భారత స్టాక్‌ మార్కెట్లకు కరోనా మూడో వేవ్‌ భయం పట్టుకుంది. కీలక సూచీలన్నీ భారీ నష్టాల్లో ఆరంభమయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు రావడం, ఎఫ్‌ఐఐ, డీఐఐలు తమ వాటాలు ఉపసంహరించడం, ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఆరంభం కావడం, డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగింపు కావడంతో మదుపరి భయపడ్డాడు. చివరి మూడు సెషన్లలో వచ్చిన లాభాలను స్వీకరించడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 800, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 200, బ్యాంక్‌ నిఫ్టీ 500 పాయింట్ల వరకు నష్టాల్లో ఉన్నాయి. మొత్తంగా లక్షల కోట్లలో ఆదాయం ఆవిరికానుంది!


క్రితం రోజు 60,223 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,731 వద్ద భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలైంది. 11 గంటల సమయంలో 59,300 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత కాస్త పుంజుకొని 59,413 వద్ద కదలాడుతోంది. 800 పాయింట్లకు పైగా నష్టాల్లో ఉంది.


బుధవారం 17,925 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,768 వద్ద మొదలైంది. 17,661 వద్ద  ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత కాస్త పుంజుకున్న సూచీ 17,690 వద్ద కదలాడుతోంది. 230 పాయింట్లకు పైగా నష్టాల్లో ఉంది.







బ్యాంక్‌ నిఫ్టీ విలవిల్లాడుతోంది. ఏకంగా 425 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 37,242 వద్ద ఆరంభమైన సూచీ 37,443 వద్ద గరిష్ఠాన్ని అందుకుంది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనై 37,058 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 37,270 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


నిఫ్టీలో 6 కంపెనీలు లాభాల్లో, 43 నష్టాల్లో ఉన్నాయి. యూపీఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హిందాల్కో, బజాజ్‌ ఆటో, మారుతి లాభాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇన్ఫీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ నష్టాల్లో ఉన్నాయి.