Best Multibagger Stock: మీ డబ్బు ఏడాదిలో రెట్టింపు అవుతుందని ఎవరైనా చెబితే, కామన్ సెన్స్ ఉన్న ఏ వ్యక్తి ఆ మాటలు నమ్మడు. అది ఉత్తుత్తి ప్రచారం లేదా ఎదుటి వ్యక్తి మోసం చేస్తున్నాడని అనుకుంటారు. ఎందుకంటే, బ్యాంకులో డిపాజిట్ చేస్తే డబ్బు డబుల్ కావడానికి 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది, ఒక్క సంవత్సరంలో ఎలా రెట్టింపు అవుతుందన్న ప్రశ్న తప్పకుండా వస్తుంది. అదే సమయంలో... డబ్బు ఏడాదిలోనే నాలుగైదు రెట్లు పెరుగుతుందని చెబితే అసలే నమ్మరు. కానీ, నిజం ఎదురుగా కనిపిస్తుంటే కొన్ని విషయాలను నమ్మక తప్పదు.
అసాధ్యం అన్న పదం స్టాక్ మార్కెట్‌లో ఉండదు. కేవలం ఒక్క రాత్రిలోనే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. లక్షాధికార్లు బిచ్చమెత్తుకుంటారు, కాణీకి ఠికాణా లేని వాడు కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. ఇలాంటి మ్యాజిక్ చేయగల షేర్లు స్టాక్ మార్కెట్‌లో చాలా ఉన్నాయి. వాటిలో, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (Rail Vikas Nigam Limited - RVNL) ఒకటి.
గత కొన్ని నెలలుగా అప్ ట్రెండ్
శుక్రవారం (01 సెప్టెంబర్ 2023) ట్రేడింగ్ ముగిసే సమయానికి, రైల్ వికాస్ నిగమ్ షేర్ ధర 5.65 శాతం జంప్‌తో రూ. 138.45 వద్ద ముగిసింది. అంతకుముందు, గురువారం రోజు 10 శాతం పతనమైంది. ఓవరాల్‌గా చూస్తే, ఈ స్టాక్ గత ఐదు రోజుల్లో 11 శాతానికి పైగా పెరిగింది. గత నెల రోజుల కాలంలో ఈ కౌంటర్‌లో క్రయవిక్రయాలు ఎక్కువగా జరిగాయి, వృద్ధి దాదాపు 12 శాతానికి పరిమితం అయింది.
ఆరు నెలల్లో డబ్బు రెట్టింపు
అయితే, కాస్త ఎక్కువ టైమ్‌లో చూస్తే మాత్రం, RVNL షేర్లు మైండ్ బ్లోయింగ్ రిటర్న్స్ ఇచ్చాయి. ఈ షేర్ ధర గత ఆరు నెలల్లోనే 110 శాతానికి పైగా పెరిగింది. అంటే, ఆరు నెలల లోపే ఇన్వెస్టర్ల డబ్బును రెట్టింపు చేసింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఈ స్టాక్ 100 శాతానికి పైగా పెరగ్గా, గత ఒక ఏడాది కాలంలో 322 శాతానికి పైగా (దాదాపు 4 రెట్లు) పెరిగింది.
ఏడాది క్రితం నుంచి కంటిన్యూ అయిన మ్యాజిక్
ప్రస్తుతం రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ షేర్ రూ. 138.45 స్థాయిలో ఉన్నప్పటికీ, కొన్ని రోజుల క్రితం రూ. 146.65 స్థాయిని తాకింది. ఇది గత 52 వారాల్లో (ఏడాది కాలంలో) రైల్ వికాస్ నిగమ్ షేర్ ప్రైస్‌లో అత్యధిక స్థాయి. ఒక సంవత్సరం క్రితం, అంటే 2022 సెప్టెంబర్ ప్రారంభంలో, ఒక షేరు ధర రూ. 32 దగ్గర ఉంది. ఈ విధంగా, RVNL స్టాక్ ఒక్క ఏడాదిలోనే నాలుగున్నర రెట్లు వృద్ధిని కనబరిచింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఇవాళ్టి రేట్లివి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial