా దీనికి జత కలిశాయి.


ఇవాళ (సోమవారం, 20 మార్చి 2023) దేశీ స్టాక్ మార్కెట్ కదలిక చాలా నిరుత్సాహంగా ఉంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 216 పాయింట్లు లేదా 0.37% గ్యాప్‌డౌన్‌తో 57,773 పాయింట్ల వద్ద ఓపెన్‌ అయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) కూడా 33 పాయింట్లు లేదా 0.20% నష్టంతో 17,066 వద్ద ప్రారంభమైంది. బ్యాంక్‌ నిఫ్టీ 86 పాయింట్లు లేదా 0.22% క్షీణతతో 39,512 పాయింట్ల వద్ద మొదలైంది. 


నష్టాలతో ప్రారంభమైన భారతీయ స్టాక్‌ మార్కెట్లు అదే ఒరవడిని కొనసాగించాయి. అతి కీలకమైన 17,000 మార్కును నిఫ్టీ కోల్పోయింది.  బ్యాంక్ నిఫ్టీ 39,300 స్థాయి దిగువకు పడిపోయింది. బ్యాంకింగ్‌ షేర్లతో పాటు ఐటీ షేర్లలోనూ భారీగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ కారణంగా స్టాక్ మార్కెట్ కుప్పకూలింది.


ఉదయం 9.55 గంటల సమయానికి ఇదీ పరిస్థితి   
ఓపెనింగ్‌ సెషన్‌లో, ఉదయం 9.55 గంటల సమయానికి 565 పాయింట్లు లేదా 0.96% నష్టంతో 57,415 పాయింట్ల వద్ద కదులుతోంది. అదే సమయానికి నిఫ్టీ 179 పాయింట్లు లేదా 1.04% పతనంతో 16,920 వద్ద ఉంది. నిఫ్టీ బ్యాంక్‌ కూడా ఒక శాతం పైగా పతనంతో (1.13%), 451 పాయింట్లు కోల్పోయి 39,134 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


సెన్సెక్స్-నిఫ్టీ ఇండెక్స్‌ల పరిస్థితి ఏమిటి?              
ఇవాళ స్టాక్ మార్కెట్ పరిస్థితి దారుణంగా ఉండడం వల్ల, ఉదయం 9.55 గంటల సమయానికి, సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో కేవలం 2 మాత్రమే (హిందుస్థాన్‌ యూనిలీవర్, టైటన్) గ్రీన్‌లో కదిలాయి, మిగిలిన 28 స్టాక్‌లు అమ్మకాల ఒత్తిడిలోకి వెళ్లాయి. పడిపోయిన షేర్లలో... కోటక్ మహీంద్ర బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, నెస్లే, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, సన్ ఫార్మా, మారుతీ, హెచ్‌సీఎల్ టెక్, పవర్‌గ్రిడ్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. 


నిఫ్టీ విషయానికి వస్తే... నిఫ్టీ50 ప్యాక్‌లోని కేవలం 5 పేర్లు మాత్రమే గ్రీన్ మార్క్‌లో ఉన్నాయి, మిగిలిన 45 స్టాక్స్‌ ఎర్ర రంగు పులుముకున్నాయి.


ప్రి-ఓపెన్‌లో మార్కెట్ ఎలా ఉంది?           
ఈ రోజు ప్రి-ఓపెన్‌లో కూడా మార్కెట్ నెగెటివ్‌గానే రియాక్ట్‌ అయింది. ఈ రోజు ఆసియా మార్కెట్ల ట్రేడ్‌లో ఉత్సాహం లేదు, క్షీణత కనిపిస్తోంది. ప్రపంచ సూచీల నుంచి భారతీయ స్టాక్ మార్కెట్‌కు ఎటువంటి మద్దతు లభించలేదు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.