Nifty@20,000: కోట్లాది మంది ట్రేడర్లు, ఇన్వెస్టర్లను ఊరించి, ఉసూరుమనిపించింది నిఫ్టీ. 21 పాయింట్లేగా, ఓపెనింగ్‌లోనే అందుకుంటుందిలే అనుకున్నారంతా. చరిత్రలో మిగిలిపోయే రోజువుతుందంటూ ఇవాళ్టి డేట్‌ రాసి పెట్టుకున్నారు. టాపాసులు సిద్ధం చేశారు. కానీ... అందరి ఆశలు, అంచనాలు తలకిందులయ్యాయి, టపాసుల పెట్టెలు అటకెక్కాయి.


గురువారం నాడు 19,779 పాయింట్ల దగ్గర నిఫ్టీ50 ఇండెక్స్‌ క్లోజ్‌ అయింది. హిస్టారికల్‌ మూమెంట్‌ అయిన 20,000 (20k) పాయింట్లకు జస్ట్‌ 21 పాయింట్ల దూరంలో ఆగింది. నిన్న, ఒక దశలో, 19,991.85 వరకు వెళ్లి కొత్త జీవిత కాల గరిష్టాన్ని క్రియేట్‌ చేసిన ఈ ఇండెక్స్‌, 20k శిఖరానికి కేవలం 9 పాయింట్ల దూరంలో ఆగింది. 


20,000 మైలురాయిని చేరుకునేందుకు బాకీ ఉన్న 21 పాయింట్లను ఇవాళ ఓపెనింగ్‌ సెషన్‌లోనే నిఫ్టీ అందుకుంటుందని అనుకుంటే, అందరి అంచనాలు గల్లంతయ్యాయి. దీనికి కారణం.. ఐటీ మేజర్‌ ఇన్ఫోసిస్‌.


ఇన్ఫోసిస్ షేర్లు 10% క్రాష్‌ కావడంతో హెడ్‌లైన్‌ ఇండెక్స్‌లు 1% పైగా పతనమయ్యాయి. నిఫ్టీ 19,800 స్థాయిని, సెన్సెక్స్ 67,000 మార్కును కోల్పోయాయి.


ఇవాళ ఇండెక్స్‌ను కిందకు లాగిన కీలక కారణాలు:


1) IT భయాలు
ఇన్ఫోసిస్, జూన్ త్రైమాసికంలో CC (స్థిరమైన కరెన్సీ) పరంగా 1% QoQ వృద్ధితో స్ట్రీట్ అంచనాలను అందుకోగలిగింది. అయితే, FY24 ఆదాయ వృద్ధి గైడెన్స్‌ను 4-7% నుంచి భారీగా 1-3.5% YoYకి తగ్గించింది. గ్లోబల్‌గా అనిశ్చిత పరిస్థితులు ఇంకా కంటిన్యూ కావచ్చని ఈ ఐటీ కంపెనీ గైడెన్స్‌ గుర్తు చేసింది. 


నిఫ్టీలో ఇన్ఫోసిస్‌కు 5.9% వెయిటేజీ ఉంది. ఈ రోజు ఇండెక్స్‌ను డ్రాగ్‌ చేసిన అతి పెద్ద ప్లేయర్‌ ఈ కంపెనీ. ఇన్ఫోసిస్‌ గైడెన్స్‌ ఇతర IT స్టాక్స్‌ మీద కూడా ప్రభావం చూపింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 4 శాతానికి పైగా పతనమైంది. TCS 2.4%, విప్రో 4%, HCL టెక్ 5% పడిపోయాయి.


2) మూడ్‌ పాడు చేసిన నాస్‌డాక్‌
నెట్‌ఫ్లిక్స్, టెస్లా షేర్లలో విపరీతమైన అమ్మకాలతో, టెక్-హెవీ ఇండెక్స్‌ నాస్‌డాక్ నిన్న 2% పడిపోయింది. ఆ ఎఫెక్ట్ కూడా ఇండియన్‌ మార్కెట్‌ మీద, ముఖ్యంగా ఐటీ స్టాక్స్‌ మీద పడింది. ఎలక్ట్రిక్ కార్ల రేట్లు తగ్గింపు ఫలితంగా టెస్లా షేర్లు దాదాపు 10% పడిపోయాయి. ఆదాయ అంచనాలు మిస్‌ కావడంతో నెట్‌ఫ్లిక్స్ స్టాక్‌ 8.4% దిగొచ్చింది.


3) రిలయన్స్ షేర్లలో అమ్మకాలు
మాతృ సంస్థ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను విడదీసిన తర్వాత, ఇండెక్స్ హెవీవెయిట్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 2% పడిపోయాయి. గురువారం జరిగిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌లో JFSL షేర్ల విలువ రూ. 261.85 గా ఖరారైంది.


4) వాల్యుయేషన్స్‌
గత కొన్ని వారాలుగా దలాల్ స్ట్రీట్‌లో వన్-వే ర్యాలీ కారణంగా వాల్యుయేషన్లు హై రేంజ్‌కు చేరాయి. FY24 ఆదాయాల అంచనాల ఆధారంగా, ప్రస్తుతం నిఫ్టీ PE 20 పైనే ఉంది. యుఎస్ మినహా, భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మార్కెట్. హయ్యర్‌ వాల్యుయేషన్స్‌ కారణంగా, చిన్నపాటి నెగెటివ్‌ ట్రిగ్గర్‌ కూడా అతి పెద్ద కరెక్షన్‌కు దారి తీయవచ్చు. ఇదే భయం ఇన్వెస్టర్లు, ట్రేడర్లను ఇప్పుడు వెంటాడుతోంది.


5) టెక్నికల్‌ వర్రీస్‌
మొమెంటం ఇండికేటర్స్‌ బుల్లిష్‌గా ఉన్నప్పటికీ, గురువారం, మార్కెట్ షార్ట్‌-టర్మ్‌ టెక్చర్‌ ఓవర్‌బాట్‌ జోన్‌లోకి వెళ్లింది. అందువల్ల ట్రేడర్లు లాభాలు బుక్ చేసుకున్నారు. 


నిఫ్టీ ఓవర్‌బాట్‌ జోన్‌లో ఉంది కాబట్టి, 20k మార్క్‌ను చేరడానికి కొంత కష్టపడాలి. ఈ ఇండెక్స్‌కు 19,759 వద్ద సపోర్ట్‌ కనిపిస్తోంది.


మరో ఆసక్తికర కథనం: రిలయన్స్‌ ఫలితాలు నేడే విడుదల - 36 లక్షల మంది షేర్‌హోల్డర్లు ఏం ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు?


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial