పాఠశాల విద్య, ఉన్నత విద్యపై అధికారులు ఎప్పటికప్పుడు సాంకేతికను ఉపయోగించి పని చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఫ్యూచర్‌ టెక్నాలజీ స్కిల్స్‌పై ముందు చూపుతో వ్యవహరించాలని సూచించారు.


తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో హైపవర్‌ వర్కింగ్‌ గ్రూపుతో ముఖ్యమంత్రి జగన్‌ సమావేశం అయ్యారు. విద్యాశాఖ అధికారులు, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, నాస్కామ్, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్, డేటావివ్‌ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో కలసి ముఖ్యమంత్రి కీలక అంశాలపై చర్చించారు. 


విద్యా రంగంలో కీలక మార్పులపై సమాలోచనలు చేసి కార్యాచరణకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకూ విద్యార్థులకు ఫ్యూచర్‌ టెక్నాలజీ పై నైపుణ్యాభివృద్ధి ఉండాలన్నారు. అందుకు అనుగుణంగా పాఠ్యాంశాలు, పాఠ్య ప్రణాళిక రూప కల్పన తో పాటుగా, బోధనలో, శిక్షణలో ఫ్యూచర్‌ టెక్నాలజీ వినియోగం జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. 


వచ్చే సమావేశం నాటికి వీటిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యపై ప్రత్యేకంగా చర్యలను చేపట్టాలన్నారు. పాఠశాల దశ నుంచి ఉన్నత విద్య వరకు ఈ రెండింటిని అనుసంధానం చేయాలన్నారు. పాఠ్య ప్రణాళిక కూడా సమ్మిళితం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఇదే ప్రధాన లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.  


ఉన్నత విద్యలో మరింత మెరుగైన సంస్కరణలు అవసరమని, ఇండియాలో ఏఐ వంటి వర్టికల్స్‌ అభివృద్ధి చాలా తక్కువగా ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. రిస్క్‌ మేనేజిమెంట్, అసెట్‌ మేనేజిమెంట్, రియల్‌ ఎస్టేట్‌ మేనేజిమెంట్, ఫైనాన్స్‌ వంటి అంశాలను కరిక్యులమ్‌లో భాగం చేయటం ద్వార మంచి ఫలితాలు సాధించగలమని అభిప్రాయపడ్డారు. వెస్టర్న్‌ వరల్డ్‌లో వీటికి సంబంధించిన ఫ్యాక్టలీ ఉందని, ఇవన్నీ అక్కడ కరిక్యులమ్‌లో భాగమని తెలిపారు.


వర్చువల్ రియాలిటి...
వర్చువల్‌ రియాలిటీ, అగ్‌మెంటెడ్‌ రియాలటీ వంటి అంశాలు కూడా కీలకమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కేవలం ఒక సంస్ధకే పరిమితం కాకుండా, పెద్ద సంఖ్యలో స్కూళ్లు, కాలేజీల్లో ఈ కరిక్యులమ్‌ని తీసుకురావాలన్నారు. ఒక తరానికి అందుబాటులోకి తీసుకు వస్తే, వర్టికల్స్‌లో మనం నిపుణులను తయారు చేయగలుగుతామని వివరించారు. వెస్టర్న్‌ వరల్డ్‌తో పోటీపడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. స్కూల్‌ స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు ఎలా సమ్మిళతం చేయాలన్నది కూడ కీలకమని జగన్ అధికారులకు వివరించారు. 


ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఆరో తరగతి నుంచి తరగతి గదులు డిజిటలైజేషన్‌ ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. విద్యార్దులకు అవసరం అయిన అన్ని పాఠ్యాంశాలను కీలకంగానే చూడాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి తరగతి గదిలో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ఫ్యానెల్స్‌ ఏర్పాటు కావాలన్నారు. మొత్తం 63 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ఫ్యానెల్స్‌ను డిసెంబరు ఆఖరు నాటికి రెడీ చేయాలన్నారు. ఇప్పటికే 32వేల తరగతి గదుల్లో డిజిటలైజేషన్‌ ప్రక్రియ ముగిసిందని, 3వతరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెఫ్ట్‌ను అమలు జరగాలన్నారు. 


బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ పంపిణీ, ఇంగ్లిషు మీడియం అమలు, 8వతరగతి విద్యార్ధులకు ట్యాబులు వంటి కీలక నిర్ణయాలు తీసుకొని అమలు చేసిన ఘనత తమదేనని అన్నారు. ఈ మార్పులన్నీ ఏపీలోని స్కూళ్లలో చోటు చేసుకుంటున్నాయని, స్కూళ్లలో వస్తున్న ఈ మార్పులను ఇప్పుడు ఉన్నత విద్యతో సమ్మిళతం చేస్తూ మరింత ముందుకు ఎలా తీసుకువెళ్లాలన్నదే సవాల్‌గా భావించాలని జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.